నిరసనకారుల అధీనంలో ఆ దేశ పార్లమెంటు

Update: 2016-05-01 09:36 GMT
ఇరాక్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. షియా ముస్లిం నేత ముఖ్తాద్ అల్ సదర్ నేత నేతృత్వంలో ప్రభుత్వ మార్పు కోరుకుంటూ ప్రజలు ఎంతోకాలంగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. నిరసనకారులతో నిర్వహించిన ఆందోళన శృతిమించటమే కాదు.. ఆ దేశ పార్లమెంటులోకి ఆందోళనకారులు చొరబడటం సంచలనంగా మారింది. పార్లమెంటు భవనంలోకి దూసుకొచ్చిన నిరసనకారులు.. తమకు చిక్కిన రాజకీయ నేతలపై దాడి చేశారు. దీంతో భయపడిన పలువురునేతలు పార్లమెంటు భవనంలోని గదుల్లో దాక్కున్నారు. తలుపులు వేసుకొని తమను రక్షించే సైన్యం కోసం ఎదురుచూస్తున్నారు.

నిరసనకారుల చేతుల్లోకి ఇరాక్ పార్లమెంటు వెళ్లిపోవటంతో.. పార్లమెంటు ప్రాంగణంలోని వాహనాల్ని వారు ధ్వంసం చేస్తున్నారు. ఈ పరిణామంతో ఇరాక్ లో అత్యయిక పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంటులో చిక్కుకుపోయిన నిరసనకారుల్ని విడిపించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఆందోళనకారులతో చర్చలు మొదలు పెట్టింది.

మరోవైపు ఇరాక్ రాజధాని బాగ్దాద్ కు వచ్చే వాహనాలన్నింటి నిలిపివేయటంతో పాటు.. సరిహద్దుల్ని మూసివేశారు. పార్లమెంటులోకి ఆందోళనకారులు దూసుకెళ్లిన వైనాన్ని స్థానిక టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. ఇరాక్ చరిత్రలో కొత్త శకం మొదలైనట్లుగా షియా ముస్లిం నేతృత్వంలోని నిరసనకారులు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News