సిక్కోలు నుంచి కొత్త వారసురాలు

శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి మాజీ మంత్రులు ధర్మాన సోదరులు తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.;

Update: 2026-04-26 02:30 GMT

శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి మాజీ మంత్రులు ధర్మాన సోదరులు తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అది వారి సొంత సీటు. 1989లో ధర్మాన ప్రసాదరావు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ టెర్మ్ లోనే మంత్రి కూడా అయ్యారు. ఇక ఆయన 1999 లలో అక్కడ నుంచి గెలిచారు. 2004, 2009లో శ్రీకాకుళానికి షిఫ్ట్ అయ్యి పోటీ చేసి గెలిచారు. వైసీపీ హయాంలో తిరిగి 2019లో మరోసారి గెలిచారు. ధర్మాన క్రిష్ణదాస్ నరసన్నపేట నుంచి 2004, 2009, 2012, 2019లలో నాలుగు సార్లు గెలిచారు. ఇక గత మూడు దశాబ్దాలుగా ధర్మాన కుటుంబాన్ని బగ్గు కుటుంబం రాజకీయంగా ఎదిరిస్తూ వస్తోంది. 1994లో ధర్మాన ప్రసాదరావుని బగ్గు లక్ష్మణరావు ఓడించారు. 2014లో క్రిష్ణదాస్ ని బగ్గు రమణమూర్తి ఓడించారు. 2024లో మరోసారి బగ్గు రమణమూర్తి గెలిచారు.

కూతురు ఎంట్రీ :

ఇదిలా ఉంటే బగ్గు కుటుబంలో లక్ష్మణరావు రమణమూర్తి సోదరులు ఇద్దరూ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఇపుడు తరువాత తరం రంగ ప్రవేశం చేస్తోంది. ఆమె ఎవరో కాదు సిట్టింగ్ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన. ఆమె పార్టీలో చురుకుగా ఉంటున్నారు. తండ్రితో సమానంగా ఆమె నియోజకవరగంలో తిరుగుతున్నారు. క్యాడర్ తో పరిచయాలు పెంచుకున్నారు. ఒక విధంగా ఆమె కీలక నాయకురాలిగా ఎదిగారు. తాజాగా టీడీపీ ప్రకటించిన రాష్ట్ర కమిటీలలో ఆమె టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా నియమితులు అయ్యారు. దాంతో ఆమెకు పార్టీ పెద్దల ఆశీస్సులు లభించాయని అంటున్నారు. పైగా యువ నాయకురాలికి లోకేష్ బృందంలో చోటు దక్కింది అని అంటున్నారు.

బలమైన కుటుంబం :

నరసన్నపేటలో వెలమ సామాజిక వర్గం రాజకీయంగా కీలకంగా ఉంటూ వస్తోంది. ఇక ఈ ప్రాంతంలో రాజకీయంగా బగ్గు ఫ్యామిలీ వెరీ స్ట్రాంగ్ గా ఉంది. దాంతోనే అనేక సార్లు ధర్మాన కుటుంబాన్ని ఓడిస్తూ వస్తోంది. అయితే దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలన్న ముందు చూపుతో బగ్గు రమణమూర్తి తన కుమార్తె అర్చనను రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు అని అంటున్నారు. ఆమె కూడా తండ్రి బాటలో నడుస్తున్నారు అని చెబుతున్నారు.

రామ్మోహన్ ఫోకస్ :

అయితే ఈ సీటు మీద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చూపు ఉందని అంటున్నారు. ఆయన 2024 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని చూశారు. కానీ హైకమాండ్ కేంద్ర రాజకీయాల్లో ఉండాలని సూచించడంతో ఆయన ఎంపీగా పోటీ చేశారు. అయితే ఈసారికి ఆయన కేంద్ర మంత్రిగా కూడా కీలకమైన స్థానంలో ఉండడం జరిగింది. అయితే 2029 నాటికి ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తారు అని అంటున్నారు. దాంతో తనకు సురక్షితమైన స్థానంగా నరసన్నపేటను ఎంచుకున్నారని చెబుతున్నారు. ఆయన కనుక వస్తే బగ్గు ఫ్యామిలీ పోటీ నుంచి తప్పుకుంటుందా లేదా వేరే చోట అవకాశం ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. అయితే జిల్లాకు చెందిన మహిళా వారసులల్లో బగ్గు అర్చన కూడా చేరిపోయారు. ఇప్పటికే పలాస నుంచి ఎమ్మెల్యేగా గౌతు శిరీష ఉన్నారు. ఆమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ ఎమ్మెల్సీగా ఉన్నారు. పార్టీలో కీలక పదవులో ఉన్నారు. మరి బగ్గు అర్చన కూడా రాజకీయంగా ఏ విధంగా ముందుకు సాగుతారో చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News