పీవోకేపై పాక్ కు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన భారత్

Update: 2020-09-26 04:00 GMT
అంతర్జాతీయ వేదిక మీద కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి తన బుద్ధిని ప్రదర్శించే దాయాది మరోసారి అలాంటి పనే చేసింది. మారిన కాలానికి తగ్గట్లు తనను తాను మార్చుకోకుండా పాత వ్యూహాన్ని అమలు చేసే పాక్ కు మోడీ సర్కారు దిమ్మ తిరిగేలా షాకిచ్చింది. పాక్ ప్రధాని తన ప్రసంగంలో కశ్మీర్ సమస్యను లేవనెత్తారు. ఎప్పటిలానే కశ్మీర్ మీద పాక్ శాంతియుత పరిష్కారం కోరుకుంటుందని.. 2019 ఆగస్టు ఐదున భారత్ చేపట్టిన చర్యల్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

దీనిపై భారత్ తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. ఆయన మాటల్లోని డొల్లతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పటమే కాదు.. మళ్లీ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించేందుకే భయపడేలా షాకిచ్చింది. కరుడు గట్టిన అంతర్జాతీయ ఉగ్రవాదిని ‘అమరుడు’ అంటూ కీర్తించిన వైనాన్ని గుర్తు చేసిన భారత్.. మధ్యయుగంలోనే కూరుకుపోయిన ఒక దేశం.. శాంతి.. చర్చలు.. దౌత్యం లాంటి ఆధునిక నాగరిక సమాజ సిద్ధాంతాల్ని ఆర్థం చేసుకోలేని దూరంలో ఉందని ఫైర్ అయ్యారు.

అంతేకాదు.. పాక్ లో చోటు చేసుకున్న ఆరాచకాల చిట్టాను భారత్ వినిపించింది. దక్షిణాసియాలో తన సొంత ప్రజల్ని చంపి మారణహోమానికి పాల్పడిన దేశం.. ఇన్నేళ్ల తర్వాత కూడా తాను చేసిన ఘోరాలకు క్షమాఫనలు చెప్పలేదని.. ప్రభుత్వ నిధుల నుంచి ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలోని ఉగ్రవాదులకు పెన్షన్లు అందించే ఏకైక దేశంగా పేర్కొన్నారు.

ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాదులకు అత్యధిక సంఖ్యలో అతిధ్యం ఇవ్వటంలోనూ పాక్ ముందుందన్నారు. పాక్ ప్రధాని ప్రస్తావించిన కశ్మీర్ అంశంపై భారత్ స్పందిస్తూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్  పైనే వివాదం ఉందని.. ఆ ప్రాంతాన్ని పాక్ విడిచిపెట్టాలని.. వెనక్కి వెళ్లిపోవాలని ఘాటుగా రిప్లై ఇచ్చారు. పాక్ ప్రధాని రికార్డెడ్ సందేశాన్ని వినిపించే సమయంలో భారత ప్రతినిధి అక్కడ లేరు. తర్వాత విషయం తెలుసుకొని.. తన స్ట్రాంగ్ కౌంటర్ ను ప్రపంచ దేశాలకు వినిపించారు. ఇంతకాలం పీవోకే గురించి మాట్లాడే తీరుకు భిన్నంగా.. మోడీ సర్కారు తన వాదనను బలంగా వినిపించిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News