బాబుకు అదే పనిగా అవకాశం ఇస్తున్న జగన్?

Update: 2021-12-07 04:20 GMT
2004 ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు.. విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తుందన్న నిరసనలు.. ఆందోళనలు వ్యక్తమయ్యాయి. నాటి విపక్షం బలంగా లేదన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు.. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను అర్థం చేసుకోలేదు.

విద్యుత్ బిల్లులపై మరింత కఠినంగా వ్యవహరించారు. ఇలాంటివేళ.. సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన దివంగత మహానేత వైఎస్.. అప్పట్లో ప్రజల సెంటిమెంట్ ను తనకు అనుకూలంగా మార్చుకోవటమే కాదు.. చంద్రబాబు ప్రభుత్వ తీరును తూర్పార పట్టారు. అలా విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం చంద్రబాబు తొమ్మిదిన్నరేళ్ల పాలనకు చెక్ పెట్టేలా చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమికి గురయ్యేలా చేసింది.

ఇదంతా చూసినప్పుడు.. అధికారంలో ఉన్న వారు ఇచ్చే అవకాశమే విపక్ష నేతలకు ఆయుధాలు అవుతాయని.. పాలనలో భాగంగా వారు తీసుకునే నిర్ణయాలు వారికి ఊహించని ఎదురుదెబ్బ పడేలా చేస్తాయని చెబుతారు. ఇప్పుడు అలాంటి సీనే ఏపీలో నెలకొంది. పేదల పక్కా ఇళ్లపై ఏపీ సర్కారు తీసుకొచ్చిన ఓటీఎస్ పథకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామాన్యులు.. దిగువ మధ్యతరగతి వారిని లక్ష్యంగా చేసుకున్న ఈ పథకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. జగన్ ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలన్న తపన చంద్రబాబులో కనిపిస్తోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ‘‘1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు కట్టించిన ఇళ్లను మొదలు పెట్టి గత ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లకు క్రమబద్ధీకరణ పేరుతో డబ్బులు వ సూలు చేయడానికి ఈ ప్రభుత్వానికి ఏం హక్కుంది? ఈ ప్రభుత్వం ఆ ఇళ్లు ఇచ్చిందా? స్థలాలు ఇచ్చిందా? తూర్పు గోదావరి జిల్లా మండపేటలో 1984లో పేదలు తమ ఇళ్ల నిర్మాణానికి రూ.6 వేలు రుణం తీసుకొన్నారు.

మూడున్నర దశాబ్దాల తర్వాత వాటికి ఇప్పుడు ప్రభుత్వం రూ.6 వేలు చెల్లించాలని ఒత్తిడి తెస్తోంది. చాలా ఇళ్లు కూలిపోయాయి. అయినా డబ్బు చెల్లించాల్సిందేనని వేధిస్తున్నారు. పాత ఇళ్లు బాగు చేసుకోవడానికి మా ప్రభుత్వం తలకు రూ.10 వేలు ఇచ్చింది. మీకు చేతనైతే రూ.25 వేలు ఇవ్వండి.

అది వదిలిపెట్టి గ్రామాల్లో రూ. 10వేలు, పట్టణాల్లో రూ.20 వేలు, నగరాల్లో రూ.30 వేలు కట్టి తీరాలని ఒత్తిడి తేవడం దుర్మార్గం. మా ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలో కొన్ని ఇళ్లకు పైసా కూడా తీసుకోకుండా మేం హక్కు పత్రాలు ఇచ్చాం. ఆ పని వీళ్లు ఎందుకు చేయలేరు?’’ అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపు వేళ.. ఆ మొత్తాల్ని చెల్లించొద్దంటూ.. త్వరలోనే తమ ప్రభుత్వం వచ్చి.. ఆ బకాయిల్ని రద్దు చేస్తుందంటూ అప్పట్లో వైఎస్ వరుస ప్రకటనలు చేశారు. ఆయన మాటల్ని విని.. విద్యుత్ బిల్లులు చెల్లించకపోవటం.. వాటి వసూలు విషయంలో అధికారులు ప్రదర్శించిన అత్యుత్సాహం నాటి బాబు ప్రభుత్వానికి మైనస్ అయ్యింది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు చేసిన తప్పును.. వైఎస్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇప్పుడు వైఎస్ కుమారుడు జగన్ సీఎంగా ఉండి నాడు బాటు చేసిన తప్పుల్లాంటివే చేస్తుంటే.. విపక్షంలో ఉన్న చంద్రబాబు నాడు వైఎస్ మాదిరి లబ్థి పొందాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇందుకు తగ్గట్లే.. తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ సర్కారు తీసుకొచ్చిన ఓటీఎస్ పథకానికి కట్టాల్సిన డబ్బులు కట్టనక్కర్లేదని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేస్తుందని చెబుతున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు జగన్ సర్కారు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పక తప్పదు. తాను తీసుకుంటున్న నిర్ణయానికి సంబంధించి.. గతం గురించి జగన్ ఒకసారి తెలుసుకుంటే.. ఆయన నిర్ణయాల్లో మార్పులు వచ్చే వీలుందేమో?


Tags:    

Similar News