కాలం చెల్లిన కాంగ్రెస్.. కోలుకోవటం ఇప్పట్లో కష్టమే బాస్

Update: 2019-08-19 05:44 GMT
ఎలాంటి కాంగ్రెస్ ఎలా మారిపోయింది? అన్న మాట ఇటీవల కాలంలో కాంగ్రెస్ పెద్ద తలకాయల్లో తరచూ వినిపిస్తూ ఉంది. మారే కాలానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు దరిద్రపుగొట్టు రాజకీయాల్ని తెర మీదకు తీసుకొచ్చినన్నాళ్లు వెలిగిపోయిన కాంగ్రెస్.. అందుకు భిన్నంగా తన తీరు మార్చుకున్న నాటి నుంచి ఆ పార్టీ తిరోగమనం స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. దేశ రాజకీయాల్లో సర్వ దరిద్రాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నమ్మించి వెన్నుపోటు పొడవటం.. అవసరార్థం పార్టీల్ని కలుపుకోవటం.. అవసరం తీరాక కరివేపాకులా వాడేసి పడేయటం లాంటివే కాదు.. నేతల్ని ఆట బొమ్మల్లా మార్చి ఆడుకోవటం ఆ పార్టీకి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. దేశ రాజకీయాల్లోకి ఓటు బ్యాంకు రాజకీయాల్ని తీసుకొచ్చి.. తెల్లోడి ఫాలో అయినా విభజించు పాలించు సిద్ధాంతాన్ని యథాతధంగా అమలు చేసి అధికారాన్ని సొంతం చేసుకుంటూ పబ్బం గడిపిన పార్టీకి ఇటీవల కాలంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

మోడీ ఎంట్రీకి ముందు వరకూ ఆ పార్టీ తీరు ఒకలా ఉంటే.. జాతీయ రాజకీయాల్లోకి కాలు మోపటం ద్వారా మోడీ అప్పటివరకున్న చాలానే అంశాల్ని మార్చేసుకున్నారు. జాతీయవాదాన్ని తీసుకురావటం.. దేశంలో అంతకు ముందెప్పుడూ లేని హిందూ ఓటు బ్యాంకు ఒకటి తయారు చేయటం లాంటివెన్నో చేశారు. వీటిని అర్థం చేసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పటికి తన పాత వాసనల్ని వదలని కాంగ్రెస్ కు.. మోడీ అనుసరిస్తున్న వ్యూహాలు ఒక పట్టాన అర్థం కావట్లేదు.

సెక్యులరిజం పేరుతో మైనార్టీలను ఓటుబ్యాంకుగా మార్చుకొని తాను ప్రయోజనం పొందిన వైనాన్ని మర్చిపోతున్న కాంగ్రెస్.. అదే వ్యూహాన్ని మరింత భారీగా చేపట్టి.. చెల్లాచెదరుగా ఉన్న హిందువుల్ని జాతీయత పేరుతో ఒక్కటి చేసి ముసలి కాంగ్రెస్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు మోడీ.  కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేయటం ద్వారా సగటు భారతీయుడి 70 ఏళ్ల కలను సాకారం చేసినట్లుగా చేశారు నమో.

ప్రత్యర్థి అడుగులు ఎలా పడుతున్నాయి..?  అతడి గేమ్ ప్లాన్ ఏమిటి? అన్న దానిపై  దృష్టి పెడితే విషయం ఇట్టే అర్థమైపోతుంది. కానీ.. కాంగ్రెస్ ఆ పని చేయటం లేదు. దీంతో.. సంప్రదాయ కాంగ్రెస్ వాదులకు సైతం ఇప్పుడా పార్టీ అంటే విరక్తి కలుగుతోంది. కాలం చెల్లిన కాంగ్రెస్ సెక్యులరిజం మాటలు కంపరంగా మారాయి. ముసలి వాసన ఎలా అయితే ఇబ్బందిగా ఉంటుందో.. కాంగ్రెస్ చెప్పే మాటలు.. వల్లించే నీతుల్లో లాజిక్ కనిపించకపోవటంతో పాటు.. ఆ పార్టీకి నాయకత్వ సమస్య పెద్ద శాపంగా మారింది.

ఈ కారణంతోనే కాంగ్రెస్ కాలం చెల్లిన పార్టీగా మారిపోతోంది. ఇప్పటికే కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు పలువురు నమో తీర్థం పుచ్చుకొని కాషాయం కండువా భుజాన వేసుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పలువురు కాంగ్రెస్ నేతలు తెలివిగా తమ దారిన తాము చూసుకుంటూ ఉంటే.. మిగిలిన వారు ఇప్పుడిప్పుడే ఆ దారి వెంట నడిచేందుకు సమాయుత్తం అవుతున్నారు. మతానికి మించిన మత్తు జాతీయతన్న విషయం కాంగ్రెస్ గ్రహించి.. అది తమ ప్రత్యర్థుల కంటే తమ వద్దే టన్నుల కొద్దీ ఉందన్న నమ్మకం కలిగిస్తే తప్పించి కాంగ్రెస్ వైపు చూసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా లేరు?  మరి.. ఆ విషయాన్ని గుర్తించటానికి కాంగ్రెస్ అధినాయకత్వం రెఢీగా ఉందా? అన్నదే అసలు ప్రశ్న. 
Tags:    

Similar News