పశ్చిమ స్పందన బాగుంటే బాబుకు దడే!

Update: 2018-05-14 01:12 GMT
విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న పాదయాత్ర ఆదివారం నాటికి పశ్చిమగోదావరి జిల్లాకు చేరుకుంది. పైగా ఇదే జిల్లాలో 2000 కిలోమీటర్ల మార్కును వైఎస్ జగన్ పూర్తిచేయబోతున్నారు. ఆ సందర్భంగా ఒక 40 అడుగుల పైలాన్ ను ఆవిష్కరించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. అయితే కీలకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే. కృష్ణా జిల్లానుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు జగన్ ఎంట్రీ చాలా ఘనంగా జరిగింది. జనం వెల్లువలా వచ్చి జగన్ ను హారతులతో, తిలకాలు దిద్ది స్వాగతించారు.  ఈ సందర్భంగా కొన్ని గంటలపాటూ ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. ఇదంతా జరిగినది.. గత 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా కట్టబెట్టని పశ్చిమగోదావరి జిల్లాలోనే అని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది.

జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న పాదయాత్ర ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ పవనాలు గాలి మళ్లుతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉన్న సిటింగ్ స్థానాల్లో చాలా వాటిని కోల్పోక తప్పదనే అభిప్రాయాలు నియోజకవర్గాలనుంచి వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఎన్డీయే

 నుంచి బయటకు వచ్చిన తర్వాత.. చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలు, చెబుతున్న మాటలు ప్రజల్లో పలు రకాల సందేహాలకు తావిస్తున్నాయి. అనుమానాస్పద వాతావరణాన్ని తయారు చేస్తున్నాయి.

అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజాదరణ గతంలో కంటె పెరుగుతున్నదనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన పాదయాత్ర పట్ల వస్తున్న జనస్పందన ఎవ్వరూ చెప్పకుండానే ప్రజలకు అలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నది. పైగా గత ఎన్నికల్లో ఒక సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా తెలుగుదేశానికి పడడానికి, తద్వారా అధికారం దక్కడానికి ఒక కీలక ఎలిమెంట్ గా ఉన్నటువంటి పవన్ కల్యాణ్ ఈసారి సొంతంగా పోటీపడుతున్నారు. అలాంటి నేపథ్యంలో గతంలో నూరుశాతం స్థానాలను తెడేపాకు కట్టబెట్టిన ప.గో. జిల్లాలో జగన్ యాత్రకు స్పందన గొప్పగా వస్తే గనుక, తెలుగుదేశానికి ఇబ్బందే అని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. పశ్చిమలో ప్రత్యేకించి.. జగన్ యాత్ర సాగే తీరుతెన్నులపై చంద్రబాబుకు సమాచారం అందించడానికి నిఘావర్గాలు కూడా కన్నేసినట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News