దుబాయ్ రియల్ ఎస్టేట్‌పై యుద్ధ ప్రభావం: విశ్వాసానికి పెద్ద పరీక్ష
దశాబ్దాలుగా "సురక్షిత స్వర్గం" గా పేరుగాంచిన ఈ నగరం.. ప్రస్తుత 2026 నాటి ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో తన ఉనికిని చాటుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది.;
దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ నేడు ఒక చారిత్రాత్మక సంధిగ్ధంలో ఉంది. దశాబ్దాలుగా "సురక్షిత స్వర్గం" గా పేరుగాంచిన ఈ నగరం.. ప్రస్తుత 2026 నాటి ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో తన ఉనికిని చాటుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ పరిణామాలు కేవలం భౌగోళిక రాజకీయ మార్పులే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆస్తి మార్కెట్ విశ్వాసాన్ని పరీక్షించే సవాలుగా మారాయి.
దుబాయ్ రియల్ ఎస్టేట్.. యుద్ధ ప్రభావం.. విశ్వాసానికి పెద్ద పరీక్ష
మధ్యప్రాచ్యంలో ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా ఎదిగిన దుబాయ్ నగరం ఇప్పటివరకు తన రియల్ ఎస్టేట్, టూరిజం రంగాల ద్వారానే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించింది. ఒకప్పుడు కేవలం ఎడారి ప్రాంతంగా ఉన్న ఈ నగరం.. నేడు ఆకాశహర్మ్యాలు.. లగ్జరీ జీవనశైలి, తిరుగులేని భద్రతా ప్రమాణాలతో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మారింది. పన్ను రహిత విధానం.. గోల్డెన్ వీసా వంటి విప్లవాత్మక సంస్కరణలు విదేశీయులను ఇక్కడ బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాయి.
శాంతి భద్రతలు.. పెట్టుబడికి పునాది
దుబాయ్ విజయగాథలో భద్రత అనేది అతిపెద్ద పునాది. ప్రపంచంలోని ధనవంతులు తమ సంపదను ఇక్కడ దాచుకోవడానికి ప్రధాన కారణం ఇక్కడి స్థిరత్వం. అయితే 2026లో చోటుచేసుకున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలు ఈ నమ్మకాన్ని కొంతవరకు సడలించాయి. ఇరాన్ నుండి ప్రయోగించిన క్షిపణులు కొన్ని ప్రాంతాలను తాకాయన్న వార్తలు, నష్ట పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ మానసికంగా ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించాయి. ఎప్పుడూ యుద్ధాలకు అతీతంగా ఉండే దుబాయ్ ఆకాశంలో క్షిపణుల సవ్వడి వినిపించడం రియల్ ఎస్టేట్ రంగానికి ఊహించని షాక్.
ప్రభుత్వం ముందున్న సవాళ్లు.. 'క్యాచ్-22' పరిస్థితి
ప్రస్తుత పరిస్థితుల్లో దుబాయ్ ప్రభుత్వం ఒక క్లిష్టమైన నిర్ణయ దశలో ఉంది. క్షిపణి దాడుల నేపథ్యంలో భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం.. దెబ్బతిన్న మౌలిక వసతులను మరమ్మతు చేయడం అత్యవసరం. దీనికి భారీగా నిధులు అవసరం. ఈ అదనపు ఖర్చుల కోసం ప్రభుత్వం కొత్త పన్నులను విధిస్తే 'పన్ను రహిత నగరం' అనే ట్యాగ్ లైన్ దెబ్బతింటుంది. ఇది జరిగితే ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది. పన్నులు విధించకపోతే ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి పెరుగుతుంది. ధరలు పెంచితే కొనుగోలుదారులు రారు.. తగ్గించితే నిర్మాణ సంస్థలు నష్టపోతాయి. ఈ డైలమానే రియల్టర్లను 'క్యాచ్-22' స్థితిలోకి నెట్టింది.
గోల్డెన్ వీసా, దీర్ఘకాలిక వ్యూహాలు
యూఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 ఏళ్ల గోల్డెన్ వీసా విధానం ప్రస్తుతం కొంత ఊరటనిస్తోంది. కేవలం రెండు ఏళ్ల వీసాతో ఉన్న వారికంటే ఆస్తి కొనుగోలు చేసి పదేళ్ల నివాస హక్కు పొందిన వారు నగరాన్ని వదిలి వెళ్లడానికి అంత సులభంగా ఇష్టపడరు. కానీ కొత్తగా వచ్చే పెట్టుబడుల విషయంలో మాత్రం మందగమనం కనిపిస్తోంది. యుద్ధ మేఘాలు తొలగిపోతే తప్ప కొత్త ప్రాజెక్టుల అమ్మకాలు ఊపందుకునే అవకాశం లేదు.
తిరిగి కోలుకుంటుందా?
గత చరిత్రను పరిశీలిస్తే 2008 ఆర్థిక సంక్షోభం లేదా కోవిడ్-19 మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల నుండి దుబాయ్ అద్భుతంగా కోలుకుంది. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవడం ఈ నగరానికి అలవాటు. బలమైన నాయకత్వం, వ్యూహాత్మక దౌత్య నీతితో దుబాయ్ మళ్లీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని గెలుచుకోగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎడారిలో అద్భుతాన్ని ఆవిష్కరించిన దుబాయ్‌కు ఇది మరో అగ్నిపరీక్ష. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను తట్టుకుని, తన భద్రతా ప్రతిష్టను తిరిగి కాపాడుకోగలిగితే దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం గతంలో కంటే మరింత బలంగా ఆవిర్భవిస్తుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఇప్పుడు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.