ఇరాన్ అణు శాస్త్రవేత్త 'మొహ్సేన్ ఫఖ్రిజాదే దారుణ హత్య !

Update: 2020-11-28 10:10 GMT
ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మొహ్సిన్ ఫఖ్రిజాదే హత్యకు గురయ్యారు. దమవాండ్ కౌంటీలోని అబ్సార్డ్‌ లో జరిగిన దాడిలో తీవ్ర గాయాలపాలైన ఫఖ్రిజాదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  సాయుధులు జరిపిన కాల్పుల్లో మొహ్సిన్ ఫఖ్రిజాదే  చనిపోయినట్టు ఆ దేశ రక్షణ శాఖ ధృవీకరించింది. ఇరాన్ రహస్య అణ్వాయుధ కార్యక్రమం వెనుక ఉన్న కీలకమైన వ్యక్తి ఫఖ్రిజాదే అని పాశ్చాత్య దేశాల గూడచార సంస్థలు అనుమానిస్తూ వచ్చాయి. ఇరాన్ అణ్వాయుధాలను ఎంచుకుంటే, ఆ బాంబుకు పితామహుడిగా ఫఖ్రిజాదే అవుతారు అని ఒక పశ్చిమ దేశ దౌత్యవేత్త 2014లో రాయిటర్స్ వార్తా సంస్థతో అన్నారు. 2010 నుంచి 2012 మధ్య నలుగురు ఇరాన్ అణు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు, ఈ హత్యల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపించింది. ఫఖ్రిజాదే హత్య వార్తలపై ఇజ్రాయెల్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ కూడా దీనిపై స్పందించలేదు.

రక్షణ శాఖ పరిశోధన, ఆవిష్కరణల విభాగం అధిపతి మొహ్సేన్ ఫఖ్రిజాదే ప్రయాణిస్తున్న కారును సాయుధులైన తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. తీవ్రవాదులకు ఫఖ్రిజాదే అంగరక్షకులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాంతో స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. కానీ, దురదృష్టవశాత్తు ఆయన్ను రక్షించేందుకు వైద్య బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి అని ఇరాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. మొదట పేలుళ్ల శబ్దం వినించిందని, ఆ తర్వాత మెషిన్ గన్లతో కాల్పులు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ తెలిపింది.

ఇరాన్ రక్షణ శాఖ పరిధిలోని పరిశోధన, ఆవిష్కరణల సంస్థ అధిపతిగా, ఫఖ్రిజాదే కీలక పాత్ర పోషించారు. అందుకే అతని పేరును గుర్తుంచుకుంటాం అని బెంజమిన్ నెతన్యాహు రెండేళ్ల క్రితం హెచ్చరించారు. 2015 ఇరాన్ అణు ఒప్పందం నిబంధనలను ఉల్లంఘించినన ఇరాన్, చాలా ముందుకు వెళ్లింది. ఒప్పందంలో నిర్ధేశించిన స్థాయికి మించి యురేనియం స్వచ్ఛతను పెంచుకుంది. ఇజ్రాయెల్ ఆరోపించిన కీలక వ్యక్తి మొహ్సేన్ ఫఖ్రిజాదే అయితే, ఆయన హత్య ఇరాన్ అణు కార్యక్రమానికి బ్రేకులు వేసే ప్రయత్నం అవుతుంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఇరాన్‌ ఒప్పందంలోకి వాషింగ్టన్‌ ను తిరిగి తీసుకెళ్లడం గురించి చర్చ నడుస్తోంది. కానీ, ఫఖ్రిజాదే హత్య కారణంగా భవిష్యత్తులో జరిగే చర్చలు క్లిష్టతరమయ్యే అవకాశం ఉంది.
Tags:    

Similar News