నాడు ఎన్టీయార్... నేడు జగన్... ?

Update: 2021-12-06 15:30 GMT
అవును. జగన్ కి ఎన్టీయార్ కి పొలిటికల్ గా  కొన్ని పోలికలు ఉన్నాయి. ఇద్దరూ తమ మాటే చెల్లుబాటు కావాలనుకుంటారు. ఇద్దరూ కూడా మంత్రులు కాకుండానే డైరెక్ట్ గా ముఖ్యమంత్రులు అయ్యారు. అయితే జగన్ ఎంపీగా, ప్రతిపక్ష నేతగా పదేళ్ల పాటు పనిచేశారు. అయితే పాలనాపరంగా ఇద్దరూ కొత్తే.  ఇక దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడంతో ఇద్దరూ ఇద్దరే. ప్రజాకర్షణను చూసుకుని జోరు చేయడంలో కూడా అన్న గారితో జగన్ సరిసాటిగా ఉంటారని విశ్లేషణలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ ఇద్దరూ కూడా బంపర్ మెజారిటీతోనే ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక 1984 నాటికి వస్తే అప్పటికి ఎన్టీయార్ ముఖ్యమంత్రి అయి ఏడాది పై చిలుకు దాటింది. నాడు కూడా ఉద్యోగులు పలు డిమాండ్ల కోసం టీడీపీ సర్కార్ కి విన్నపాలు చేసుకున్నారు. అయితే ఎందుకో ప్రభుత్వం వాటిని ఆమోదించలేదు. అది చిలికి చిలికి ఏకంగా ఉద్యమ స్థాయికి చేరింది.

నాడు ఉమ్మడి ఏపీలో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఏకంగా నెలకు పైగా సుదీర్ఘ సమ్మె చేశారు. మరో వైపు ఉద్యోగులకు వ్యతిరేకంగా నాటి ఎన్టీయార్ సర్కార్ పుస్తకలను ప్రచురించి జనాలకు పంపిణీ చేసింది. ఎక్కువగానే వారికి జీతాలు ఇస్తున్నట్లుగా అందులో సర్కార్  పేర్కొంది.  ఉద్యోగుల సమ్మె మీద జనాలనే తీర్పు చెప్పమంది.  మొత్తానికి ఉద్యోగుల సమ్మెతో ఎన్టీయార్ ప్రభుత్వానికి వారికి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఆ తరువాత ఇద్దరూ కొంత తగ్గడంతో ఆ వివాదం ముగిసింది.

ఇపుడు మళ్లీ ఏపీలో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. తాము ఆందోళనను ఉధృతం చేస్తామని కూడా వారు ప్రకటించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అన్నీ పరిష్కరించాలని కూడా కోరుతున్నారు. ఇక్కడ చూసుకుంటే  జగన్ సర్కార్ కి ఉద్యోగుల విషయంలో వేరే భావం లేదు, ప్రభుత్వం నుంచి రెచ్చగొట్టే ప్రకటనలు లేవు. అయితే ఆర్ధిక పరిస్థితి దృష్ట్యానే డిమాండ్లను అన్నీ ఆమోదించలేకపోతున్నామని చెబుతున్నారు.

మరో వైపు చూస్తే ఉద్యోగ నాయకులు కొందరు మాత్రం పరిధి దాటి విమర్శలు చేస్తున్నారు అన్నది ఉంది. ఒక ఉద్యోగ సంఘం నేత ఒకరు  జగన్  ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రకటించడం వివాదానికి తావు ఇచ్చేలా ఉంది. ఇక్కడే జగన్ సర్కార్ ఏమైనా గట్టిగా బిగుసుకుపోతుందేమో అన్న డౌట్లు ఉద్యోగ వర్గాలలో ఉన్నాయట. జగన్ విషయంలో ఇలాంటి ప్రకటనలు పనిచేయవని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.

అలాగని మౌనంగా ఉండకుండా శాంతియుతంగా ఆందోళన చేపట్టాలని, అయితే రెచ్చగొట్టుడు ప్రకటనల వల్ల ఇంకా ఎక్కువ నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని కూడా అంటున్నారు. ఇక ప్రజాస్వామ్యయుతంగానే ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామని 2024 ఎన్నికల్లో ఇంటికి పంపిస్తామని చెబుతున్నా కొందరు ఉద్యోగ సంఘం నేతలు అప్పటిదాకా పీయార్సీ సర్కార్ ఇవ్వకూడదని అనుకుంటున్నారా అన్న చర్చ అయితే ఉద్యోగులలోనే ఉందిట. మొత్తానికి జగన్ పది రోజుల్లో పీయార్సీ ఇస్తామని చెప్పారు, అయితే నివేదిక ఇవ్వడంలేదని ఆందోళనాపధంలో ఉద్యోగులు వెళ్ళేందుకు సిద్ధపడుతున్నారు.

ఇక కొందరు  ఉద్యోగ సంఘం నేతల రెచ్చగొట్టుడు ప్రకటనల వెనక విపక్ష రాజకీయం ఉందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. మరి ఇదే తీరున కనుక దూకుడు చెస్తే మాత్రం ప్రభుత్వం మొండిగా వెనక్కిపోయేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే మాత్రం ఏపీలో 1984 నాటి పరిస్థితులు పునరావృత్తం అవుతాయా అన్నదే చర్చ.   నాడు ప్రభుత్వ ఉద్యోగులతో  ఎన్టీయార్ సమరానికి సై అన్నారు, నేడు జగన్ సై అంటారా లేక  సామరస్యంగా ఉంటారా అన్నది చూడాలి.
Tags:    

Similar News