స్పీక‌ర్ బిర్లాపై అవిశ్వాసం వీగింది.. ప్ర‌శ్న‌లు మిగిలాయి!

లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన విష‌యం తెలిసిందే.;

Update: 2026-03-11 17:49 GMT

లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై చ‌ర్చించేందుకు ఆది నుంచి విముఖంగా ఉన్న కేంద్ర ప్ర‌భుత్వం.. ఎట్ట‌కేల‌కు విప‌క్షాలు ప‌ట్టుబ‌ట్ట‌డంతో మంగ‌ళ‌వారం నుంచి బుధ‌వారం వ‌ర‌కు 10 గంట‌ల‌పాటు చ‌ర్చించేందుకు నిర్ణ‌యించింది. ఈ చ‌ర్చ జ‌రిగిన స‌మ‌యంలో స్పీక‌ర్ ఓం బిర్లాస‌భ‌కు రాకుండా.. కార్యాల‌యంలోనే ఉండిపోయారు.. ఇక‌, బుధ‌వారం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన చ‌ర్చ‌లో అంతిమంగా.. అధికార పార్టీనే పైచేయి సాధించింది. కానీ, అధికార‌, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య వాడివేడి చ‌ర్చ సాగింది.

అవిశ్వాసంపై చ‌ర్చ ముగిసిన త‌ర్వాత‌.. ప్యాన‌ల్ స్పీక‌ర్ నిర్వ‌హించిన మూజువాణి ఓటు(చేతులు పైకి ఎత్త‌డం ద్వారా)తో స‌భ్యులు తీర్మానంపై ఓటేశారు. దీనిలో అధికార పార్టీ స‌భ్యులుమెజారిటీ సంఖ్య‌లో ఉన్న క్ర‌మంలో తీర్మానం వీగిపోయింది. ఇక‌, చివ‌ర‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. స‌మాధానం ఇచ్చారు. సాయంత్రం 4-6 గంట‌ల మ‌ధ్య గంటా 45 నిమిషాల పాటు ఆయ‌న ప్ర‌సంగించారు. ఆసాంతం ఆయ‌న కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. నెహ్రూ హ‌యాంలోనే లోక్‌స‌భ నిబంధ‌న‌లు రూపొందించార‌ని.. దాని ప్ర‌కార‌మే స్పీక‌ర్ న‌డుచుకుంటున్నార‌ని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుత నిబంధ‌న‌ల‌ను త‌ప్పుబ‌ట్ట‌డం అంటే.. నెహ్రూను త‌ప్పుబ‌ట్ట‌డ‌మే అవుతుంద‌న్నారు. ఇక‌, కాంగ్రెస్ పార్టీ స‌భ‌ను న‌డ‌ప‌డం లేద‌న్న ఆయ‌న‌.. ఆపార్టీ చెప్పిన‌ట్టు స్పీక‌ర్ న‌డుచుకోర‌ని తేల్చి చెప్పారు. స్పీక‌ర్ తీసుకునే నిర్ణ‌యాన్ని సుప్రీంకోర్టు కూడాప్ర‌శ్నించ‌డానికి వీల్లేద‌ని తెగేసి చెప్పారు. స్పీక‌ర్ నిర్ణ‌య‌మే అంతిమ‌మ‌మ‌ని తెలిపారు. కానీ.. స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టి.. కాంగ్రెస్ పెద్ద‌త‌ప్పు చేసింద‌న్నారు. స‌భ‌లో నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకే.. స్పీక‌ర్ నిర్ణ‌యాలు క‌ఠినంగా తీసుకుంటున్నార‌ని చెప్పారు. స్పీక‌ర్‌కు కూడా రాజ‌కీయాలు అంట‌గ‌ట్టే ప‌రిస్థితికి కాంగ్రెస్ వ‌చ్చింద‌న్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత‌, కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్‌ను ఉద్దేశించి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ``థ‌రూర్ గారూ.. మీరైనా ప‌ద్ధ‌తి నేర్పండి.`` అని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

అస‌లు ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబేదీ..?

స్పీక‌ర్‌పై అవిశ్వాసం ప్ర‌వేశ పెట్ట‌డం వెనుక‌.. కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు.. కొన్ని ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తాయి. కానీ, ఈ తీర్మానం త‌ర్వాత .. లేదా చ‌ర్చ‌లోనూ కేంద్రం ఎక్క‌డా వీటిపై స‌మాధానం చెప్ప‌లేదు. 1) ప్ర‌తిపక్ష నాయ‌కుడికి ఎంత స‌మ‌యం ఇస్తారు? 2) ప్ర‌తిప‌క్ష నేత మాట్లాడుతుంటే ప‌దే ప‌దే మైకు ఎందుకు క‌ట్ చేస్తున్నారు. 3) మ‌హిళా ఎంపీలు ప్ర‌ధానిపై దాడి చేస్తార‌న్న స‌మాచారం ఉంద‌న్న స్పీక‌ర్ వ్యాఖ్య‌లు. 4) ప్ర‌తిప‌క్షాల‌కు స‌మ‌యం ఇవ్వ‌కుండానే స‌భ‌ను వాయిదా వేయ‌డం. 5) నిర‌స‌న‌ల‌కు అవ‌కాశం లేద‌ని స్పీక‌ర్ తేల్చి చెప్ప‌డం. 6) ప్ర‌తిప‌క్ష స‌భ్యులు మాట్లాడేందుకు స‌మ‌యం ఇవ్వ‌క‌పోవ‌డం. ఇలా.. కీల‌క ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు లేకుండానే తీర్మానం ముగిసింది.మొత్తంగా.. ఆప‌రేష‌న్ స‌క్సెస్ .. పేషంట్ డైడ్‌.. అన్న సామెతను తాజా తీర్మానం గుర్తు చేసింది.

Tags:    

Similar News