ఇరుగుపొరుగుపై ఆర్మీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2017-09-07 05:49 GMT
ఆచితూచి మాట్లాడుతూ.. వీలైనంత వ‌ర‌కు బ‌హిరంగ వేదిక‌ల మీద‌కు రాని తీరు మ‌న త్రివిధ ద‌ళాధిప‌తుల్లో క‌నిపిస్తుంది. అందుకు భిన్నంగా మోడీ స‌ర్కారు కొలువు తీరిన త‌ర్వాత ఆర్మీ ప్ర‌తినిధులు మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడుతున్నారు. ఈ కార‌ణంగానే మొన్న‌టి వ‌ర‌కూ తెలియ‌ని చాలామంది ఆర్మీ ప్ర‌తినిధుల పేర్లు ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు తెలుస్తోంది.
 
ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. భార‌త తాజాగా ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త సైన్యం చైనా.. పాకిస్థాన్ ల‌తో స‌మ‌రానికి త‌ప్ప‌క సిద్ధం కావాల‌న్నారు. భార‌త్ ను ఆక్ర‌మించేందుకు చైనా ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని.. మ‌రోవైపు పాక్ తో రాజీ కుదిరే అవ‌కాశ‌మే క‌నిపించ‌టం లేద‌ని వ్యాఖ్యానించారు.

ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంగా మాట్లాడిన రావ‌త్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. డోక్లాంలో భార‌త్‌.. చైనాల మ‌ధ్య నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న గురించి రియాక్ట్ అవుతూ.. ఇలాంటి స‌మ‌స్య‌ల్ని త్వ‌ర‌గా ముగించొచ్చ‌ని.. లేదంటే చైనాతో పాటు పాక్ తో క‌లిసి కూడా యుద్ధం చేసే వ‌ర‌కూ వెళ్లాల్సి రావొచ్చంటూ కొత్త త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు.

ఒక దేశం మీద యుద్ధం చేయాల్సి రావ‌టంపై రాజ‌కీయ నేత‌లు సైతం ఆచితూచి మాట్లాడుతున్న వేళ‌.. ఆర్మీ చీఫ్ మాత్రం అందుకు భిన్నంగా కొత్త గ‌ళాన్ని వినిపించ‌టం గ‌మ‌నార్హం. ఎలాంటి ప‌రిస్థితుల‌కైనా సైన్యం సిద్ధంగా ఉండాల‌న్న ఆయ‌న‌.. దేశం బ‌య‌ట నుంచి వ‌చ్చే ప్ర‌మాదాల్ని స‌మ‌ర్థంగా ఎదుర్కోవాలంటే త్రివిధ ద‌ళాల్లో ఆర్మీకే అధిక ప్రాధాన్య‌త కొన‌సాగించాల‌న్న వ్యాఖ్య‌ను చేశారు.

మొత్తానికి మ‌న ఆర్మీ చీఫ్.. గ‌త చీఫ్ ల కంటే ఉత్సాహంగా ఉండ‌టం క‌నిపిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఓవైపు చైనా అధ్య‌క్షుడు జీ జిన్ పింగ్ తో భేటీ అయిన ప్ర‌ధాని మోడీ ఇరుదేశాల మ‌ధ్య స‌త్సంబంధాల్ని ప్రోత్స‌హించే అంశంపై సానుకూల ధోర‌ణిలో మాట్లాడుకున్నార‌న్న వార్త‌లు వెలువ‌డిన వేళ‌లోనే.. అందుకు భిన్న‌మైన వ్యాఖ్య‌లు ఆర్మీ చీఫ్ నోటి వెంట క‌నిపిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ త‌ర‌హా చిత్ర‌మైన ప‌రిస్థితి స‌మ‌కాలీన భార‌తంలో చోటు చేసుకోలేద‌నే చెప్పాలి. చూస్తుంటే.. ఇరుగుపొరుగు దేశాలు.. మ‌రీ ముఖ్యంగా ర‌క్ష‌ణ ప‌రంగా ఇబ్బంది క‌లిగించే దేశాల విష‌యంలో మోడీ స‌ర్కారు కొత్త వ్యూహాన్ని అమ‌లు చేస్తున్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు.  మ‌రి.. ఆర్మీ చీఫ్ వ్యాఖ్య‌ల‌పై చైనా మీడియా.. చైనా సైన్యాధికారులు ఎలా రియాక్ట్ అవుతారో?
Tags:    

Similar News