దోసె పూరీకి తెగ వర్రీ...మా చెడ్డ కాలం !

పూరీ తినకపోతే పూట గడవదు, దోసె చూడకపోతే మనసు నిలవదు. కానీ పాడు కాలం ఈ రెండింటికీ దూరం చేసింది.;

Update: 2026-03-11 19:30 GMT

పూరీ తినకపోతే పూట గడవదు, దోసె చూడకపోతే మనసు నిలవదు. కానీ పాడు కాలం ఈ రెండింటికీ దూరం చేసింది. వీటికే తెగ వర్రీ కావాల్సి వస్తోంది. ఏమో అనుకుంటే ఏదో జరిగింది అన్నట్లుంది. ఎక్కడో పశ్చిమాసియాలో కదా యుద్ధం అనుకుని నిబ్బరంగా ఉన్న జనాలకు ఇపుడు ఆ యుద్ధం ఘాటు సెగలు తగులుతున్నాయి. నేరుగా వచ్చి వంటింటిలోనే పొగలు పెడుతున్నాయి. దాంతో ఎంతో ఇష్టంగా తినే తిండికి సైతం ఆంక్షలు విధించే చెడ్డ కాలం వచ్చిపడింది అని ఆహార ప్రియులు వేడి నిట్టూర్పులు విడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సంక్షోభంలోనే :

ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ ల మధ్య యుద్ధం ఇపుడు పీక్స్ కి చేరుకుంది. భీకరమైన ఈ పోరు ఎప్పటికి ఆగుతుందో తెలియదు. దాంతో ఒక్కసారిగా చమురు కొరత ఏర్పడింది. అంతే కాదు ఎల్పీజీ గ్యాస్ కి కూడా చిక్కులు వచ్చి పడ్డాయి. అవన్నీ కలసి వంట ఇంట్లో ఏమి వండాలి అన్నది డిసైడ్ చేసే స్థాయికి ఈ యుద్ధం పరిణామాలు చోటు చేసుకున్నాయని అంటున్నారు.

మెనూ మారింది :

ఇక గ్యాస్ కొరత కారణంగా హొటళ్ళు మూత పడే పరిస్థితికి వచ్చింది. అలాగే హాస్టల్స్ లో కూడా వంటలు ఎలా చేయాలి అన్నది కూడా ఆలోచించే పరిస్థితి. దాంతో హొటళ్ళు టెంపరరీ పద్ధతిలో ఈ గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చాలా ఆహార పదార్ధాలలో మెనూని కుదించి వేస్తున్నారు. ఏ హొటల్ కి వెళ్ళినా మనకు నచ్చినది ఆర్డర్ చేయవచ్చు. ఇది నిన్నటిదాకా ఉన్న పరిస్థితి. కానీ ఇపుడు సీన్ మారింది. ఫలనావి మా వద్ద లేవు, దొరకవు, ఇవ్వలేమని బోర్డు తిప్పేస్తున్న నేపధ్యం ఉంది. అలా హొటల్స్ లో లేని జాబితాలో పూరీ దోసె, చపాతీ వంటివి చేరిపోయాయి. వీటిని తాము ఇపుడున్న పరిస్థితుల్లో ఇవ్వలేమని హైదరాబాద్ ఐటీ కారిడార్ హోటళ్ల అసోసియేషన్ తాజాగా ప్రకటించడం విశేషం. దాంతో హొటళ్ళకు ఎవరైనా వెళ్తే వీటి జోలికి పోవడం మానుకోవాల్సిందే అంటున్నారు.

అక్కడ సీన్ మారింది :

ఇక హాస్టళ్ళు మెస్ లలో కూడా మెనూ పూర్తిగా చేంజ్ చేసేసారు కేవలం భోజనం మాత్రమే ఇస్తున్నారు. అది కూడా అన్నం సాంబార్, పప్పు రసం మాత్రమే లభ్యత ఉంటుందని చెబుతున్నారు. ఈ విధంగా కూడా తాము మరో రెండు మూడు రోజులు మాత్రమే కొనసాగించగలమని అప్పటికీ గ్యాస్ కష్టాలు తీరకపోతే హాస్టళ్ళు మెస్ లని బంద్ చేయడం మినహా మార్గం లేదని కూడా నిర్వాహకులు స్పష్టం చేస్తున్నాయి.

రేట్లు పెరుగుతున్నాయి :

ఇంతే కాదు హొటళ్ళలో టిఫిన్ కి ఆర్డర్ ఇస్తే వాటి రేట్లు పెంచుతున్నారు ఎందుకు అంటే తమకు అదనపు ఖర్చులు ఉన్నాయని చెబుతున్నారు దీంతో పది నుంచి పదిహేను శాతం రేట్లు పెంచి మరీ చాలా చోట్ల టిఫిన్ సరఫరా చేస్తున్నారు. ఈ పరిణామంతో సగటు జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతలా రేట్లు పెరిగితే ఎలా తమ జేబులకు చిల్లు అని గొల్లుమంటున్నారు.

కొబ్బరికీ దెబ్బే మరి :

ఇక పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం మూలంగా కొబ్బరి ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది దీంతో కొబ్బరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ తమిళనాడు, కేరళం, కర్ణాటక రాష్ట్రాలలో పెద్ద ఎత్తున కొబ్బరి సాగు జరుగుతుంది. అయితే గల్ఫ్ దేశాలకు ఇక్కడ నుంచే ఎగుమతులు కూడా బాగా సాగుతాయి. కానీ ఇపుడు రవాణా సదుపాయాలు లేవు, పైగా కువైట్, దుబాయి, ఇరాన్, సౌదీ అరేబియా, ఒమన్, ఇతర అరేబియా దేశాలకు పంపించేందుకు సిద్ధంగా ఉన్న కొబ్బరి కాయలన్నీ నిలిచిపోయాయి. దాంతో కొబ్బరి కాయల ధరలు పతనం చెందుతున్నాయని అంటున్నారు. వేయి పచ్చి కొబ్బరి కాయలు ఆ మధ్య దాకా 20 వేల రూపాయల దాకా ధర ఉండేది. ఇపుడు చూస్తే సగానికి సగం పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. సరుకు అంతా ఎగుమతి కాకుండా పోర్టులలోనే ఉండిపోవడంతో స్థానికంగా మార్కెట్ లోనే వాటిని విక్రయించాల్సి వస్తోంది అని అంటున్నారు. దాంతో ధరలు నేల చూపులు చూస్తున్నాయి అని ఆవేదన చెందుతున్నారు.

Tags:    

Similar News