మగాళ్లు ఏడవడం మంచిది.. సర్వే ఆసక్తికర ఫలితం

Update: 2021-11-13 04:35 GMT
మాట ముందు ఏడ్చే మగాడిని.. పదే పదే నవ్వే మహిళలను నమ్మకూడదు అనేది ఓ నానుడి. దీనిని ఇప్పటికి చాలా సార్లు వినే ఉంటాం మనం. చిన్ననాటి నుంచి పురుషులు ఏడ్చేటప్పుడు అమ్మ కానీ నాన్న కానీ వచ్చి.. ఏంట్రా అమ్మాయిలాగా ఏడుస్తున్నావ్ ని అంటారు. ఈ మాటలను మనం నమ్మి నిజంగానే అబ్బాయి ఏడవకూడదు అని మైండ్ లో బలంగా ఫిక్స్ అవుతాము. మనసు ఎంత వేదన చెందినా.. బయటకు కనపడకుండా.. దానిని లోపలే దాచేస్తాము. కానీ కొంతమంది అబ్బాయిలు బాధను తట్టుకోలేక కన్నీటి పర్యంతం అవుతారు.

వాస్తవానికి ఇదే మంచి పని అంటోంది ఈ ఓ సర్వే. ఆనందం కలిగినప్పుడు ఏ విధంగా అయితే మనం నవ్వుతామో.. బాధ కలిగినప్పుడు కూడా అదే విధంగా ఏడవాలని చెప్తుంది. ఈ విషయం స్త్రీ పురుషులకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. మనసుకు సంబంధించిన భావాలను ఎప్పటికప్పుడు తీర్చేసుకోవడమే ఉత్తమమైన పని అని అంటుంది. లేకపోతే మానసిక సమస్యలు మనల్ని పట్టి పీడించే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు అంటున్నారు.

ఇందుకు సంబంధించి అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. పురుషులు ఎవరైనా బాధ కలిగినప్పుడు ఏడవకపోతే.. వాళ్లు మానసిక సమస్యలకు గురవుతారని ఈ సర్వే స్పష్టం చేసింది. సుమారు 5,500 మంది పురుషుల పై అధ్యయనాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. నిర్ణీత కాలం పాటు వీరిపై ఈ పరిశోధన సాగినట్లు చెప్పారు. అయితే ముఖ్యంగా మానసికంగా ఆవేదన చెందినప్పుడు చాలా మంది పురుషులు తమ బాధలను పక్కవారితో పంచుకునే ఎందుకు ఇష్టపడడం లేదని ఈ సర్వే స్పష్టం చేసింది. దీంతో వారిలో వారే బాధపడి మానసిక సమస్యలకు గురవుతున్నారని పేర్కొంది.
Read more!

బాధ కలిగినప్పుడు ఏడవడం లో కూడా ఆనందంగా ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంది. మన మెదడులో ఆక్సిటోన్,ఎండార్ఫిన్ అనే రెండు కీలక రసాయనాలు ఉంటాయి. ఇవి మనం బాధపడి ఏడ్చినప్పుడు మెదడు నుంచి రిలీజ్ అవుతాయి. వాస్తవానికి ఈ రెండు రసాయనాలు మనిషికి ఆనందం కలిగించేవి. ఈ కారణంగా మనిషి వేదన చెందినప్పుడు కన్నీరు పెట్టుకుంటే ఈ రసాయనాలు విడుదలై.. మనసు కుదుటపడి ప్రశాంతంగా ఉంటుందని సర్వే పేర్కొంది.

బ్రిటన్ లో నిర్వహించిన సర్వే ప్రకారం.. సుమారు 55 శాతం మంది మగాళ్లు తాము ఏడవడానికి ఇష్టపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందుకు గల ప్రధాన కారణం.. ఏడ్చినప్పుడు ఎవరైనా చూస్తే తమని మగవాళ్లు కాదంటారని ఒక భయం. అయితే ఇలా బాధ కలిగినప్పుడు ఏడవని మగవాళ్లు మానసిక వేదనకు గురై చాలామంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. బలవన్మరణాలకు పాల్పడుతున్న వారికి సంబంధించిన ఓ సర్వే ప్రకారం... ఈ భూమండలంపై ప్రతి 40 సెకన్లకు ఒకరు సూసైడ్ చేసుకుంటున్నారు. అంతేగాకుండా వీరిలో ఎక్కువమంది భరించలేని వేదనకు గురైన మగవారే కావడం గమనార్హం.
Tags:    

Similar News