రివర్స్ మైగ్రేషన్.. దీని వెనుక అసలు కారణాలు ఏంటి?
తెలంగాణ ఐటీ మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల అమెరికా పర్యటనలో అక్కడి తెలుగు విద్యార్థులతో సంభాషించారు.;
కళ్ల నిండా కలలు.. చేతిలో డిగ్రీలు.. లక్షల్లో జీతం వస్తుందన్న ఆశతో ఏటా వేల సంఖ్యలో భారతీయ విద్యార్థులు అమెరికా బాట పడుతున్నారు. కానీ, ఇప్పుడు అక్కడ సీన్ రివర్స్ అవుతోంది. ఒకప్పుడు అవకాశాల గనిగా వెలిగిపోయిన అమెరికా జాబ్ మార్కెట్, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) ధాటికి తట్టుకోలేకపోతోంది. కొత్త ఉద్యోగం దొరకడం దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడమే గగనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వచ్చేయడమే మేలా..? వస్తే ఇక్కడ మనకు చోటుందా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రతి భారతీయ విద్యార్థిని వేధిస్తున్నాయి. ఇదే విషయంపై మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విద్యార్థుల ఆందోళన
తెలంగాణ ఐటీ మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల అమెరికా పర్యటనలో అక్కడి తెలుగు విద్యార్థులతో సంభాషించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఉన్న ఆందోళనను ఆయన ముందు ఉంచారు. అమెరికాలో ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారిన పరిస్థితుల్లో, తిరిగి భారతదేశానికి (ముఖ్యంగా హైదరాబాద్‌కు) వలస వచ్చేయవచ్చా? అని ప్రశ్నించారు. అలా వస్తే ఇక్కడ తగిన ఉద్యోగ మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయా? అని వారు కేటీఆర్‌ను అడిగారు.
విద్యార్థుల ప్రశ్నలకు కేటీఆర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. AI ప్రభావం, ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా నెలకొన్న ప్రస్తుత జాబ్ మార్కెట్ పరిస్థితిని చక్కదిద్దడం ఏ రాజకీయ నాయకుడికైనా అసాధ్యమని వ్యాఖ్యానించారు. అమెరికాలో కనీసం ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, వారి అకడమిక్ స్థాయి ఏంటి అనే అంచనా ఉంటుందని, కానీ భారతదేశంలో పరిస్థితి అలా కాదని పేర్కొన్నారు. ఇక్కడి ఉద్యోగ ఆశావహుల సంఖ్య అత్యధికంగా ఉందని, వారందరికీ ఒకేసారి వసతి కల్పించడం గమ్మత్తయిన వ్యవహారమని ఆయన స్పష్టం చేశారు.
మారుతున్న విదేశీ విద్యా ధోరణి
ఒకప్పుడు ఉన్నత చదువు కోసం, మంచి పని కోసం విదేశాలకు వెళ్లమని ప్రభుత్వాలే విద్యార్థులను ప్రోత్సహించేవని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ చక్రం విచ్ఛిన్నమైందని ఆయన చెప్పుకచ్చారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోయినా.., ఈ రోజుల్లో విద్యార్థులు సొంతంగా భారీ సంఖ్యలో విదేశాలకు వెళ్తున్నారని, ఇది ఒక సామాజిక దృగ్విషయంగా మారిందని పేర్కొన్నారు. విదేశీ చదువు పూర్తి చేసిన తర్వాత తిరిగి రావడం అనేది ప్రస్తుతానికి ఒక అస్థిరమైన ప్రశ్నగానే మిగిలిపోతుందని అన్నారు.
పోటీకి సిద్ధమవ్వాలి..
భారత్, ముఖ్యంగా హైదరాబాద్‌కు తిరిగి రావడం అనేది ఒక సవాలుతో కూడిన నిర్ణయం అంటూ కేటీఆర్ వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ ఉద్యోగ మార్కెట్ అత్యంత కఠినమైన స్థితిలో ఉంది.. తిరిగి రావాలనుకునే వారు సుదీర్ఘ కాలం నిరీక్షించడానికి, తీవ్రమైన పోటీని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఎటువంటి కట్టుకథలు చెప్పకుండా వాస్తవ పరిస్థితిని వివరించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
అమెరికా కల ఇప్పుడు క్రమంగా నీరుగారుతున్న తరుణంలో, రివర్స్ మైగ్రేషన్ అనేది ఒక అనివార్యమైన చర్చగా మారింది. స్వదేశం వైపు చూస్తున్న యువతకు భరోసా ఇచ్చేలా ఇక్కడ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కేటీఆర్ అన్నట్లుగా, ఇది కేవలం ఊహాగానాలతో పరిష్కారమయ్యేది కాదు, క్షేత్రస్థాయిలో బలమైన మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే సాధ్యమవుతుంది. అప్పటివరకు విద్యార్థులు తమ నైపుణ్యాలను నిరంతరం పెంచుకుంటూ ఉండటమే ఏకైక మార్గం.