రైతుల ఆందోళనపై కెనడా జోక్యమా ? భారత్ తీవ్ర అభ్యంతరం

Update: 2020-12-01 15:30 GMT
నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా గడచిన ఆరు రోజులుగా ఢిల్లీ శివార్లలో రైతులు చేస్తున్న ఆందోళనలపై కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో జోక్యం చేసుకోవటంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భారత్ అంతర్గత వ్యవహారాల్లో కెనాడా ప్రధాని జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ మండిపడింది. రైతుల ఆందోళనలపై కెనాడా ప్రధాని మాట్లాడుతు భారత్ లో రైతుల ఆందోళనలపై సానుభూతి చూపారు. శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు రైతులకు ఎప్పుడూ ఉంటుందన్నారు.

శాంతియుత నిరసనలకు కెనాడ మద్దతుగా నిలుస్తుందని చెప్పటం ఆశ్చర్యమేసింది. సమస్యల పరిష్కారానికి సంప్రదింపులకు ప్రాధాన్యత ఉంటుందని కూడా జస్టిన్ చెప్పారు. అందుకే వివిధ మార్గాల ద్వారా భారత అధికారులను సంప్రదించినట్లు కూడా చెప్పారు. అందరం ఒక తాటిపైకి వచ్చి సమస్యను పరిష్కరించేందుకు అనువైన సమయం ఇదే అంటూ ప్రకటించటం కలకలం రేపింది.

నిజానికి రైతుల ఆందోళన పూర్తిగా దేశ అంతర్గత వ్యవహారమన్న విషయం తెలిసిందే. మరి ఈ విషయం తెలిసి కూడా కెనాడ ప్రధాన మంత్రి ఎలా జోక్యం చేసుకున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇదే విషయమై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతు భారత్ అంతర్గత వ్యవహారాల్లో కెనడా ప్రధాని జోక్యం చేసుకోవటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మనదేశ అంతర్గత వ్యవహారాలపై కెనడా జోక్యం చేసుకోవటం తగదన్నారు.

ఇదే విషయమై శివసేన నేత ప్రియాంక చతుర్వేది మాట్లాడుతు రైతుల ఆందోళన అన్నది పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారం అన్న విషయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ మరచిపోయినట్లున్నారంటూ ధ్వజమెత్తారు. భారత్ అంతర్గత వ్యవహారం ఇతర దేశాలకు మేతగా మారకూడదన్న విషయాన్ని కెనడా ప్రధాని గుర్తుంచుకోవాలన్నారు. కెనడా ప్రధాని లాగ ఇతర దేశాల నేతలు జోక్యం చేసుకోవటానికి ముందే ప్రధానమంత్రి నరేంద్రమోడి రైతుల సమస్యను పరిష్కరించాలని ప్రియాంక గట్టిగా చెప్పారు.
Tags:    

Similar News