చర్చి పాస్టర్లకు జగన్ షాక్..

Update: 2022-01-27 11:30 GMT
కాలం కలిసి వస్తే.. భిన్న అంశాలు ఎలా కలిసి వస్తాయనటానికి నిలువెత్తు నిదర్శనంగా 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్ని చెప్పాలి. ఒకే విధానాన్ని అప్పటి అధికార టీడీపీ.. విపక్ష వైసీపీ ఇద్దరూ అమలు చేసినా..ఓటర్లు మాత్రం జగన్ వైపు నిలవటంతో.. చారిత్రక విజయం ఆయన సొంతమైంది. ఆయన సాధించిన విజయంలో కొందరు కీలక భూమిక పోషించారు. వారిలో చర్చి పాస్టర్లు కూడా ఉన్నారని చెప్పక తప్పదు. తన గెలుపులో వారెంత పాత్ర పోషించారో జగన్ కు తెలియంది కాదు. అయితే.. చర్చిల్ని నడిపే పాస్టర్లలో చాలామంది  నిరుపేదలుగా ఉన్న విషయాన్ని గుర్తించిన వైసీపీ.. వారికి నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జాబితాను తయారు చేస్తున్న వేళ.. ఊహించని కబురు జగన్ సర్కారు నుంచి వచ్చింది. గతంలో ఇచ్చిన నిబంధనల్లో కొన్ని మార్పులు చేసి.. తాజాగా కొత్త నిబంధనను ఇచ్చారు. పాస్టర్ల గౌరవ వేతనం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలన్న సూచన చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల మంది పాస్టర్లు గౌరవ వేతనం కోసం దరఖాస్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం గ్రామ.. వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇలాంటివేళలోనే అనుకోని ట్విస్టు ఎదురైంది. అప్లికేషన్లను పరిశీలించినప్పుడు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేవలం 500 మంది మాత్రమే అర్హులుగా తేలారు. మిగిలిన వారంతా గౌరవ వేతనానికి అర్హత లేదని తేల్చారు. దీంతో.. ఏం చేయాలన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవేళ అర్హుల వివరాలు వెల్లడించి.. మిగిలిన వారికి ఇవ్వలేమని చెప్పిన పక్షంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందన్న భయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అలా అని.. నిబంధనలకు భిన్నంగా అర్హుల్ని ఎంపిక చేస్తే ఎక్కడ తమ తలకు చుట్టుకుంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
పాస్టర్లను గౌరవ వేతనం కోసం ఎంపిక చేసేందుకు ప్రభుత్వం మూడు నిబంధనల్ని పెట్టింది. అందులో కీలకమైన వాటిలో..

-  చర్చి మినిస్ట్రీస్ రిజిస్ట్రేషన్ పొంది ఉండాలి

-  చర్చి స్థలం సదరు సొసైటీ పేరు మీద ఉండాలి

-  గౌరవ వేతనం పొందాలని భావిస్తున్న పాస్టర్ కు ఇతరత్రా ఆదాయం ఉండకూడదు

ఈ నిబంధనల్లో ఎక్కువ మంది పాస్టర్లు అనర్హులుగా తేలటానికి ప్రధాన కారణం.. ఎక్కువమంది చర్చి స్థలాలు సొసైటీ పేరు మీద లేకపోవటం. దీంతో.. ఇప్పుడీ విషయాన్ని ఏం చేయాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే.. తాజా పరిణామానికి మరో అంశం కూడా కారణమని చెబుతున్నారు. మొదట్లో పాస్టర్లకు గౌరవ వేతనం విషయంలో ఉదారంగా ఉందామని ప్రభుత్వం భావించింది. ఈ లెక్కన చూసినప్పుడు తమకు వచ్చిన 16వేల మందికిరూ.5వేల చొప్పున ఇస్తే.. నెలకు రూ.8కోట్లు అవసరం ఉంటుంది. ఇప్పుడున్న ఆర్థికపరిస్థితుల్లో వీలైనంత వరకు ఖర్చు తగ్గించాలన్నదే లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారు.

అలా అని మొత్తం 16వేలలో 500 మంది మాత్రమే అర్హులని ప్రకటిస్తే.. ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని.. దీంతో ముందు నుయ్యి.. వెనుక గొయ్యి లాంటి పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పుడీ సమస్య నుంచి బయటపడాలంటే.. నిబంధనల్లో కొంత మార్పులు చేసి.. కనీసం 50 శాతం మందినైనా సరే.. గౌరవ వేతనానికి అర్హత ఉండేలా చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News