రాహుల్ గాంధీ అమెరికా హెల్ప్ తీసుకుంటున్నారా?

Update: 2021-04-03 12:30 GMT
దేశంలో బీజేపీ పాల‌న‌పై, ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాల‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగ సంస్థ‌ల‌న్నింటినీ బీజేపీ గుప్పిట ప‌ట్టింద‌ని ఆరోపించిన‌ట్టు స‌మాచారం. చివ‌ర‌కు మీడియాను కూడా కాషాయ పార్టీ శాస్తోంద‌ని వ్యాఖ్యానించిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, ఆర్థికంగా కూడా బీజేపీ బ‌లిష్టంగా త‌యారైంద‌ని అన్నారు. ఈ కార‌ణాల‌తోనే దేశంలో విప‌క్షాలు బ‌ల‌హీన ప‌డుతున్నాయ‌ని, ఎన్నిక‌ల్లో ఓడిపోతున్నాయ‌ని రాహుల్ విశ్లేషించిన‌ట్టు స‌మాచారం.

కేవ‌లం కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే కాద‌ని, దేశంలో బ‌లమైన ఇత‌ర పార్టీలు కూడా ఓడిపోతున్నాయ‌ని రాహుల్ అన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌జాస్వామ్యానికి రాజ్యాంగ‌బ‌ద్ధ సంస్థ‌లు ఎంతో అవ‌స‌ర‌మ‌న్న రాహుల్‌.. బీజేపీ వాటిపై ఆధిప‌త్యం చెలాయిస్తుండ‌డంతో న్యాయం జ‌ర‌గ‌ట్లేద‌ని రాహుల్ చెప్పిన‌ట్టు స‌మాచారం. ఈ విధంగా ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై కూడా బీజేపీ ఆధిప‌త్యం చెలాయిస్తోంద‌ని అన్న‌ట్టుగా తెలుస్తోంది. అమెరికా రాయ‌బారి నికోల‌స్ బ‌ర్న్స్ తో జ‌రిగిన రాహుల్ వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు స‌మాచారం.

అయితే.. దేశంలోని ప‌రిస్థితుల‌పై మాట్లాడిన రాహుల్‌.. వీటిపై అమెరికా ఎందుకు స్పందించ‌ట్లేద‌ని ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. భార‌త్ - అమెరికా మ‌ధ్య ప్ర‌జాస్వామిక భాగ‌స్వామ్యం ఉంద‌ని మీరు ప్ర‌క‌టించార‌ని, మ‌రి.. భార‌త్ లోని ప‌రిణామాల‌పై ఎందుకు మౌనంగా ఉన్నార‌ని నికోలస్ ను అడిగిన‌ట్టు స‌మాచారం.

అంతేకాకుండా.. స్వేచ్ఛ‌కు అమెరికా రాజ్యాంగంలో అధిక ప్రాధాన్య‌త ఇచ్చార‌ని, అది గొప్ప ఆలోచ‌న కూడా అన్న రాహుల్‌.. దాన్ని కాపాడాల్సిన బాధ్య‌త కూడా ఉంద‌ని రాహుల్ వ్యాఖ్యానించిన‌ట్టుగా తెలుస్తోంది. అయితే.. భార‌త్ లోని ప‌రిణామాల‌పై అమెరికా ఎక్క‌డా స్పందించిన‌ట్టు తాను విన‌లేద‌ని చెప్పార‌ట రాహుల్.

రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌తో.. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డానికి అమెరికా స‌హాయం తీసుకుంటున్నారా? అని మేధావులు విశ్లేషిస్తున్నారు. ఇప్ప‌టికే.. త‌న‌దైన టీమ్ ను రెడీ చేసుకునే ప‌నిలో ఉన్న రాహుల్‌.. విద్యావంతులు, మేధావుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి యంగ్ టీమ్ తో ముందుకు సాగేదిశ‌గా రాహుల్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. అమెరికా రాయ‌బారితో రాహుల్ ఈ విధంగా వ్యాఖ్యానించారంటూ వార్త‌లు రావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.
Tags:    

Similar News