రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలంగాణ నుంచి బరిలోకి దిగేవారు వీరే..
రాజ్యసభ సభ్యుల ఎన్నికలు సాధారణ ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించకపోయినా, దేశ చట్టసభ నిర్మాణంలో కీలక భాగం.;
దేశ రాజకీయాల్లో కీలక ప్రాధాన్యం కలిగిన రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ చర్చలు వేగం పుంజుకున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై లోపల చర్చలు ముమ్మరమయ్యాయి.
26న నోటిఫికేషన్..
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 26న అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది. అభ్యర్థుల నామినేషన్ దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియల అనంతరం మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. రాజ్యసభ ఎన్నికలు ప్రత్యక్ష ఓటింగ్ విధానంలో కాకుండా, సంబంధిత రాష్ట్ర శాసనసభ సభ్యుల ఓట్ల ద్వారా ప్రాతినిధ్య పద్ధతిలో నిర్వహించనున్నారు. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో ఉన్న శాసనసభ బలం కీలకంగా మారుతుంది.
ఈ ఎన్నికల్లో ముఖ్యంగా సంఖ్యాబలం తేడా తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారనున్నాయి. మిత్రపక్షాల మద్దతు, క్రాస్ ఓటింగ్ అవకాశాలు, వ్యూహాత్మక నిర్ణయాలు ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కేంద్రంలో అధికార సమీకరణాల దృష్ట్యా కూడా ఈ రాజ్యసభ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజ్యసభలో సంఖ్యాబలం పెంచుకోవాలని చూస్తున్న జాతీయ పార్టీలు ప్రతి స్థానాన్ని కీలకంగా పరిగణిస్తున్నాయి.
తెలంగాణలో రెండు స్థానాలు..
తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఈసారి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్రస్తుత శాసనసభ బలం ఆధారంగా ఈ స్థానాలపై ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు, భవిష్యత్ వ్యూహాలు అన్నీ కలిసివచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు ఈ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
రాజ్యసభ సభ్యుల ఎన్నికలు సాధారణ ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించకపోయినా, దేశ చట్టసభ నిర్మాణంలో కీలక భాగం. కీలక బిల్లులు, రాజ్యాంగ సవరణలు, జాతీయ విధానాల ఆమోదంలో రాజ్యసభ పాత్ర అత్యంత ముఖ్యమైంది. అందుకే ఈ ఎన్నికలను కేవలం స్థానాల భర్తీగా కాకుండా, దేశ రాజకీయ దిశను ప్రభావితం చేసే ప్రక్రియగా చూడాల్సిన అవసరం ఉంది.
తెలంగాణలో రెండు స్థానాలు
రాష్ట్రానికి చెందిన రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్న వేళ.. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ వేగంగా కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం, బీఆర్ఎస్ వైఖరి అంశాలను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
కాంగ్రెస్ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ నుంచి ఇద్దరు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో పార్టీ ఇద్దరిని ఖరారు చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎంతో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి పెద్దల సభలో సభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ పదవీకాలం ఏప్రిల్ 9వతో ముగియనుంది. వీరి స్థానంలో తెలంగాణ నుంచి ఇద్దరిని పంపించాలి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం ఉందని ప్రచారం. ఢిల్లీ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుత సభ్యుడు అభిషేక్ సింఘ్వీకి తిరిగి రెన్యువల్ దాదాపు ఖాయం. తెలంగాణ ప్రభుత్వం న్యాయ వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో హైకమాండ్ మళ్లీ అవకాశం ఇవ్వాలని నిర్ణయించిందని సమాచారం.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి వైపు హైకమాండ్ మొగ్గు
రెండో స్థానం కోసం సుప్రీం మాజీ న్యాయమూర్తి, ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి నుంచి పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన్ను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ నాయకత్వం భావించినట్లు సమాచారం. దేశంలో అత్యంత లబ్ధప్రతిష్టులైన న్యాయకోవిదుల్లో ఒకరిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయనను పెద్దల సభకు పంపడం ద్వారా కాంగ్రెస్ ఒక బలమైన మేధో వర్గ ప్రతినిధిని ఎంపిక చేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చివరి నిమిషంలో మార్పులు లేకుంటే సుదర్శన్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.