టార్గెట్ జగన్ : రాయలసీమ పొలిటికల్ మ్యాప్ చేంజ్ ?

ఏపీలో రాజకీయ పోరు భీకరంగా సాగుతోంది. అధికార టీడీపీ కూటమికి విపక్ష వైసీపీకి మధ్యన ఎన్నికలతో సంబంధం లేకుండానే నిత్యం వాడి వేడిగా డైలాగ్ వార్ సాగుతూనే ఉంటుంది.;

Update: 2026-04-11 02:30 GMT

ఏపీలో రాజకీయ పోరు భీకరంగా సాగుతోంది. అధికార టీడీపీ కూటమికి విపక్ష వైసీపీకి మధ్యన ఎన్నికలతో సంబంధం లేకుండానే నిత్యం వాడి వేడిగా డైలాగ్ వార్ సాగుతూనే ఉంటుంది. వైసీపీ ఏర్పాటు అయి 15 ఏళ్లు అయింది అందులో కేవలం అయిదేళ్ళు మాత్రమే అధికారంలో ఉన్నారు. పదేళ్ళ పాటు విపక్షంలోనే ఆ పార్టీ కొనసాగుతోంది. అయితే వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచే వచ్చింది అన్నది తెలిసిందే. రాయలసీమలో మొదటి నుంచి కాంగ్రెస్ కి బలం ఉంది. అది వైసీపీకి పూర్తిగా షిఫ్ట్ అయింది. రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలలో మొత్తం 52 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ ఎపుడూ కాంగ్రెస్ గతంలో గెలుచుకుంటే వైసీపీ ఆ తరువాత అదే జోరుని కొనసాగించింది.

ఎన్టీఆర్ జమానాలో :

అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టిన తరువాత రాయలసీమలో కాంగ్రెస్ ని 1983 లో జరిగిన తొలి ఎన్నికల్లో గట్టిగానే ఢీ కొట్టడం జరిగింది. ఫలితంగా రాయలసీమలో మెజారిటీ సీట్లు టీడీపీ పరం అయ్యాయి. అలాగే 1985 మధ్యంతర ఎన్నికల్లోనూ టీడీపీ బంపర్ విక్టరీ కొట్టింది. తిరిగి 1994లోనూ సీమలో దాదాపుగా మొత్తం సీట్లను ఊడ్చేసింది టీడీపీ. ఇదంతా ఎన్టీఆర్ చరిష్మా కారణంగానే సంభవించింది. ఎన్టీఆర్ అంటే సీమ ప్రజలకు ఎంతో అభిమానం. ఆయనను సీమ దత్తపుత్రుడు అనేవారు. ఇక చంద్రబాబు టీడీపీ పగ్గాలు అందుకున్నాక రాయలసీమలో ఆ పార్టీ ఎన్నడూ మెజారిటీ సీట్లను గెలుచుకోలేదు. కాంగ్రెస్ అక్కడ బలంగా పోటీ ఇస్తూనే ఉంది. విభజన తరువాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీకి వచ్చిన 67 సీట్లలో ఎక్కువ సీట్లు రాయలసీమ నుంచి వచ్చినవే. అంతే కాదు 2019లో వైసీపీ ప్రభంజనం సీమలో కొనసాగింది. దాంతో టీడీపీకి కేవలం మూడు సీట్లు మాత్రమే దక్కగా 49 సీట్లతో వైసీపీ అజేయంగా జెండా ఎగరేసింది.

వైసీపీకి భారీ షాక్ :

అంతలా బలం ఉన్న రాయలసీమలో వైసీపీ తొలిసారి 2024 ఎన్నికల్లో దెబ్బ తిన్నది. ఆ పార్టీ 49 సీట్ల బలం నుంచి ఏకంగా 7 సీట్లకు పడిపోయింది. జగన్ సొంత జిల్లా కడపలోనే మెజారిటీ సీట్లు కూటమి గెలుచుకుంటే వైసీపీకి కేవలం నాలుగు మాత్రమే దక్కాయి. సీమలో కూటమి పట్టు బిగించింది. ఇక బీజేపీ జనసేన కూడా రాయలసీమలో రాజకీయ ఖాతాను తెరవడం విశేషం. దాంతో కొత్త ఉత్సాహంతో టీడీపీ కూటమి ఉంది. 2024 ఫలితాలనే మళ్ళీ 2029లో కూడా కొనసాగించాలని చూస్తోంది. అలా వరుసగా కనుక మ్యాజిక్ రిపీట్ చేస్తే వైసీపీకి కోలుకోలేని దెబ్బ రాజకీయంగా పడుతుందని దాంతో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిగిపోతాయని కూడా లెక్క వేసుకుంటోంది.

డీలిమిటేషన్ ఎఫెక్ట్ :

అధికార టీడీపీ కూటమికి అనుకోని వరంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అందుకొచ్చింది అని అంటున్నారు. డీలిమిటేషన్ అంటే ఎపుదూ అధికారంలో ఉన్న పార్టీలకే అనుకూలం అని అంటారు. తాము కోరుకున్న విధంగా అసెంబ్లీ సీట్లలో భారీ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు తమ బలాలు ప్రత్యర్ధుల బలాలు లేదా బలహీనతలు వీటిని దృష్టిలో ఉంచుకుని కొత్త సీట్లకు ఉన్న సీట్లకు కూడా తమదైన ఫేవరేట్ ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు అని అంటున్నారు. 2029 లో డీలిమిటేషన్ జరిగిన సీట్లతోనే ఎన్నికలు జరుగుతాయి. దానికి సంబంధించిన బిల్లు ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలోనే ప్రవేశపెట్టనున్నారు అని అంటున్నారు.

లోకేష్ సీరియస్ ఫోకస్ :

దాంతో రాయలసీమలో డీలిమిటేషన్ మీద మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫుల్ ఫోకస్ పెట్టేశారు. రాయలసీమలో ఈ మేరకు మొత్తం 52 అసెంబ్లీ సీట్లలో రాజకీయ బలాలు, స్థానిక పరిస్థితులు వైసీపీకి ఉపకరించే అంశాలు వ్యతిరేకించే అంశాలు అలాగే టీడీపీ కూటమికి ఉన్న ప్లస్ పాయింట్లు మైనస్ లు వీటి మీద పార్టీ పరంగా ఒక సర్వేని చేయిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇది చాలా లోతుగా వెళ్ళి మరీ చేస్తున్నారు అని తెలుస్తోంది. మండలాలు గ్రామాల స్థాయి దాకా వెళ్ళి మరీ నిర్వహించే ఈ సర్వే ద్వారా రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు లేదా నాలుగు మండలాల్లో వైసీపీకి అనుకూలంగా ఉన్న మండలాలు ఎన్ని వ్యతిరేకం ఎన్ని అన్నది కూడా అధ్యయనం చేయిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

టీడీపీ మాస్టర్ ప్లాన్ తో :

దీనిని బట్టి కొత్త సీట్లలో ఏ ఏ మండలాలను కలపాలి లేదా విడదీయాలి అన్నది కూడా పూర్తి సీరియస్ గానే చూసి మరీ నిర్ణయిస్తారు అని అంటున్నారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల మీద స్పెషల్ అటెన్షన్ ఉంటుందని అంటున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ సీట్ల విషయంలోనూ ఎక్కడెక్కడ వీలు ఉంటుందన్నది ఆరా తీస్తున్నారు. మొత్తం మీద చూస్తే రాయలసీమలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సీట్లు 52 కాస్తా 78 గా మారబోతున్నాయి. దాంతో అలా పెరిగిన 26 సీట్లలోనూ తమ బలాన్ని పెంచుకోవడమే కాకుండా టోటల్ గా రాయలసీమలో తిరుగులేని రాజకీయ అధిపత్యాన్ని చూపించాలని టీడీపీ మాస్టర్ ప్లాన్ తో ముందుకు సాగుతోంది అని అంటున్నారు. అదే కనుక జరిగితే వైసీపీకి రాజకీయంగా ఇబ్బందులు తప్పవని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News