తమ్ముళ్లకు వర్గ పోరే సెగ పెడుతోంది..లేకుంటే ఫస్టే.. !
ఇటీవల ప్రకటించిన నియోజకవర్గాల ప్రగతి నివేదికలో అనూహ్యంగా కొన్ని నియోజకవర్గాలు ముందుకు వచ్చాయి. మరికొన్ని చాలా వెనుకబడ్డాయి.;
ఇటీవల ప్రకటించిన నియోజకవర్గాల ప్రగతి నివేదికలో అనూహ్యంగా కొన్ని నియోజకవర్గాలు ముందుకు వచ్చాయి. మరికొన్ని చాలా వెనుకబడ్డాయి. నిజానికి ముందుకు దూసుకువచ్చిన నియోజకవర్గాలుగా పేర్కొన్న ఈ నివేదికలోని స్థానాల కంటే కూడా.. మరికొన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఇవి వాస్తవం కూడా. కానీ.. ఇలాంటి నియోజకవర్గాలు వెనుకబడ్డాయి. వాటి ప్రస్తావన కూడా అలానే ఉంది. మరి దీనికి కారణం ఏంటి? అనేది కూడా ఆసక్తిగానే ఉంది.
ఉదాహరణకు..
బాపట్ల నియోజకవర్గంలో గతంలో కంటే కూడా ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఈ విషయాన్ని ఇక్కడి ప్రజలే చెబుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రహదారుల నిర్మాణం.. తాగునీటి సౌకర్యం వంటివాటికి ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ ప్రాధాన్యం ఇస్తున్నారు. మండలాల వారీగా పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు వింటున్నారు. కానీ.. ఈ నియోజకవర్గం వెనుకబడి ఉంది. దీనికి కారణం వర్గపోరు.
గుడివాడ: గతంలో ఉన్న వివాదాలు.. పేకాట వంటి జూదాలు ఇప్పుడు లేవు.పైగా గతంలో క్యాసినో ఆటల కు కేటాయించిన స్థలంలో ఇప్పుడు క్రీడా మైదానం నిర్మించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజకవర్గంలో ఉంటే.. ఉదయం పూట గుడివాడ గుడ్ మార్నింగ్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. ప్రజలకు చేరువ అవుతున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కల్వర్టులు, మురుగు నీటి కాల్వల నిర్మాణ పనులు పరుగులు పెట్టిస్తున్నారు. కానీ, ఈయనను కూడా సొంతవర్గ పోరు కుదిపేస్తోంది.
గన్నవరం, పామర్రు, పెనమలూరు.. వంటి కీలక నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. కొందరు నేతలతో ఎమ్మెల్యేలు అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. దీంతో వారి కారణంగా.. పార్టీలో నెలకొన్న వివాదాలు.. విభేదాలు. నియోజకవర్గాలపై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో అవి ప్రగతి నివేదికలో అట్టుడుగుకు చేరాయి. ఈ నేపథ్యంలో సదరు ఎమ్మెల్యేలు తమ పనితీరును భేరీజు వేసుకున్నట్టు పార్టీలో అందరినీ కలుపుకొని పోయే విషయంలోనూ కలివిడిగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు.