నాలుగు అభివృద్ధి చెందిన దేశాల మొత్తం బంగారం కంటే.. భారతీయుల ఇళ్లల్లో ఉన్నది ఎక్కువ..
బంగారాన్ని కేవలం భద్రంగా దాచుకోవడమే కాకుండా, అవసరానికి వాడుకోవడంలో కూడా భారతీయులు ముందున్నారు.;
భారత్ లో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగం, ఆపదలో ఆదుకునే గొప్ప భరోసా. కానీ, ఇళ్లలో మూలుగుతున్న ఈ పసిడి సంపద ప్రపంచంలోని అగ్ర దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వలను కూడా మించిపోవడం చూస్తుంటే, భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ‘అసోచామ్’ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. ఈ భారీ నిల్వల్లో కేవలం 2 శాతం ఆర్థిక వ్యవస్థలోకి మళ్లిస్తే భారత్ ప్రపంచ సూపర్ పవర్ గా ఎదగడం ఖాయం.
టాప్-10 దేశాల నిల్వల కంటే ఎక్కువే!
ప్రపంచ వ్యాప్తంగా అగ్ర దేశాలైన అమెరికా, జర్మనీ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం కంటే, మన దేశంలోని సామాన్య మధ్య తరగతి ఇళ్లలోనే ఎక్కువ బంగారం ఉందని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అసోచామ్ నివేదిక ప్రకారం, భారతీయ గృహాల్లో ఉన్న పసిడి విలువ సుమారు $5 ట్రిలియన్లు (సుమారు ₹462.25 లక్షల కోట్లు) గా అంచనా వేశారు. ఇది మన దేశ మొత్తం స్టాక్ మార్కెట్ విలువకు దాదాపు సమానం! ఈ పసుపు లోహమే మన దేశానికి అసలైన ఆర్థిక బలం.
కేంద్ర బ్యాంకుల నిల్వలను మించి..
ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.., అధికారికంగా భారత ప్రభుత్వం వద్ద ఉన్న బంగారం సుమారు 880 టన్నులు. కానీ, ప్రజల వద్ద ఉన్న బంగారం మాత్రం దీనికి వందల రెట్లు ఎక్కువగా ఉంది. ప్రపంచంలోని టాప్-10 కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం కంటే భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారమే ఎక్కువని నివేదిక స్పష్టం చేసింది. ఈ సంపదను గనుక సక్రమంగా వినియోగిస్తే దేశ వృద్ధి రేటు ఊహించని స్థాయికి చేరుకుంటుంది. ఈ భారీ పసిడి నిల్వల్లో ఏటా కేవలం 2 శాతం నిధులను ఆర్థిక వ్యవస్థలోకి (అంటే గోల్డ్ బాండ్లు లేదా మోనిటైజేషన్ స్కీమ్స్ ద్వారా) మళ్లించగలిగితే, 2047 నాటికి భారత జీడీపీకి అదనంగా $7.5 ట్రిలియన్లు తోడవుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల తయారీ, మౌలిక వసతులు, వ్యవసాయ రంగాలకు భారీగా పెట్టుబడులు అందుతాయి.
గోల్డ్ లోన్ల వెల్లువ
బంగారాన్ని కేవలం భద్రంగా దాచుకోవడమే కాకుండా, అవసరానికి వాడుకోవడంలో కూడా భారతీయులు ముందున్నారు. 2025, నవంబర్ నాటికి దేశంలో గోల్డ్ లోన్ల విలువ ₹24.34 లక్షల కోట్లకు చేరిందని నివేదిక పేర్కొంది. అంటే ప్రజలు తమ బంగారాన్ని తాకట్టు పెట్టి వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇతర అవసరాలకు వాడుకుంటున్నారని అర్థం అవుతోంది. దీనివల్ల పసిడి అనేది ఒక ‘డెడ్ అసెట్’ (ఉపయోగం లేని ఆస్తి) గా కాకుండా, ఉత్పాదక శక్తిగా మారుతోంది.
భారతీయుల ఇళ్లలో ఉన్న ఈ ₹462 లక్షల కోట్ల బంగారం మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. దీనిని కేవలం అలంకారంగా మాత్రమే కాకుండా, ఉత్పాదక రంగంలోకి మళ్లించేలా ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలి. అప్పుడే మన ఇళ్లలో ఉన్న పసిడి, నవభారత నిర్మాణానికి పునాదిగా మారుతుంది. ఏదేమైనా, "బంగారం బాబు బంగారమే" అనే మాట భారతీయుల విషయంలో అక్షర సత్యం!