హైద‌రాబాద్ లో జ‌గ‌న్ ఫ్లెక్సీలు!

Update: 2019-06-13 06:30 GMT
రాజ‌కీయం మొత్తంగా మారిపోయింది. మొన్న‌టివ‌ర‌కూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అధినేత ఫోటోల‌తో బ్యానర్లు ఏర్పాటు చేయ‌టానికి సైతం సంశ‌యించే ప‌రిస్థితి ఉండేది. ఇప్పుడు తెలంగాణ‌.. ఏపీ రాష్ట్రాధినేత‌ల మ‌ధ్య న‌డుస్తున్న దోస్తానా కార‌ణంగా స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోయాయి.

మొన్న‌టి వ‌ర‌కూ సీమాంధ్ర‌కు చెందిన అధినేత‌ల‌కు సంబంధించిన ఏ కార్య‌క్ర‌మానికైనా హైద‌రాబాద్ లో వారి ఫోటోల‌తో ఉన్న ఫ్లెక్సీలు.. ప్ర‌చార సామాగ్రిని వాడేందుకు సంశ‌యంగా ఉండేది. ఇప్పుడవ‌న్ని తొలిగిపోయాయి. కేసీఆర్‌.. జ‌గ‌న్ మ‌ధ్య స్నేహంతో హైదాబాద్ లో కొత్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

ఇప్పుడు న‌గ‌రంలో జ‌గ‌న్ ఫ్లెక్సీలు జోరుగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. స‌ద‌రు ఫ్లెక్సీల్లో జ‌గ‌న్ తో పాటు.. గులాబీ బాస్ కేసీఆర్‌.. టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటోల్ని క‌లిపి పెట్టేస్తున్నారు. కేసీఆర్.. కేటీఆర్ పుట్టిన‌రోజులు.. వారు ఏపీకి వెళ్లిన సంద‌ర్భంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌టం..  ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హిస్తుండ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ చూశాం.

అదేందో కేసీఆర్ ఫ్లెక్సీలు ఏపీలో ద‌ర్శ‌న‌మిస్తాయి కానీ.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పార్టీ అధినేత‌ల ఫ్లెక్సీలు ప‌దేళ్ల పాటు ఉన్న ఉమ్మ‌డి రాజ‌ధానిలో క‌నిపించ‌వే అన్న ఆవేద‌న ప‌డేటోళ్ల‌కు తాజా ఫ్లెక్సీలు అమితానందాన్ని క‌లిగిస్తున్నాయి. అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌.. కేసీఆర్ కాంబినేష‌న్లో రెండు రాష్ట్రాల మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డ‌టంతో పాటు.. రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య సోద‌ర భావం అంత‌కంత‌కూ పెరుగుతుంద‌న్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News