పేమెంట్ బదిలీ కావాలంటే గంట ఆగాల్సిందే..! ఆర్బీఐ వినూత్న విధానం..!
ఏదైనా లావాదేవీపై బ్యాంక్ సిస్టమ్స్‌కు అనుమానం కలిగితే, వెంటనే ఖాతాదారుడికి అలర్ట్ పంపిస్తారు. ఆ లావాదేవీని మీరు చేశారో లేదో నిర్ధారించుకున్న తర్వాతే ప్రాసెస్ జరుగుతుంది.;
యూపీఐ లావాదేవీలు ఎంత సులభంగా మారాయో.. సైబర్ నేరగాళ్లకు అంతకంటే పెద్ద వరంగా కూడా మారాయి. పిన్ ఎంటర్ చేసిన క్షణాల్లోనే మన ఖాతాలో డబ్బులు మాయమైపోతుండడం వల్ల బాధితులకు తమ డబ్బు వెనక్కి తెచ్చుకునే అవకాశం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకురాబోతున్న ఈ కొత్త మార్పులు సామాన్యుల కష్టార్జితానికి ఒక పటిష్టమైన భద్రతా కవచంలా మారబోతున్నాయి.
యూపీఐ పేమంట్స్‌లో కీలక మార్పులు!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దొంగతనం చేసే విధానాలు కూడా మారుతున్నాయి. ఫోన్ చేసి బెదిరించడం, ఆశ చూపి లింక్‌లు క్లిక్ చేయించడం ద్వారా క్షణాల్లో లక్షల రూపాయలు దోచుకుంటున్న సైబర్ కేటుగాళ్లకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలకు ‘టైమ్ లాక్’ (నిర్ణీత సమయం) విధించడం ద్వారా నేరగాళ్ల నెట్ వర్క్ ను చిన్నాభిన్నం చేయాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఈ విధానం ‘ఇన్‌స్టంట్ పేమెంట్’కు పెట్టింది పేరైన యూపీఐలో, ఈ ‘డిలే’ (Delay) విధానం భద్రత పరంగా విప్లవాత్మక మార్పు కాబోతోంది.
రూ. 10,000 దాటితే ‘వెయిటింగ్ పీరియడ్’!
ప్రస్తుత చర్చల ప్రకారం.. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని యూపీఐ ద్వారా పంపినప్పుడు, ఆ డబ్బు అవతలి వ్యక్తి ఖాతాలో జమ కావడానికి కనీసం గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టేలా నిబంధన తీసుకురాబోతున్నారు. ఈ గంట సమయంలో మీరు పంపిన వ్యక్తి మోసగాడని లేదంటే పొరపాటున ట్రాన్జక్షన్ చేశానని భావిస్తే.. వెంటనే ఆ లావాదేవీని రద్దు చేసి డబ్బును వెనక్కి పొందే వెసులుబాటు ఈ విధానంలో ఉండబోతోంది.
సీనియర్ సిటిజన్స్‌కు అదనపు భద్రత
సైబర్ నేరగాళ్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకునేది వృద్ధులనే. అందుకే సీనియర్ సిటిజన్స్ రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని బదిలీ చేయాలనుకుంటే, ఖచ్చితంగా ఒక ‘అథెంటిక్ పర్సన్’ (కుటుంబ సభ్యుడు లేదా నామినీ) ఆమోదం ఉండేలా నిబంధన తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తోంది. దీనివల్ల వృద్ధులను బెదిరించి లేదా మాయమాటలు చెప్పి డబ్బులు లాగేసే ముఠాలకు కళ్లెం వేయవచ్చు.
బ్యాంక్ నుంచి అలర్ట్ మెసేజ్
ఏదైనా లావాదేవీపై బ్యాంక్ సిస్టమ్స్‌కు అనుమానం కలిగితే, వెంటనే ఖాతాదారుడికి అలర్ట్ పంపిస్తారు. ఆ లావాదేవీని మీరు చేశారో లేదో నిర్ధారించుకున్న తర్వాతే ప్రాసెస్ జరుగుతుంది. అయితే, నిత్యావసరాలు, షాపింగ్ చేసే మర్చంట్ పేమెంట్స్ కు ఇబ్బంది లేకుండా, ఈ నియమం కేవలం వ్యక్తిగత బదిలీలకు మాత్రమే వర్తించేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
అభిప్రాయాల సేకరణ
ఈ విధానం ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది. ఏప్రిల్ 10 నుంచి మే మొదటి వారం వరకు సామాన్యులు, బ్యాంకింగ్ నిపుణులు, టెక్ కంపెనీల నుంచి ఆర్బీఐ అభిప్రాయాలను సేకరించనుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత త్వరలోనే దీనిని అధికారికంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. సైబర్ క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, ఇది ఒక అవసరమైన నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
యూపీఐ లావాదేవీల్లో వేగం తగ్గడం వల్ల కొంత అసౌకర్యం కలిగినా, మన డబ్బు సురక్షితంగా ఉండడమే అన్నింటికంటే ముఖ్యం. గంట వ్యవధిలో బ్యాంక్ అధికారులతో మాట్లాడి మోసాన్ని అరికట్టే అవకాశం ఉండడం వల్ల సైబర్ నేరగాళ్ల ఆటలు ఇక సాగవు. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, ‘సైబర్ మోసం జరిగాక లబోదిబోమనే’ పరిస్థితి నుండి బాధితులు బయటపడవచ్చు.