తెలుగు రాష్ట్రాల మధ్య జల పంచాయితీలో అసలు పాయింట్ ఇదే?

Update: 2020-10-06 06:45 GMT
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించే కేసీఆర్ కు ఒక లక్షణం ఉంది. జాతీయ అంశాల్ని తరచూ ప్రస్తావించే మేధావితనం తనలో బోలెడంత ఉందన్నట్లు చెప్పే ఆయన.. విషయాలకు వచ్చేసరికి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల ముందు మరేమీ ముఖ్యం కాదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. కేంద్రం తీరును తరచూ విమర్శించే ఆయన.. కేంద్రం ఎలా వ్యవహరించాలన్న దానిపై తరచూ క్లాసులు పీకుతుంటారు. మరింత మందికి సలహాలు ఇచ్చే ఆయన.. తన వరకు వచ్చే సరికి మాత్రం.. తెలంగాణకు పెద్ద పీట వేయాలి. తెలంగాణ ప్రయోజనాల తర్వాతే మిగిలిన వారి సంగతన్నట్లుగా వ్యవహరించటంలో అర్థం లేదు.

రేపొద్దున జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఆయన.. వివాదాల్ని సాపేక్షంగా చూస్తే.. వివాదం ఉన్న రెండు పార్టీల మధ్య సమన్యాయం జరిగేలా చూడటం.. అందుకు తగ్గట్లు పెద్ద మనిషిగా వ్యవహరించటం చాలా అవసరం. విభజన వేళ.. తెలంగాణకు భారీ లబ్ది చేకూరితే.. ఏపీకి తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఉమ్మడి కుటుంబం ఒకటి వాటాలు వేసుకొని విడిపోయే వేళ.. సమ న్యాయం చాలా అవసరం. అందుకు భిన్నం గా విభజన జరిగిందన్న విషయం అందరికి తెలిసిందే.

ఏపీ పాలకు లు.. నేతల నిర్లక్ష్యం తో ఇప్పటి వరకు అలా జరిగింది లేదు. అదే సమయం లో తన ప్రాంత ప్రయోజనాల మీద కేసీఆర్ కు ఉన్నంత కమిట్ మెంట్ ఆంధ్రా ప్రాంత నేతలకు లేకపోవటం కూడా కారణం. ఇదిలా ఉంటే.. తాజా అపెక్స్ కౌన్సిల్ భేటీలో కొత్త వాదనను తెర మీదకు తీసుకు రావాలన్న భారీ ప్లానింగ్ లో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి ఏ పాయింట్ కారణమన్నది చూస్తే.. కృష్ణా బేసిన్‌ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 811 టీఎంసీల నీటిని కేటాయించారన్నది తెలిసిందే.

ఈ వాటాను విభజన వేళ తెలంగాణకు 299 టీఎంసీలు.. ఏపీకి 512 టీఎంసీలు కేటాయించారు.ఈ నీటిని ప్రాజెక్టు వారీగా కాకుండా ఎన్ బ్లాక్ గా పంపిణీ చేయాలని నిర్ణయించారు. అంటే.. సదరు రాష్ట్రానికి కేటాయించిన నీటిని ఏ ప్రాజెక్టు పరిధిలో అయినా ఉపయోగించుకునే వీలుంది. ఈ విధానాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తుంది. ఎన్ బ్లాక్ విధానంలో భాగంగా ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీటిని తరలిస్తున్నట్లుగా ఏపీ చెబుతోంది.

దీన్ని తెలంగాణ రాష్ట్రం తప్పు పడుతోంది. తెలంగాణకు 299టీఎంసీల నీటి కేటాయింపు న్యాయంగా లేదని.. కోటా పెంచాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై కేంద్రం తగు నిర్ణయం తీసుకోవటం లేదని వాదిస్తోంది. అంతేకాదు.. ఏపీ పునరర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్ ద్వారా తెలంగాణకు న్యాయం జరగదని.. అంతరాష్ట్ర జల వివాద చట్టం 1956 సెక్షన్ మూడు ప్రకారం ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతోంది. ఇదంతా చూస్తున్నప్పుడు అపెక్స్ కౌన్సిల్ వేళ కేసీఆర్ టార్గెట్ మామూలుగా లేదని చెప్పక తప్పదు.

తెలంగాణ వాదన ఇదే అయినప్పుడు.. విభజన చట్టంలో ఏపీకి ఏ మాత్రం అనుకూలంగా లేని ఎన్నో అంశాల మీద కూడా చర్చ జరగాలని.. వాటిపైనా నిర్ణయాలు తీసుకోవాలన్న విషయాన్ని ఆంద్రా ప్రాంత నేతలు ఎవరూ ప్రస్తావించకపోవటం గమనార్హం. ఇదంతా చూస్తే.. కేసీఆర్ కు ఉన్నది.. ఆంధ్రా ప్రాంత నేతలకు లేనిది ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News