బీజేపీలోకి ఈటల.. ‘బండి’కి బ్రేకులేనా?

Update: 2021-06-04 09:34 GMT
బీజేపీలోకి ఒకరి రాక.. మరొకరికి చెక్ పెట్టడానికేనా? బీజేపీలో బండి సంజయ్ దూకుడుకు బ్రేకులు వేయడానికే ఈటల రాజేందర్ ను ఆహ్వానించారా? బీజేపీ రాజకీయాల్లో ఈటల రాకతో సమీకరణాలు మారుతాయా? అంటే ఔననే అంటున్నాయి రాజకీయవర్గాలు.

ఈటల రాజేందర్ కు ఢిల్లీ బీజేపీ పెద్దలు భారీ హామీలు ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారట.. దీనివెనుక పెద్ద స్కెచ్ ఉందని బీజేపీలో చర్చ సాగుతోంది. ఈటలను పార్టీలో చేర్చడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పడ్డ తాపత్రయం చూశాక బీజేపీలో ఈటలను నెత్తిన పెట్టుకోబోతున్నారని.. బీసీ జపంతో పార్టీలో స్ట్రాంగ్ అవుతున్న బండి సంజయ్ ను ప్రత్యామ్మాయంగా ఈటలను కిషన్ రెడ్డి ఇతర నేతలు తెరపైకి తెచ్చారని ప్రచారం సాగుతోంది.

బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. ఆయనకు కరీంనగరం వరకే పట్టు ఉంది. కానీ ఈటల రాజేందర్ కు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బలం, బలగం ఉంది. దీంతో ఈటలరాకతో బీజేపీలో బండి సంజయ్ ప్రాబల్యం తగ్గుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

బండి సంజయ్ దూకుడు పార్టీకి చేటు తెస్తుందన్న అపవాదు బీజేపీలో ఉందట.. దుబ్బాక, జీహెచ్ఎంసీలో గెలుపుతో బండికి బ్రేకులు వేయడం.. ఆపడం రాష్ట్ర నేతలకు సాధ్యపడడం లేదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు, మినీ మున్సిపోల్స్ లో బీజేపీ ఓటమితో బండి కాస్త సైలెంట్ అయ్యారు.

ఇప్పుడు తెలంగాణలో అంతా బండి సంజయ్ దే నడుస్తున్న వేళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అండ్ కో కావాలనే ఈటలనే తెరపైకి తెచ్చారని అంటున్నారు. ఈటల ఢిల్లీ వెళ్లినప్పుడు బండి సంజయ్ కు కనీసం సమాచారం లేదని.. కిషన్ రెడ్డియే అంతా చూసుకున్నారని టాక్ నడుస్తోంది. బీసీల్లో ప్రబలంగా తయారవుతున్న బండికి బ్రేకులు వేసేందుకే ఈటలను తెరపైకి తెచ్చారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో? కిషన్ రెడ్డి, బండి వర్గాల గోల ఏంటో తెలియాలంటే కొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News