కాంగ్రెస్..బిజేపీలకు సమదూరం

Update: 2018-07-18 05:38 GMT
ఎన్నికల సమయంలోనైనా... ఎన్నికల అనంతరమైనా తాను కాంగ్రెస్ - భారతీయ జనతా పార్టీలకు సమదూరాన్ని పాటిస్తానని ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష నాయకుడు - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఓ తెలుగు ఛానల్‌ కు ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు. తాను భారతీయ జనతా పార్టీతో లోపాయికారీ ఒప్పందం చేసున్నానని వస్తున్న ప్రచారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా  చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలేనని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా అంశంలో ముందుగా స్పందించింది... రాజీనామాలు చేసింది తమ పార్టీ సభ్యులేనని ఆయన అన్నారు.

"రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఉద్యమం చేస్తున్నది మా పార్టీయే. లోక్‌ సభలో మా పార్టీ సభ్యులే ముందుగా రాజీనామా చేశారు. ఈ విషయం ప్రజలందరూ గుర్తుంచుకోవాలి" అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అన్యాయంగా - సమన్యాయం పాటించకుండా విభజించిన కాంగ్రెస్ పార్టీతోనూ, విభజన అనంతరం ఆ హామీలను పాటించుకోని భారతీయ జనతా పార్టీతోనూ కూడా తాము దూరంగానే ఉంటామని జగన్ అన్నారు. ప్రజలు ముఖ్యమా.. ? రాజకీయాలు ముఖ్యమా... ? అని తనను ఎవరైనా ప్రశ్నిస్తే తనకు ముందు ప్రజలే ముఖ్యమని చెబుతానని - వారి తర్వాతే రాజకీయాలని వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విభజన బిల్లును సభలో ప్రవేశపెట్టే సమయంలో జాతీయ పార్టీలు రెండూ హామీలు గుప్పించాయని - రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లు అయినా వాటిని పరిష్కరించే చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. " లోక్‌ సభలో బిల్లు పెట్టే సమయంలో కాంగ్రెస్ పార్టీ వారి సభ్యులతో కూడా చర్చించలేదు. ఒంటెత్తు పోకడలతో వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను నట్టేట ముంచిన వారితో నేను ఎలా కలుస్తాను. ఇక భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదు. ఒక విధంగా రెండు జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో ఆడుకున్నాయి" అని అన్నారు. ఇంటర్వ్యూ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా - నిర్మొహమాటంగా వ్యక్తం చేసిన జగన్ మోహన్ రెడ్డి బిజెపితో బంధంపై చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.
Tags:    

Similar News