తాడిపత్రి మళ్ళీ రాజుకున్నట్లేనా ?
బాలయ్య పాత సినిమాలో ఒక పాపులర్ మాస్ డైలాగ్ ఉంటుంది. డేట్ టైం ఫిక్స్ చేయ్ అని ప్రత్యర్థికి సవాల్ విసురుతూ.;
బాలయ్య పాత సినిమాలో ఒక పాపులర్ మాస్ డైలాగ్ ఉంటుంది. డేట్ టైం ఫిక్స్ చేయ్ అని ప్రత్యర్థికి సవాల్ విసురుతూ. ఇపుడు అచ్చం అలాంటి డైలాగే తాడిపత్రిలో ఊపేస్తోంది. రాజకీయ వేడి రాజేస్తోంది. అటు జేసీ ఫ్యామిలీ ఇటు కేతిరెడ్డి పెద్దా రెడ్డి భీకరమైన సవాల్ చేసుకుంటున్నారు. ఇదంతా రాయలసీమ పౌరుషం మీద డిబేట్ అంటున్నారు. నేను రెడీ అంటే నేను రెడీ అంటున్నారు. లేటెస్ట్ గా చూస్తే రాయలసీమ పౌరుషంపై తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన సవాల్ ని నేను స్వీకరిస్తున్నానని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు.
మీ పాలనా నా పాలనా :
అంతే కాదు ఎక్కడైనా ఎపుడైనా తాను చర్చకు రెడీ అని కేతిరెడ్డి పెద్దా రెడ్డి బిగ్ సౌండ్ చేశారు. తాడిపత్రిని గత మూడు దశాబ్దాలుగా జేసీ పాలించిందని తాను అయిదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను అని ఈ రెండు పాలనల మీద చర్చకు సిద్ధమని పెద్దా రెడ్డి గంభీరంగా ప్రకటించారు. దీనికి సంబంధించి డేట్ టైం మీరే ఫిక్స్ చేయండి అని ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డికే చాన్స్ ఇచ్చారు. అంతే కాదు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు సమాచారం ఇవ్వండి అని అన్నారు తాడిపత్రిలోనా లేక రాయలసీమ జిల్లాల్లో ఎక్కడైనా చర్చకు తాను రెడీగా ఉన్నాను అని ప్రతి సవాల్ చేశారు.
స్వేచ్చ లేదని :
జేసీల పాలనలో మాజీ ఎమ్మెల్యేగా తనకే స్వేచ్చగా తిరిగే అవకాశం లేదని పెద్దారెడ్డి అంటున్నారు తాను నియోజకవర్గంలోకి అడుగు పెట్టకుండా జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అంతే కాదు పోలీసులను అడ్డం పెట్టుకుని పాలిస్తున్నారు అని అన్నారు. అలాంటి జేసీ ప్రభాకర రెడ్డి రాయల సీమ పౌరుషం అంటూ తనకు సవాల్ విసరడం మీద తాను సానుకూలంగానే స్పందిస్తున్నాను అన్నరు. బహిరంగ చర్చకు తాను ఎపుడూ సిద్ధమే అని కేతిరెడ్డి ప్రకటించారు.
ఇదే కండిషన్ :
అయితే ఈ బహిరంగ చర్చకు జేసీ కుటుంబం, తన కుటుంబం మాత్రమే హాజరు కావాలని పెద్దారెడ్డి షరతు పెట్టారు. రెండు కుటుంబాల సమక్షలోనే ఎవరి పాలన ఎలా ఉంది అన్నది తేల్చుకుందామని పెద్దా రెడ్డి అంటున్నారు. తాను ఎవరికీ దేనికీ భయపడేవాడిని కానని ఆయన చెప్పరు. అంతే కాదు తాను ఏది మాట్లాడినా జేసీ విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ప్రభాకర రెడ్డి విమర్శించడం కంటే హాస్యాస్పదం వేరొకటి లేదని అన్నారు టీడీపీ నేతల అక్రమాలు తాడిపత్రి నియోజకవర్గంలో అధికం అయ్యాయని అన్నారు. వీటి మీద ఎన్ని సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని అన్నారు
హీటెక్కిపోతోందిగా :
సాధారణంగా తాడిపత్రి అన్నది సున్నితమైన ప్రాంతంగా చెబుతారు. రాజకీయంగా కూడా అక్కడ వేడి వాడి చాలా ఉంటుంది. ఇక వైసీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ ఇచ్చాక గత పదేళ్ళుగా జేసీస్ వర్సెస్ పెద్దారెడ్డి అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా ఇద్దరు నేతలూ సవాళ్ళూ ప్రతి సవాళ్ళూ చేసుకోవడంతో తాడిపత్రి రాజకీయం హీటెక్కిపోతోంది అని అంటున్నారు. చూడాలి మరి బిగ్ డిబేట్ సాగుతుందా లేక మాటలకే పరిమితం అవుతుందా లేదా అన్నది.