ఈ నెల 16 నుంచి డిజిటల్ జనగణన.. మనమేం చేయాలి?

దేశంలో జనగణన ప్రక్రియ 16 ఏళ్ల అనంతం జరుగుతోంది. అంతేకాకుండా తొలిసారి డిజిటల్ విధానంలో జనాభా లెక్కలను సేకరిస్తుండటంతో ప్రభుత్వం రెండు దశలలో ఈ ప్రక్రియ ముగించాలని భావించింది.;

Update: 2026-04-07 11:29 GMT

దేశవ్యాప్తంగా చేపడుతున్న డిజిటల్ జనగణనలో తొలిదశను ఏపీలో ఈ నెల 16న ప్రారంభించనున్నారు. నెలాఖరు వరకు కొనసాగే ఈ ప్రక్రియలో ప్రజలు తమ వివరాలను సొంతంగా నమోదు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో చేపడుతున్న జనగణనలో ఏమాత్రం తప్పులు దొర్లకుండా ప్రభుత్వం జాగ్రత్తలు చేపడుతోంది. అయితే ఫస్ట్ టైం ఈ విధానం అమలు చేస్తుండటంతో ప్రజలలో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. దీంతో చాలా మందిలో గందరగోళం కనిపిస్తోందని ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయి. దీంతో ప్రజల సందేహాల నివృత్తి కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

దేశంలో జనగణన ప్రక్రియ 16 ఏళ్ల అనంతం జరుగుతోంది. అంతేకాకుండా తొలిసారి డిజిటల్ విధానంలో జనాభా లెక్కలను సేకరిస్తుండటంతో ప్రభుత్వం రెండు దశలలో ఈ ప్రక్రియ ముగించాలని భావించింది. ఈ నెల 1న నుంచి దేశంలో గృహ గణన (హౌస్ లిస్టింగ్) మొదలు పెట్టింది. ప్రతి రాష్ట్రంలో 15 రోజుల పాటు హౌస్ లిస్టింగ్ కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం దేశంలో 8 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుండగా, ఏపీలో ఈ నెల 16 నుంచి మొదలు కాబోతోంది. దీంతో 'డిజిటల్ మోడ్ - ది న్యూ వే ఫార్వర్డ్' నినాదంతో ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ ఈ ప్రక్రియకు సంబంధించి కీలక షెడ్యూల్‌ను విడుదల చేసింది.

డిజిటల్ గణనలో భాగంగా తొలిసారిగా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. అయితే సామాన్యులకు ఈ డిజిటల్ జనగణనపై కొన్ని సందేహాలు వ్యక్తమతున్నాయి. ప్రభుత్వం సూచించిన విధంగా సొంతంగా వివరాలను నమోదు చేసుకున్న తర్వాత ఎన్యుమరేటర్లకు మళ్లీ వివరాలు చెప్పాలా? లేక అవసరం లేదా? అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

గతంలో జనాభా లెక్కల సమయంలో ఎన్యుమరేటర్లు పేజీల కొద్ది సమాచారం నింపేవారు. దీనికి ఎక్కువ సమయం పట్టడంతోపాటు తప్పులు దొర్లేవి. సమగ్ర సమాచారం సేకరించడం కష్టంగా ఉండేదని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు ప్రస్తుతం డిజిటల్ గణన తోడ్పడుతోందని అధికారులు వివరిస్తున్నారు. గతంలో కాగితాలతో సాగిన ఈ ప్రక్రియ ఇప్పుడు డిజిటల్‌గా మారడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ప్రధానంగా తప్పులు లేకుండా వివరాలు సేకరించడంతోపాటు సమయం ఆదా అవుతుందని అంటున్నారు. అదేవిధంగా ఆధార్, మొబైల్ నంబర్ అనుసంధానం వల్ల ఒకే వ్యక్తి రెండుసార్లు నమోదయ్యే అవకాశం ఉండదని చెబుతున్నారు.

ప్రజలు తమ మొబైల్ నంబర్ ఉపయోగించి తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చు. ఇందుకోసం రూపొందించిన వెబ్ సైటులో 16 భాషలను అందుబాటులో ఉంచారు. ప్రజలు తమ మాతృభాషలోనే వివరాలు సమర్పించవచ్చు. ఈ డేటా పొందుపరిచిన తర్వాత ఒక రిఫరెన్స్ నంబర్ ను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ నెంబరును జనాభా గణన కోసం ఇంటికి వచ్చే అధికారికి తప్పనిసరిగా చెప్పాలని ప్రభుత్వం సూచిస్తోంది. దీనివల్ల మీ వ్యక్తిగత డేటాకు ఎలాంటి ముప్పు ఉండదనే భరోసా కూడా ఇస్తున్నారు.

Tags:    

Similar News