అవిశ్వాసం...విపక్షం సాధించిందేంటి ?
ప్రతిపక్షాలకు పాలక పక్షం తీరు నచ్చనపుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు.;
ప్రతిపక్షాలకు పాలక పక్షం తీరు నచ్చనపుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. బిల్లుల మీద ఓటింగ్ ని కోరవచ్చు, అలాగే సభలో వివిధ అంశాల మీద ఓటింగ్ కి డిమాండ్ చేయవచ్చు, అయితే ఏమి చేసినా విపక్షాలు తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించగలగాలి. ఇక గత నెలలో ఇండియా కూటమికి చెందిన ఎంపీలు అంతా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మీద అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించారు. నిజానికి స్పీకర్ మీద విపక్షం చాలా కాలంగా కొంత అసహనంగా ఉంది. దానికి ఏకంగా అవిశ్వాసం అన్న మార్గాన్ని ఎంచుకుంది. పార్లమెంట్ బడ్జెట్ తొలి సెషన్ లో ఇచ్చిన ఈ తీర్మానం మీద చర్చ అన్నది రెండవ సెషన్ లో రెండవ రోజు మొదలై మూడవ రోజున ముగిసింది. దాదాపుగా ఇరవై గంటల పాటు సాగిన ఈ చర్చలో చివరికి ఓం బిర్లా మీద అవిశ్వాసం వీగిపోయింది. మూజు వాణి వోటుతోనే ఈ తీర్మానం ఓడిందని స్పీకర్ చెయిర్ లో ఉన్న జగదాంబికా పాల్ స్పష్టం చేశారు.
మూజువాణి ఓటుతోనే :
అధికార పక్షం నుంచి ఎన్డీయే కూటమి సభ్యులు మొత్తం చేతులెత్తి ఈ తీర్మానానికి వ్యతిరేకంగా నిలిచారు. ఇక విపక్షం అయితే ఎటూ సంఖ్యా బలం చూసుకుందో ఏమో అంత సీరియస్ గా ఓటింగ్ విషయంలో చూపించలేదని అంటున్నారు. అంతే కాదు ఎన్డీయే కూడా ఈ తీర్మానం ఎటూ వీగిపోతుందని లైట్ తీసుకుంది అని అంటున్నారు దాంతో మూజు వాణి ఓటుతోనే ఈ తీర్మానం వీగిందని సభలో ప్యానల్ స్పీకర్ ప్రకటించారు.
అమిత్ షా వర్సెస్ రాహుల్ :
ఇక ఈ తీర్మానం ఎందుకు అంటే సభా సంప్రదాయాలు కాపాడడం, సభ్యులందరిదీ సభ అని తెలియచేయడం కోసం అని ఇండియా కూటమి ఎంపీలు తమ ప్రసంగాలలో చెప్పాయి. అయితే స్పీకర్ మీద ఓటింగ్ పెట్టడం ద్వారా విపక్షాలు దిగజారుడు రాజకీయాలకు దిగాయని ఎన్ డీయే కూటమి నుంచి విమర్శలు వచ్చాయి. ఇక హోం మంత్రి అమిత్ షా అయితే ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ రాహుల్ గాంధీ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు సభ అంటే సీరియస్ నెస్ లేదని అన్నారు. బడ్జెట్ సెషన్ వంటి కీలకమైన సందర్భాలలో ఆయన విదేశాల్లో ఉంటారని ఎద్దేవా చేశారు. సభలో దేశంలో మాట్లాడాల్సిన అంశాలు విదేశాల్లో మాట్లాడుతారు అని విమర్శించారు. ఏ సబ్జక్టు మీద ఎపుడు ఎందుకు మాట్లాడాలో రాహుల్ కి కాంగ్రెస్ సీనియర్ ఎంపీలు చెప్పాలని అమిత్ షా చురకలు అంటించారు. రాహుల్ గాంధీ కూడా గట్టిగానే మాట్లాడారు, సభ మొత్తం అధికార పక్షం అనుకూలంగా చేసుకుంటోందని అన్నారు తనకు మాట్లాడే చాన్స్ ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు.
విపక్షానికే అవకాశం :
అయితే రాహుల్ ఆరోపణలను అమిత్ షా లెక్కలతో సహా తిప్పి కొట్టడంతో రాహుల్ సహా ఇండియా కూటమి ఇరుకున పడినట్లు అయింది. లెక్కలు తీస్తే కనుక 2014 నుంచి 2026 దాకా జరిగిన ప్రతీ సభలో కాంగ్రెస్ ఎంపీలకే ఎక్కువ సార్లు మాట్లాడే చాన్స్ లభించింది అని అమిత్ షా వివరించారు 17వ లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి 52 మంది సభ్యులు ఉండగా, 157 గంటల 55 నిమిషాల సమయం ఇచ్చారని ఆయన అన్నారు. దానితో పోల్చితే బిజెపికి 349 గంటల 8 నిమిషాలు ఇవ్వగా తమ పార్టీ సభ్యులు 303 ఉన్నారని అన్నారు మరి స్పీకర్ ఓం బిర్లా బిజెపి కంటే కాంగ్రెస్‌కు ఏకంగా ఆరు రెట్లు ఎక్కువ సమయం కేటాయించారని ఆయన అన్నారు.
ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తూ :
ఈ చర్చలో అమిత్ షా ఏకంగా ఎమర్జెన్సీ సందర్భాన్ని గుర్తుకు తెచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ ప్రతిపక్షాల గొంతును అణచివేయడానికి ప్రయత్నించలేదని అన్నారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో మొత్తం ప్రతిపక్షాలను జైలులో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పడెసిందని ఆయన ఆరోపించారు. సభలో ప్రతిపక్షాలు నియమాలను పాటించవని, కానీ వారికి మాట్లాడే అవకాశం లభించలేదని ఫిర్యాదు చేస్తాయని ఆయన ఫైర్ అయ్యారు.
ఇక స్పీకర్ ఏ రాజకీయ పార్టీకి కాకుండా సభకు చెందినవారని ఆయన నొక్కి చెప్పారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం తీసుకురావడం విచారకరమైన సంఘటనగా అమిత్ షా అభివర్ణించారు. లోక్‌సభ నిబంధనల ప్రకారం, స్పీకర్ నిర్ణయాలే అంతిమమైనవిగా పరిగణించబడతాయని అన్నారు.
రెండు సార్లు మాత్రమే :
ఈ చర్చలో పాల్గొన్న బిజెపికి చెందిన ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు సభలో భాగం కానీ ప్రతిపక్ష నాయకుడి ప్రవర్తన కూడా అంతే బాధ్యత వహిస్తుందని అన్నారు. గత 72 సంవత్సరాలలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ రెండుసార్లు మాత్రమే జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ ఎంపీ కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ, ఈ తీర్మానం ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక సూత్రానికి దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి సంబంధించినదని అన్నారు. ప్రతిపక్ష సభ్యుడు మాట్లాడటానికి నిలబడినప్పుడల్లా మైక్ ఆపివేయబడిందని ఆయన ఆరోపించారు. పార్లమెంటు అనేది చర్చించడానికి ఒక వేదికని ఆయన అన్నారు. మొత్తంగా జరిగిన చర్చ చూస్తే ఎందుకు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ఇచ్చారో విపక్షం సరిగ్గా చెప్పలేకపోయింది అన్న మాట వినిపిస్తోంది.అదే సమయంలో అధికార పక్షం బలాన్ని మరోసారి గట్టిగా తెలియచేసినట్లు అయింది అని అంటున్నారు.