జ‌న‌సేన బోణీ...రాజోలులో పార్టీ అభ్య‌ర్థి విజ‌యం

Update: 2019-05-23 10:58 GMT
జనసేనకు సైలెంట్ ఓటింగ్ జరిగిందని, మే 23న తమ సత్తా ఏంటో తెలుస్తుందని.. ఈ ఎగ్జిట్ పోల్స్‌కు అందని రీతిలో జనాలు తమకు ఓటేశారని జ‌న‌సేన పార్టీ ప్ర‌క‌టించిన దాంట్లో వాస్త‌వం ఎంతో తేలిపోయింది. కౌంటింగ్ ప్ర‌క్రియ మొదలైన నాటి నుంచి ఒక్క రౌండ్‌లోనూ ఆ పార్టీ ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ముంద‌జలో లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేసిన స్థానాలు మిన‌హా ఏ ఇత‌ర చోట్లా ఆ పార్టీ త‌న స‌త్తా చాటుకోలేదు. అయితే ఎట్ట‌కేల‌కు ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా రాజోలులో విజ‌యం సాధించింది. జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాదరావు విజ‌యం సాధించారు.

ఏపీ ఎన్నికలపై జనసేన ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందని సీ-ఓటర్ ఇండియా సర్వే పరోక్షంగా వెల్లడించింది. టీడీపీకి 36.5 శాతం ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 34.9 శాతం ఓట్లు పడ్డాయని సీ-ఓటర్ ఇండియా అంచనా వేసింది. సీ-ఓటర్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం జనసేనకు 20 శాతానికిపైగా ఓట్లు పడ్డాయి. మిగతా ఎగ్జిట్ పోల్స్‌లో జనసేన ప్రస్తావనే లేని పరిస్థితుల్లో సీ-ఓటర్ ఇండియా సర్వే జనసైనికుల్లో ఆశలు రేపాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావించారు. అయితే, కౌంటింగ్‌లో దీనికి భిన్న‌మైన ట్రెండ్ క‌నిపించింది.

కాగా, రాజోలులో జనసేన అభ్యర్థి గెలుపొందారు. రాజోలులో టీడీపీ త‌ర‌ఫున గొల్లపల్లి సూర్యారావు - వైఎస్సార్సీపీ త‌ర‌ఫున  బీ రాజేశ్వరరావు - జ‌న‌సేన నుంచి రాపాక వరప్రసాదరావు బ‌రిలో దిగారు. అయితే, జనసేన అభ్యర్థి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపొందారు. జ‌న‌సేన గెలుపు ఆ పార్టీ నేత‌ల్లో సంతోషం నింపుతోంది.



Tags:    

Similar News