బాబుతో బీజేపీకి పెద్ద పని ...!?

ఇక చూస్తే ఈసారి బీజేపీతో పొత్తు కోసం బాబు వెంపర్లాడారు అని అంతా ప్రచారం చేస్తున్నారు కానీ బాబు అవసరం కూడా బీజేపీకి ఉందని ఢిల్లీ స్థాయిలో మాట వినిపిస్తోంది.

Update: 2024-05-07 01:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుకు అపర చాణక్యుడు అని పేరు. ఆయన తిమ్మిని బమ్మిగా చేసే నైపుణ్యం కలిగిన వారు. దేశ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్. చంద్రబాబుకు దేశంలో ఉన్న అన్ని పార్టీల కీలక నేతలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. పార్టీలకు అతీతంగా ఆయన అందరితోనూ స్నేహ బంధాలను మెయిన్ టెయిన్ చేస్తారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు చాకచక్యం బీజేపీకి ఎపుడో తెలుసు అని చెప్పాలి. 1996లో వాజ్ పేయ్ ప్రభుత్వం అధికారాన్ని తొలిసారిగా చేపట్టింది. అయితే ఆ ప్రభుత్వం కేవలం పదమూడు రోజులలోనే పడిపోయింది. దానికి కారణం కాంగ్రెస్ సహా విపక్షాలను అన్నింటినీ ఏకం చేసి చంద్రబాబు ఒకే త్రాటి మీద ఉంచగలిగారు. అలా అధికారంలోకి వచ్చి అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ ని కూడగట్టుకుందామని ఆశపడిన బీజేపీకి బాబు మార్క్ రాజకీయం షాక్ ఇచ్చేసింది.

అదే రకమైన పరిస్థితి 1998 ఎన్నికల్లోనూ జరిగింది. ఒక్క ఓటుతో వాజ్ పేయ్ ప్రభుత్వం పదమూడు నెలలకే పడిపోయింది. ఆ మీదట 1999లో చంద్రబాబుని ఎన్డీయే కూటమిలోకి తెచ్చుకున్న మీదటనే వాజ్ పేయి నాలుగున్నరేళ్ల పాటు సాఫీగా పాలించగలిగారు. అలా చూస్తే కనుక బీజేపీకి బాబు వెన్ను దన్ను ఎంత అవసరం అన్నది అప్పుడే కమలనాధులకు అర్ధం అయింది.

ఇక చూస్తే ఈసారి బీజేపీతో పొత్తు కోసం బాబు వెంపర్లాడారు అని అంతా ప్రచారం చేస్తున్నారు కానీ బాబు అవసరం కూడా బీజేపీకి ఉందని ఢిల్లీ స్థాయిలో మాట వినిపిస్తోంది. అందుకే ఆరెస్సెస్ చొరవ తీసుకుని మరీ బాబుని తెచ్చి ఎన్డీయేలో మిత్రుడు అయ్యేలా చూసింది. ఇదంతా ఇప్పటిదాకా జరిగిన కధ.

Read more!

బాబు అవసరం బీజేపీకి ఎందుకు అంటే కేంద్రంలో ఈసారి ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదు అని సంకేతాలు వస్తున్నాయి. నాలుగు వందల ఎంపీ సీట్లు ఎన్డీయేకు బీజేపీకి సొంతంగా 370 అని ఎంత డప్పుకొడుతున్నా ఉత్తరాదిన బీజేపీకి సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయని అంటున్నారు. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కి ఆమడ దూరంలో ఉండే పరిస్థితి రావచ్చు అని అంటున్నారు.

అదే కనుక జరిగితే మాత్రం కేంద్రంలో మూడవసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. అపుడే ఆకర్షణ మంత్రం కూడా పఠించాల్సి వస్తుంది. ఇక బీజేపీ మిత్రులు అంతా ఎన్డీయేలో ఉన్నారు. వారంతా ఇప్పటికే కలసి పోటీ చేస్తున్నారు. మెజారిటీ తగ్గితే బయట నుంచి కొత్త మిత్రులను వెతుక్కోవాల్సి ఉంటుంది. బీజేపీ తానుగా ఈ విషయంలో సీరియస్ గా ప్రయత్నం ఎంత చేసినా కొంత ఫలితమే రావచ్చు.

కానీ సరిగ్గా చంద్రబాబు కనుక ఎన్డీయే పక్షాన నిలిచి ఉంటే కనుక అవతల పక్షం నుంచి మిత్రులను ఆయన సులువుగా కూడగట్టగలరు అన్నది ఒక మాటగా ప్రచారంలో ఉంది.ఈ విధంగా చూసుకుంటే కనుక చంద్రబాబు అవసరం ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత జాతీయ స్థాయిలో ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు.

ఈ విషయం మీద పూర్తి అవగాహన ఉన్న మీదటనే నరేంద్ర మోడీ అమిత్ షా ఏపీకి వచ్చి చంద్రబాబుని పెద్ద ఎత్తున కీర్తిస్తున్నారు అని అంటున్నారు. చంద్రబాబుని పాలనాదక్షుడు అని వారు ప్రశంసిస్తున్నారు. పైగా బాబుని తమ వైపే ఉంచుకోవాలన్న ఆరాటం కూడా వారిలో కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో అటు ఎన్డీయేకు ఇటు ఇండియా కూటమికి మెజారిటీ రాకపోతే మాత్రం చంద్రబాబు ఢిల్లీలో మరోసారి చక్రం తిప్పడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News