ఒకటో నెంబరు ఎమ్మెల్యే వస్తే..జగన్ రానిస్తారా?

Update: 2019-06-12 13:25 GMT
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై తొలి రోజుననే ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాజా ఎన్నికల్లో వైసీపీ బంపర్ విక్టరీ కొడితే... టీడీపీ 23 సీట్లతో సరిపెట్టుకోగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన ఒక్కటంటే ఒక్క సీటులోనే నెగ్గింది. అది కూడా పవన్ నిలిచిన స్థానం కాదన్న విషయం తెలిసిందేగా. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన రాపాక వరప్రసాద్... ఆ పార్టీ తరఫున బరిలో నిలిచిన అందరూ ఓడిపోగా రాపాక ఒక్కరే గెలిచారు. ఈ క్రమంలో సింగిల్ గా ఉండి ఏం చేస్తారు? వైసీపీలో చేరిపోాతారా? అని మీడియా అడిగితే... ఆయన చెప్పిన విషయం కూడా తెలిసిందే కదా. జనసేనలో ఉంటే ఒకటో నెంబరు  ఎమ్మెల్యేగా ఉంటానని, అదే వైసీపీలో చేరితే 152వ ఎమ్మెల్యే అవుతానని తనదైన శైలి సమాధానం చెప్పిన రాపాక పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే కదా.

ఈ అదిరిపోయే కామెంట్ చెప్పి ఇంకా పది రోజులు కూడా కాలేదు... అప్పుడే రాపాక కాక రేపారు. జనసైనికులతో పాటు తనకు టికెట్ ఇచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్ కు కూడా షాకిచ్చేలా వ్యవహరించిన రాపాక.... వైసీపీ అధినేత, ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అది కూడా అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే. ఏపీ సీఎం హోదాలో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్న జగన్ తనకు తారసపడగానే... జగన్ వద్దకెళ్లి జగన్ కు శుభాకాంక్షలు చెప్పారు. తన వద్దకు వచ్చిన రాపాకకు షేక్ హ్యాండిచ్చిన జగన్.. కాసేపు ఆయనతో మాట్లాడి ఆ తర్వాత అసెంబ్లీలోకి వెళ్లిపోయారు.

జగన్ అటు వెళ్లగానే తనను చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులో రాపాక తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. జగన్ కు గ్రీటింగ్స్ మాత్రమే చెప్పానని పేర్కొన్నారు. అంతే తప్పించి తాను జగన్ ను కలిసిన వైనానకి పెద్దగా ప్రాధాన్యతేమీ లేదని చెప్పుకొచ్చారు. రాపాక వైనం చూస్తుంటే... ఒకటో నెబబరు ఎమ్మెల్యేగా ఉండటం కంటే 152వ ఎమ్మెల్యేగా ఉండేందుకే ఆయన మొగ్గు చూపుతున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. మరి పార్టీ ఫిరాయింపులకు బద్ద విరోధిగా ఉన్న జగన్... రాపాక వస్తే వైసీపీలోకి రానిస్తారా? అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.

Tags:    

Similar News