వైసీపీలో చేరిన బీజేపీ నేత‌!

Update: 2018-09-05 13:17 GMT
ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ ఫ్యాన్ గాలి బ‌లంగా వీస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. వైసీపీ అధినేత జ‌గ‌న్ చేస్తోన్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అపూర్వ ఆద‌ర‌ణ ల‌భిస్తోన్న నేప‌థ్యంలో ఆ పార్టీలో చేరేందుకు ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు క్యూ క‌డుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రంగా భావిస్తోన్న వైసీపీలో ఇప్ప‌టికే ప‌లువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియ‌ర్ పొలిటిషియ‌న్లు చేరారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే విజయనగరం జిల్లాలో జ‌గ‌న్ పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీలో వలసలు పర్వం మొద‌లైంది. బీజేపీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజు బుధ‌వారం నాడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ సమక్షంలో ర‌ఘురాజు వైసీపీలో చేరారు.

ర‌ఘురాజుకు కండువాక‌ప్పిన జ‌గ‌న్ ఆయనను వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతేకాకుండా, రఘురాజుతో పాటు 500 మంది నేతలు, కార్యకర్తలు కూడా జ‌గ‌న స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. జ‌గ‌న్ ను క‌లిసే ముందు శృంగవరపు కోట నుంచి 500 బైకులతో ర్యాలీగా వీరంతా పెందుర్తికి తరలివచ్చారు. వీరితోపాటు, విశాఖకు చెందిన ప్రముఖ వైద్యుడు, కళా ఆస్పత్రి అధినేత పైడి వెంకట రమణమూర్తి, పలువురు వైద్యులు కూడా ఈ రోజు వైసీపీలో చేరారు. 2019లో జగన్‌ ప్రభంజనం సృష్టిస్తారని రఘురాజు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల‌ను వైసీపీ కైవసం చేసుకుంటుంద‌ని ఆయ‌న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తామంతా సైనికుల్లా పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ శేఖ‌ర్ రెడ్డి ఆశయ సాధన కోసం జగన్‌ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని, ఆయనతో కలిసి పనిచేయబోవ‌డం సంతోషంగా ఉందని అన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే జగన్ సీఎం కావాల‌ని అన్నారు. ఎస్‌ కోట నియోజకవర్గంలో వైసీపీ గెలుపును జగన్‌కు కానుకగా ఇస్తామన్నారు.

Tags:    

Similar News