రోహిత్ సిక్సర్ల మోత.. ముంబై బోణీ!

Update: 2020-09-24 04:30 GMT
ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై  49 పరుగుల తేడాతో  విజయం సాధించి ఐపీఎల్ లో బోణీ కొట్టింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సిక్సర్ల మోత మోగించి భారీ స్కోర్ సాధించడంతో కోల్ కతా ముందు భారీ లక్ష్యం ఛేదించలేక ఆడిన తొలి మ్యాచ్ లోనే పరాజయం మూటగట్టుకుంది. ముందుగా బ్యాటింగ్‌ కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (54 బంతుల్లో 80; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), సూర్యకుమార్‌ (28 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిశారు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులే చేసి ఓడింది. టెయిలెండర్‌ కమిన్స్‌ (12 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లు, మిడిలార్డర్‌ వైఫల్యంతో  కోల్‌కతా లక్ష్యాన్ని అందుకోలేక పోయింది. శుబ్‌మన్‌ (7), నరైన్‌ (9) ముందే పెవిలియన్ బాట పట్టగా కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (30; 5 ఫోర్లు), నితీశ్‌ రాణా (24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కాసేపు పోరాడినా భారీ  భాగస్వామ్యం నమోదు చేయలేకపోయారు. స్టార్‌ బ్యాట్స్‌మన్లు  రసెల్‌ (11), మోర్గాన్‌ (16)లను బుమ్రా ఒకే ఓవర్లో ఔట్ చేయడం తో కోల్ కతా పరాజయం పాలైంది.

రోహిత్ ఒక్క మ్యాచ్.. ఎన్నో  రికార్డులు

200 సిక్సర్లు

ఈ మ్యాచ్ లో మొత్తం ఆరు సిక్సర్లు బాదిన రోహిత్ ఐపీఎల్ లో  200 సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల  క్లబ్ లో చేరాడు.  ఐపీఎల్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా విండీస్ హిట్టర్ క్రిస్ గేల్ (326 సిక్సులు) రికార్డుల్లో ఉన్నాడు. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ (214) ఉన్నాడు. ఇక టీమిండియా ఎంఎస్ ధోనీ (212) మూడో స్థానంలో ఉన్నాడు.200 సిక్సర్లతో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

అత్యధిక సార్లు 50కి పైగా స్కోర్లు

కోల్‌కతా పై హాఫ్ సెంచరీ బాదడం తో ఐపీఎల్‌ లో అత్యధిక సార్లు 50కి పైగా స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధావన్, ఏబీ డివిలియర్స్‌ ను రోహిత్ శర్మ వెనక్కి నెట్టాడు. ధావన్, ఏబీ తలో 37 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేశారు. 48 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ (41), సురేష్ రైనా (39) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. 38 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసి రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. మరొక్కటి బాదితే.. రైనాను అందుకుంటాడు.

పది సార్లు ఐదు కంటే ఎక్కువ సిక్సులు

ఐపీఎల్ మ్యాచ్‌లో ఎక్కువసార్లు ఐదు లేదా అంతకంటే కంటే ఎక్కువ సిక్సులు కొట్టిన భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ తొలి స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకూ రోహిత్ పదిసార్లు ఐదు కంటే ఎక్కువ సిక్సులు బాదాడు.  ధోనీ, సురేష్ రైనా చెరో ఎనిమిది సార్లు ఐదు లేదా అంతకంటే కంటే ఎక్కువ సిక్సులు కొట్టారు.

 ఒక జట్టుపై అత్యధిక పరుగులు

కోల్‌కతాతో జరిగిన  మ్యాచ్‌లో  రోహిత్ శర్మ ఆరు పరుగులు చేయగానే.. ఐపీఎల్‌లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కోల్‌కతాపై రోహిత్ 904 పరుగులు చేశాడు. ఈ జాబితాలో చెన్నై స్టార్ ఆటగాడు సురేష్ రైనా 955 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతూన్నాడు. కోల్‌కతాపైనే హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 829 రన్స్ చేశాడు. అతడిని వెనక్కినెట్టి రోహిత్ రెండో స్థానానికి వచ్చాడు.

 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లలో రోహిత్ టాప్

 హిట్ మ్యాన్ రోహిత్ ఐపీఎల్ లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కైవసం చేసుకున్న భారత్ ఆటగాడిగా నిలిచాడు.ఈ జాబితాలో గేల్ (21), డివిలియర్స్ (20), రోహిత్ (18), ధోనీ (17), వార్నర్ (17), యూసుఫ్ పఠాన్ (17) ఉన్నారు. ఐపీఎల్లో మరో పది పరుగులు చేస్తే రోహిత్ 5వేల పరుగుల క్లబ్ లో చేరతాడు.

మ్యాచ్ లో మరిన్ని హైలైట్స్

* ముంబై ఇండియన్స్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ఓ అరుదైన రికార్డు సృష్టించాడు.
ఈ సీజన్‌లో హిట్ వికెట్ ద్వారా ఔట్ అయిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు.కోల్‌కతా బౌలర్ రసెల్ వేసిన 18వ ఓవర్‌ మూడో బంతికి హార్దిక్ పాండ్యా బాగా బ్యాక్  ఫుట్ వేశాడు. స్ట్రైక్ చేసే సమయంలో బ్యాట్ వికెట్లకు తగిలింది. దీంతో హిట్ వికెట్‌గా ఔట్ అయ్యాడు.

* ఈ మ్యాచ్‌ లో ఓటమితో కోల్ కతా  చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకుంది.  2013 నుంచి 2019 వరకూ కేకేఆర్‌ ఎప్పుడూ తన తొలి  మ్యాచ్‌ లో ఓడిపోలేదు. అయితే తాజా సీజన్‌ లో  ఓపెనింగ్‌ మ్యాచ్‌లోనే ఓటమి చెందింది.

* గాయం తర్వాత కోలుకున్న హార్డ్ హిట్టర్ హార్దిక్ పాండ్యాపై భారీ అంచనాలు ఉండగా.. అతడు తొలి మ్యాచ్ లో విఫలం అయ్యాడు. ఈ మ్యాచ్ లో అతడు హిట్ వికెట్ గా వెనుదిరగడంతో క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.
Tags:    

Similar News