జేసీని అష్టదిగ్భంధనం చేస్తున్న జగన్!

Update: 2019-11-20 09:12 GMT
గోదావరి జిల్లాలు - ఉత్తరాంధ్ర - కృష్ణ - అనంతపురంలు టీడీపీకి కంచుకోటలు.. ఇప్పటికే ఎన్నికల్లో గోదావరి - ఉత్తరాంధ్ర జిల్లాలను క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఇక కృష్ణ జిల్లాలో ఉద్దండులైన నేతలు - టీడీపీ ఎమ్మెల్యే వంశీలు వైసీపీకి మద్దతు పలికారు. ఇప్పుడు సీమలో టీడీపీకి మరో కంచుకోటగా ఉన్న అనంతపురంలో కూడా  పచ్చ పార్టీని నామరూపాల్లేకుండా చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. దీనికి టీడీపీ అసంతృప్తి - అసమ్మతి వాదులే కంకణం కట్టుకోవడం విశేషం.

తాజాగా అనంతపురం మాజీ ఎంపీ - టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి సీఎం జగన్ షాకిచ్చారు. జేసీ ప్రధాన అనుచరుడు అయిన షబ్బీర్ అలీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడం జేసీ బ్రదర్స్ కు షాకింగ్ మారింది.

ఇప్పటికే వల్లభనేని వంశీ - దేవినేని అవినాష్ వంటి ఉద్దండులను వైసీపీలోకి తీసుకున్న జగన్ ఇప్పుడు కృష్ణా  జిల్లాలో ఎదురులేకుండా దూసుకెళుతున్నారు. ఇప్పుడు సీమలో టీడీపీ కంచుకోట అయిన అనంతపురంపై దృష్టి సారించారు.

తాజాగా అనంతపురం మాజీ ఎంపీ జేసీ వర్గానికి జగన్ చెక్ పెట్టారు. తాడిపత్రిలో బలమైన నాయకుడిగా ఉన్న షబ్బీర్ అలీని వైసీపీలో చేర్చుకున్నారు. షబ్బీర్ అలీతో పాటు పలువురు అనుచరులు బుధవారం తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. మొత్తం 500 మంది ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.  ప్రధాన అనుచరుడే పార్టీ మారడం జేసీ బ్రదర్స్ ను కోలుకోనీయకుండా చేస్తోంది.

 జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ ఈ ఎన్నికల్లో  పోటీచేయలేదు. వీరి స్థానంలో వీరి వారసులు పోటీచేశారు. అయినా ప్రజలు జేసీ ఫ్యామిలీని తిరస్కరించి వైసీపీకి పట్టం కట్టారు.  ఇప్పుడు జేసీ అనుయాయులు కూడా వారిని వీడడం అనంతపురం జిల్లాపై వారి పట్టుకోల్పోయేలా చేస్తోందని అంటున్నారు.

ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డిపై సీఎం జగన్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆయన అక్రమంగా చేస్తున్న జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్  బస్సులపై ఉక్కుపాదం మోపారు. తాడిపత్రిలో జేసీ లారీ వ్యాపారాలకు సైతం చెక్ పెట్టారు. ఇప్పుడు నేతలను లాగుతూ వారిని అష్టదిగ్భంధనం చేస్తున్నారు. జగన్ దెబ్బతో జేసీ జిల్లాలో ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదంలో పడ్డారు.
   

Tags:    

Similar News