క‌రెన్సీని పేప‌ర్ నాప్ కిన్ గా వాడేస్తున్నార‌ట‌!

Update: 2019-07-06 06:13 GMT
మీరు విన్న‌ది నిజ‌మే. అక్క‌డ ట‌మోటా కిలో కొనాలంటే ఏకంగా రూ.30వేలు చెల్లించాల్సిందే. ఇక లీట‌రుపాలు కావాలంటే రూ.50వేలు చెల్లిస్తే కానీ చేతికి పాకెట్ రాని ప‌రిస్థితి. షేర్ మార్కెట్ లో ఎలా అయితే వివిధ కంపెనీల షేర్లు క్ష‌ణంకో ధ‌ర ప‌లుకుతాయో.. ఆ దేశంలో నిమిషానికి ఒక రేటు చొప్పున ప‌లుకుతుంటాయి. మ‌రికాస్త వివ‌రంగా చెప్పాలంటే వంద రూపాయిల‌కు కొన్న బిస్కెట్ పాకెట్ ప‌ది నిమిషాల త‌ర్వాత వెళితే రూ.200 చెప్పినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు.

ఎందుకిలా అంటే.. ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా లేని రీతిలో ద్ర‌వ్యోల్బ‌ణం భారీగా పెరిగిపోయిన వెనెజులా దేశంలో ఇప్పుడింత దారుణ ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్పుడా దేశ ఆర్థిక ప‌రిస్థితి ఎంత దారుణంగా మారిందంటే.. టాయిలెట్ పేప‌ర్లు కొనే బ‌దులు క‌రెన్సీ నోట్ల‌ను అందుకు వాడుతున్నారంటే అక్క‌డి క‌రెన్సీ నోట్ల‌కు ఎంత దారుణ ప‌రిస్థితి దాపురించిందో ఇట్టే చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం ఆ దేశంలో ఆర్థిక‌..సామాజిక‌.. రాజ‌కీయ సంక్షోభాల‌తో నిండా మునిగిపోయింది.

ఆ దేశానికి ప్ర‌ధాన ఆదాయ‌వ‌న‌రు ముడిచ‌మురు. అయితే.. క్రూడాయిల్ ధ‌ర‌లు భారీగా ప‌డిపోవ‌టంతో ఆ దేశ క‌రెన్సీ బొలివ‌ర్ కు డిమాండ్ ప‌డిపోయింది. అదే స‌మ‌యంలో విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకునే వ‌స్తువులు అంత‌కంత‌కూ ఎక్కువ కావ‌టం.. వాటికి అవ‌స‌ర‌మైన క‌రెన్సీని లెక్కాప‌త్రంలా ముద్రించ‌టంతో నోటు చిత్తు కాగితంగా మారింది. అంద‌రి చేతుల్లో డ‌బ్బులు ఉన్నా.. వాటితో కొనుగోలు చేయ‌టానికి వ‌స్తువులు లేని ప‌రిస్థితి.

ప్ర‌తి విష‌యంలోనూ దారుణ ప‌రిస్థితి ఉండ‌టంతో ఇప్పుడా దేశం నుంచి ప‌దిశాతం మంది ప్ర‌జ‌లు వేరే దేశాల‌కు వ‌ల‌స‌పోయారు. ఒక అంచ‌నా ప్ర‌కారం ఇటీవ‌ల కాలంలో ఆ దేశం నుంచి విదేశాల‌కు వ‌ల‌స వెళ్లిన వారి సంఖ్య 30 ల‌క్ష‌ల‌కు పైనేన‌ని చెబుతున్నారు. ఈ ఏడాది చివ‌రి నాటికి వెనెబులా ద్ర‌వ్యోల్బ‌ణం 10ల‌క్ష‌ల శాతానికి చేరుకుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌భుత్వం పాత క‌రెన్సీ బొలివ‌ర్ ఫుర్టె స్థానంలో బొలివ‌ర్ సోబ్రానో క‌రెన్సీని ప్ర‌వేశ పెట్టింది. ఒక సోబ్రానో ల‌క్ష ఫుర్టెల‌కు స‌మానంగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం కొత్త క‌రెన్సీ సొబ్రానో ఒక్కొక్క‌టి భార‌త క‌రెన్సీలో సుమారు రూ.6.88కి స‌మానంగా చెబుతున్నారు. క‌నుచూపు మేర ఆ దేశం బాగుప‌డే సూచ‌న‌లు క‌నిపించ‌ట్లేదంటున్నారు.
Tags:    

Similar News