కేసీఆర్ కు మోడీ ఇక దూరమేనా.?

Update: 2019-06-15 04:17 GMT
వర్ధమాన రాజకీయాలను ఆవపోసన పట్టే కేసీఆర్ ఎలాంటి క్లిష్ట పరిస్థితిని అయినా తనకు అనుకూలంగా మార్చుకోగలడు. అయితే రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మోడీ రేంజ్ దేశంలో పెరిగిపోయింది. ఇప్పుడు దేశంలోనే ఆయనను ఎదురించే మగాడు లేడు. ఆయన నిర్ణయాలను ప్రభావితం చేసే వాళ్లు లేరు. అయితే ఎందుకో మోడీ రెండోసారి ప్రధాని అయ్యాక తన స్నేహితులను దూరంగా ఉంచడం చర్చనీయాంశంగా మారింది..

ఇప్పటికే గెలవగానే బీహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ పార్టీకి మంత్రి పదవులు కోత పెట్టి షాక్ ఇచ్చాడు. నితీష్ ఏకంగా మోడీ మంత్రివర్గం నుంచే వైదొలిగి అలిగి కూర్చున్నాడు. అయినా మోడీ స్పందించలేదు. రాయబారాలు నడుపలేదు.

ఇక ఇప్పుడు కేసీఆర్ వంతు.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మోడీని ఆహ్వానించేందుకు కేసీఆర్ వెళ్లడానికి సిద్ధమవ్వగా మోడీ అపాయింట్ మెంట్ దొరకలేదట.. అందుకే హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎంను కలిసిన కేసీఆర్ అటు నుంచి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. కానీ అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు.శనివారం నీతి అయోగ్ సమావేశం జరగనుంది. దీనికి మోడీ కూడా హాజరు అయ్యే అవకాశాలున్నాయి. అయినా ఈ భేటికి కేసీఆర్ వెళ్లకుండా రాష్ట్రం తరుఫున అధికారుల బృందం రామకృష్ణరావు ఆధ్వర్యంలో పంపుతున్నాడు..

మోడీ ప్రధాని అయ్యాక సీఎం కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిసింది లేదు. ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్లకుండా రద్దు చేసుకున్నాడు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు పిలుద్దామన్నా.. అపాయింట్ మెంట్ రాలేదు. దీంతో మోడీ ఎలాగూ దూరం పెంచుతున్నాడని.. కేసీఆర్ కూడా నీతి అయోగ్ సమావేశానికి వెళ్లకుండా అధికారుల బృందాన్ని  పంపిస్తున్నాడు. ఇలా కేసీఆర్-మోడీ దూరం.. దూరం మెయింటేన్ చేస్తున్నారు. ఇది ఎంతకాలమో చూడాలి మరీ.

    

Tags:    

Similar News