స్పీకర్ ప్రసాదరావుపై బీజేపీ పిటిషన్.. ఇంత ఇంట్రస్ట్ ఏంటో?!
తెలంగాణలో మరో రాజకీయ దుమారం రేగింది. తమకు సంబంధం లేని విషయంలో బీజేపీ స్పందిస్తోందని.. కొందరు రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.;
తెలంగాణలో మరో రాజకీయ దుమారం రేగింది. తమకు సంబంధం లేని విషయంలో బీజేపీ స్పందిస్తోందని.. కొందరు రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున విజయం దక్కించుకున్న 10 మంది ఎమ్మెల్యేలు తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్‌కు అనుకూలంగా మారారు. వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు.. జంపింగ్ ఎమ్మెల్యేలను విచారించారు. వీరిలో ఏడు గురు ఎమ్మెల్యేలకు ఆయన క్లిన్ చిట్ ఇచ్చారు.
ఏడుగురు ఎమ్మెల్యేలు.. పార్టీ మారలేదని.. వారంతా బీఆర్ఎస్‌లోనే ఉన్నారని ప్రసాదరావు తేల్చి చెప్పారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం ఇంకా డోలాయమానంలో ఉన్నారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజ య్ ఉన్నారు. వీరి వ్యవహారం మినహా.. మిగిలిన ఏడుగురి విషయాన్ని స్పీకర్ ప్రసాదరావు తేల్చేశారు. అయితే.. సుప్రీంకోర్టు గత విచారణలో మొత్తం ఎమ్మెల్యేల వ్యవహారాన్నీ మూడు మాసాల్లో తేల్చాలని ఆదేశించింది. ఈగడువు శుక్రవారంతో ముగిసిం ది.
కానీ, ఈ గడువు ముగిసేలోపు.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురి వ్యవహారాన్ని మాత్రమే స్పీకర్ ప్రసాదరావు తేల్చా రు. మిగిలిన ముగ్గురి వ్యవహారం పెండింగులో ఉందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అభ్యంతరం వ్యక్తం చేయాలని అనుకుంటే.. బీఆర్ ఎస్ నాయకులు చేయాలి. కానీ, దీనికి భిన్నంగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రసాదరావు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఏలేటి తన పిటిషన్‌లో కోరారు. సుప్రీంకోర్టు మూడు మాసాల్లో ఈ విషయాన్ని తేల్చాలని చెప్పినా.. స్పీకర్ పట్టించుకోలేదన్నారు.
ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. అయితే.. బీఆర్ఎస్ నాయకులకు ఉండాల్సిన ఇంట్రస్టు.. బీజేపీకి ఉండడం ఏంట న్నదే ఇప్పుడు ప్రశ్న. ఈ విషయంపైనే కాంగ్రెస్ నాయకులు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటే అన డానికి ఇదే రుజువు అంటూ.. నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.. బీఆర్ఎస్‌కు లేని బాధ, బాధ్యత బీజేపీకి ఎందుకని వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నడుచుకున్నారని.. ఏడుగురి విషయాన్ని స్పష్టం చేశారని.. మరికొం త సమయం తీసుకునే అవకాశం ఉందన్నారు. మొత్తంగా బీజేపీ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు.
సుప్రీంలో విచారణ..
మరోవైపు.. గత విచారణకు కొనసాగింపుగా శుక్రవారం సుప్రీంకోర్టులో అనర్హతపై విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున న్యాయ వాది.. స్పీకర్ ప్రసాదరావు ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ జరిపారని తెలిపారు. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని కొంత సమయం కావాలని కోరారు. దీనికి సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. మరో 4 వారాల గడువు ఇచ్చింది.