తాజా ఇంట‌ర్వ్యూలో హోదాపై జ‌గ‌న్ ఫుల్ క్లారిటీ!

Update: 2018-08-18 06:19 GMT
తాజాగా ప్ర‌ముఖ ఆంగ్ల మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఏపీ విప‌క్ష నేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు అంశాల్ని ప్ర‌స్తావించారు. అన్నింటికి మించి.. ఏపీకి ప్రాణాధార‌మైన ప్ర‌త్యేక హోదాపై ఆయ‌న ఫుల్ క్లారిటీ ఇచ్చారు. జ‌గ‌న్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగానే కాదు.. ఏపీ రాజ‌కీయంలో కీల‌క మార్పుల‌కు  అవ‌కాశం ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

టైమ్స్ ఆఫ్ ఇండియాకు జ‌గ‌న్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూలోని ముఖ్యాంశాల్ని చూస్తే..

మీడియా ప్ర‌తినిధి:  2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గెలుపుపై మీ అంచనా ఏమిటి?

జ‌గ‌న్‌:  2014 ఎన్నికల నాటికి చంద్రబాబు అధికారంలో లేడు కనుక ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఆయనపై ఉండే అవకాశం లేదు. పైగా బీజేపీ - పవన్‌ కల్యాణ్‌ టీడీపీ ఎన్నికల చిహ్నమైన సైకిల్‌ కి రెండు చక్రాలుగా వ్యవహరించారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ - టీడీపీ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లలో తేడా కేవలం 1.5 శాతం మాత్రమే. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. రైతులు పంట ధరల విషయంలో చాలా అసంతృప్తితో ఉన్నారు. బ్యాంకులకు రైతుల రుణ బకాయిలు ప్రస్తుతం రూ. 1,26,000 కోట్లకు చేరుకున్నందున రుణమాఫీ పథకం ఒక ప్రహసనంలా తయారైంది. గత నాలుగేళ్లలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఏపీకి తీసుకొచ్చానని - 20 లక్షల ఉద్యోగాలను సృష్టించానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు కానీ వాస్తవం పూర్తి భిన్నంగా ఉంది. కాబట్టి ఈసారి మేం పరిస్థితులను పూర్తిగా మార్చి వేయబోతున్నాం.

మీడియా ప్ర‌తినిధి:  బీజేపీతో పొత్తు నుంచి బాబు బయటపడటంపై మీరేమనుకుంటున్నారు?

జ‌గ‌న్‌:  తన వైఫల్యాలన్నింటికీ ఎవరో ఒకరిని తప్పుపట్టాలని చంద్రబాబు కోరుకున్నారు. ఈ విషయంలో బీజేపీ బాబుకు లడ్డూలాగా దొరికింది. ఆంధ్రప్రదేశ్‌ అన్నివిధాలుగా లబ్ధి పొందిందని చంద్రబాబు 2016 జనవరి 27న బీజేపీని ప్రశంసించారు.నెల తర్వాత కేంద్ర బడ్జెట్‌ ఆమోదం పొందాక కూడా బాబు తన అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇక 2016 సెప్టెంబర్‌ 8న టీడీపీ ఎంపీల సమక్షంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు.

చంద్రబాబుతో సంప్రదించిన తర్వాతే ప్యాకేజీని ఖరారు చేశారని స్పష్టంగా సూచనలు వచ్చాయి. వెంటనే, ఏపీ ముఖ్యమంత్రి చంద్ర బాబు ప్రత్యేక ప్యాకేజీకి స్వాగతం పలికి, ఆ మేరకు ఏపీ అసెంబ్లీలో తీర్మానం ఆమో దింపజేశారు కూడా. ఇప్పుడు బీజేపీతో తెగ తెంపులు చేసుకోవడం ద్వారా బాబు తన వైఫల్యాన్నింటికీ బీజేపీని తప్పుబడుతున్నారు. కానీ ఏపీ ప్రజలు మాత్రం దీన్ని బాగానే అర్థం చేసుకున్నారు.

మీడియా ప్ర‌తినిధి: రాష్ట్రపతి పదవికి రామ్‌నాథ్‌ కోవింద్‌ని ప్రకటించినప్పుడు మీరు ఎన్డీఏకి మద్దతు పలికారు కదా?

జ‌గ‌న్‌: వాస్తవానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరే కంగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది మేమే. ఆ తర్వాతే టీడీపీ ముందుకొచ్చింది. మాతో చేతులు కలపాలని మేం వారిని కోరాం. ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు మొత్తంగా రాజీనామా చేసి ఉంటే, అది యావద్దేశానికీ ప్రత్యేక హోదా అంశంపై బలమైన సందేశం పంపి ఉండేది. ఒకవేళ లోక్‌సభలో మా అయిదుగురు ఎంపీలూ కొనసాగి ఉన్నా, టీడీపీ ఈమధ్యే ప్రతి పాదించిన అవిశ్వాస తీర్మానాన్ని బలపర్చి ఉండే వాళ్లం. అయితే, బీజేపీ, టీడీపీ రెండూ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ద్రోహం చేశాయి. ఈ రెండు పార్టీలు తమ మ్యానిఫెస్టోలలో హోదాను ప్రస్తావించి తర్వాత వెన్నుపోటు పొడిచాయి.

మీడియా ప్ర‌తినిధి:  ప్రత్యేక హోదాను ఇచ్చి ఉంటే దాని ప్రభావం ఏపీపై ఎలా ఉండేది?

జ‌గ‌న్‌: ప్రత్యేక హోదా హామీతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు. హోదానే వచ్చి ఉంటే పరిశ్రమలూ, హోటళ్లూ,  ఆసుపత్రులూ రాష్ట్రానికి వెల్లువలా వచ్చి ఉండేవి. ప్రత్యేక హోదా లేని ఆంధ్రప్రదేశ్‌ శూన్యమే. ఏపీ భవిష్యత్తుకు ప్రత్యేక హోదా ప్రాణాధారం వంటిది.

మీడియా ప్ర‌తినిధి:  రాష్ట్రంలోని ఎక్కువ ఎంపీ సీట్లు మీకే వచ్చి, ఎన్డీఏ, యూపీఏ రెండింటికీ సాధారణ మెజారిటీకి తక్కువ సీట్లు వచ్చాయనుకోండి, మీరు ఎవరిని బలపరుస్తారు?

జ‌గ‌న్‌: మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ప్రధానమంత్రి మోదీనా లేక రాహుల్‌ గాంధీనా అనేది మాకు ప్రాధాన్యం కాదు. ప్రత్యేక హోదాను ఎవరు ఇస్తే వారినే మేం బలపరుస్తాం. గతానుభవం దృష్ట్యా, మేం ఎవరినీ నమ్మలేం. ఏ పార్టీవారైనా సరే ముందుగా అధికారం లోకి వచ్చి ప్రత్యేక హోదాను ప్రకటిస్తే మేం మద్దతు ఇస్తాం.

మీడియా ప్ర‌తినిధి: వైఎస్సార్‌ సీపీ - బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉందన్న  బాబు ఆరోప‌ణ‌ల‌పై? 

జ‌గ‌న్‌: మేం ఎవరి పక్షానా లేం. మేం ఎల్లప్పుడూ అంశాల వారీగానే మద్దతిచ్చాం. నిజానికి, మేం భూసేకరణ బిల్లు విషయంలో బీజేపీని వ్యతిరేకించాం. రాజ్యాంగబద్ధ పదవులకు ఎన్నికలు ఉండకూడదనే ఉద్దేశంతోనే మేం ఎన్డీయే తరపున అధ్యక్షపదవికి నామినీగా ఉన్న రామ్‌ నాథ్‌ కోవింద్‌కు మద్దతిచ్చాం. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్ పదవికి టీడీపీ నామినీ అయిన కోడెల శివప్రసాదరావుకు కూడా మద్దతి చ్చాం. వాస్తవానికి పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో కాపురంచేస్తూ వస్తోంది చంద్రబాబే.

మీడియా ప్ర‌తినిధి:  మీకు పాలనాపరమైన అనుభవం లేదని మీ ప్రత్య ర్థులు చెబుతున్నారు కదా?

జ‌గ‌న్‌: నేను రెండుసార్లు ఎంపీగా గెలిచాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉంటున్నాను. ప్రజాజీవితంలో నా పదేళ్ల అనుభవాన్ని ఎవరైనా ఎలా తగ్గించి చూపుతారు? ఇప్పుడు పాదయాత్ర విషయానికి వస్తే, నేను నా కుటుంబం కంటే ఎక్కువ సమయం ప్రజలతోనే గడుపుతున్నాను. మరోవైపున తొమ్మి దేళ్ల పాలనానుభవం కలిగిన చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్‌ చరిత్రలోనే ప్రజలకు ఏమీ చేయని ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు.

మీడియా ప్ర‌తినిధి:  ఆంధ్రప్రదేశ్‌ లో సాధారణ మెజారిటీ కంటే తక్కువ స్థానాలు మీకు వచ్చి, బీజేపీ ఏపీలో కొన్ని స్థానాలు గెల్చుకున్నట్లయితే, మీరు ఆ పార్టీ మద్దతు తీసుకుంటారా?

జ‌గ‌న్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆ విధంగా ఓట్లు వేసిన చరిత్ర లేదు. వారు పూర్తి మెజారిటీ అయినా ఇస్తారు లేదా అసలు ఇవ్వరు. అందుచేత, రాబోయే శాసనసభ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి తక్కువ స్థానాలు మాకు వచ్చే ప్రశ్నే అసలు తలెత్తదు.


Tags:    

Similar News