జగన్ - కేసీఆర్..ఇచ్చిపుచ్చుకోవడాలు మొదలయ్యాయ్

Update: 2019-06-02 16:50 GMT
హైదరాబాద్‌ లో ఏపీకి కేటాయించిన ప్రభుత్వ భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ లో ఏపీ పోలీస్ విభాగానికి చెందిన ఒక భవనం - ఇతర కార్యాలయాలకు మరొక భవనం కేటాయిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ భవనాలను ఏపీ - తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం చెరి సగం కేటాయించింది. ఏపీ పాలన అంతా అమరావతి నుంచే నడుస్తుండడంతో హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వానికి చెందిన పలు భవనాలు ఖాళీగా ఉన్నాయి. అలాంటివాటిలో ఒక భవనాన్ని ఏపీ పోలీస్ శాఖకు - మరో భవనాన్ని ఇతర కార్యాలయాలకు కేటాయించి - మిగిలిన అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించారు ఇప్పుడు.

హైదరాబాద్‌ లో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించాలని గవర్నర్ నరసింహన్‌‌ ను తెలంగాణ సీఎం కేసీఆర్ కోరడంతో ఈ చర్య తీసుకున్నారు. కొన్ని నెలల క్రితం టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో భవనాల మెయింటెనెన్స్ ఖర్చులు చెల్లించడం లేదని - ఏపీ భవనాలకు తామెలా చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య నడుస్తున్న ఈ వివాదానికి ఇప్పుడు తెర పడింది.

గతంలో రెండు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీలు దీనిపై పలు దఫాలుగా చర్చించినా వివాదం పరిష్కారం కాలేదు. శనివారం ఇఫ్తార్‌ విందుకోసం రాజ్‌ భవన్‌ కు వచ్చిన ఏపీ సీఎం జగన్‌ - గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో సీఎం కేసీఆర్‌ ఈ విషయంపై చర్చలు జరిపారు. దీనికి ఏపీ జగన్‌ కూడా సానుకూలంగా స్పందించారు. ఇవాళ కూడా గవర్నర్‌ తో కేసీఆర్‌ సమావేశమై ఇదే విషయమై చర్చించారు. తన అధికారాల ద్వారా ఏపీ భవనాలను తమ రాష్ట్రానికి కేటాయించాలంటూ తెలంగాణ  మంత్రివర్గం గవర్నర్‌ ను కోరింది. తెలంగాణ మంత్రివర్గ విజ్ఞప్తి చేయడం.. అటు ఏపీ సీఎం జగన్‌ కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో భవనాలను తెలంగాణకు కేటాయిస్తూ గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
   

Tags:    

Similar News