ముగ్గురు పిల్లలు కనాలి...పెద్ద బాధ్యత పెట్టిన భగవత్

ఈ ప్రపంచంలో ఏకైక అతి పెద్ద హిందూ దేశం భారత్ అన్నది అందరికీ తెలిసిందే. ఈ దేశం దాటితే హిందువులు మైనారిటీలు అయిపోతారు.;

Update: 2026-02-18 12:30 GMT

ఈ ప్రపంచంలో ఏకైక అతి పెద్ద హిందూ దేశం భారత్ అన్నది అందరికీ తెలిసిందే. ఈ దేశం దాటితే హిందువులు మైనారిటీలు అయిపోతారు. మైనారిటీల విషయంలో పొరుగు దేశాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో అందరికీ తెలుసు. అయినా ఈ దేశంలో సకల మతాలను సమానంగా చూస్తూ ముందుకు సాగుతున్నారు అయితే భారత్ లో హిందువుల జనాభా నానాటికి తగ్గుతోంది అన్న చర్చ అంతటా జరుగుతోంది. అలా తగ్గితే ఏమి జరుగుతుంది అన్నది పెద్ద ప్రశ్న. అంతకంటే పెద్ద చర్చ కూడా. హిందువుల జనాభా తగ్గితే ఆ మీదట ఎన్నో విపరిణామాలు సంభవిస్తాయని హిందూ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రముఖంగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అయితే చాలా ఆందోళన చెందుతోంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా హిందూ జనాభా క్షీణత మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

సమాజ మనుగడకు ప్రమాదకరం :

హిందువుల జనాభా క్షీణిస్తే కనుక అది సమాజ మనుగడకు ప్రమాదకరమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని నిరాలా నగర్‌లో జరిగిన ఓ సామాజిక సామరస్య కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ కుటుంబాలకు ముగ్గురు పిల్లలు జనాభా క్షీణత సమాజ మనుగడకు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

ఘర్ వాపసీని ప్రొత్సహించాలి :

ఈ దేశంలో బలవంతపు మత మార్పిడులను అడ్డుకుని ఘర్ వాపసీని ప్రోత్సహించాలని కూడా భగవత్ సూచించారు అక్రమ చొరబాటుదారులను గుర్తించి దేశం నుంచి పంపేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అంతే కాదు భారతీయ సమాజంలో బేదాభిప్రాయాలు లేకుండా అంతా కలసి కట్టిగా ఉండాలని ఆయన కోరారు. ఐక్యత భారతీయ సమాజాన్ని ముందుకు తీసుకుని వెళ్తుందని ఆయన అన్నారు.

హిందూ సమాజం బలంగా :

ఇదిలా ఉంటే భగవత్ హిందువుల సమాజం గురించి కొన్ని కీలక సూచనలు చేశారు హిందూ సమజాంలో అంతా ఒక్కటిగా ఉండాలని అలాగే సంఘటితం కావాలని కోరారు. అపుడే బలంగా మారుతామని చెప్పారు. జనాభా ఎందుకు తగ్గుతుందో ఆలోచించి దానిని నియంత్రించేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతీ హిందువూ కనీసంగా ముగ్గురు పిల్లలను అయినా కనకపోతే ఇబ్బంది అవుతుందని అన్నారు. ఇది శాస్త్రవేత్తలు సైతం చెబుతున్న విషయం అన్నారు. భవిష్యత్తు తరాలు అంతరించిపోయే పరిస్థితి కూడా ఉంటుందని అన్నారు. ఒక కుటుంబంలో ముగ్గురు కంటే తక్కువ మంది పిల్లలు ఉంటే కనుక ఏ సమాజం అయినా వేగంగా అంతరిస్తుంది అని సైంటిస్టులు చెబుతున్న సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

హిందూ మతంలోకి స్వాగతం :

ఎవరైనా హిందూ మతంలోకి తిరిగి రావాలంటే వారిని స్వాగతం పలకాలని కోరారు. దాని కోసం ఘర్ వాపసీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని ఆయన సూచించారు హిందూ మతాన్ని ప్రేమించి తిరిగి రావాలనుకుంటున్న వారికి అంతా మద్దతు ఇవ్వాలని దిశా నిర్దేశం చేశారు. దేశంలో అక్రమ చొరబాట్లు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విషయంలో పాలకులు కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు అక్రమంగా దేశంలో ఉంటున్న వారిని గురించి వెంటనే దేశం నుంచి బయటకు పంపించాలని ఆయన డిమాండ్ చేశారు.

అనేక సవాళ్ళు :

హిందూ సమాజానికి అనేక సవాళ్ళు ఉన్నాయని వాటి నుంచి కాపాడుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భగవత్ చెప్పారు. అంతర్గత బాహ్య సవాళ్ల పట్ల ప్రతీ ఒక్క హిందువూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అంతే కాకుండా హిందూ సమాజం తన ప్రత్యేక గుర్తింపును కాపాడుకోవలాని అలాగే భవిష్యత్తును కూడా పరిరక్షించుకోవాలని అన్నారు. మొత్తం మీద భగవత్ చెబుతున్న వాటిలో హిందువులు ముగ్గురు పిల్లలను కనాలన్నది కీలక అంశం. దీని మీద ఆర్ఎస్ఎస్ ఏ విధంగా తన ప్రచారాన్ని ముందుకు తీసుకుని వెళ్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News