చైనాతో పంచాయితీ ఎందుకు మొద‌లైంది

Update: 2017-07-06 11:13 GMT
స‌రిహ‌ద్దు వివాదాలు చైనాకు కొత్తేం కాదు. ఆ దేశానికి స‌రిహ‌ద్దుగా ఎవ‌రున్నా స‌రే.. ఆ దేశంతో లొల్లి మామూలే. తాజాగా భార‌త్ - చైనాల మధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. ఇంత‌కాలం చైనా తొంద‌ర‌ప‌డినా సంయ‌మ‌నం పేరుతో వెన‌క్కి త‌గ్గి ఉండే వైఖ‌రిని భార‌త్ ప్ర‌ద‌ర్శించేది. అంత‌కు మించి బ‌లంగా త‌న వాద‌న‌ను వినిపించేది కాదు. చైనా దూకుడుకు భార‌త్ కాస్తంత ఆచితూచి అడుగులు వేసేద‌న్న ముద్ర కూడా ప‌డింది. ఇదిలా ఉంటే.. సిక్కిం స‌రిహ‌ద్దుల్లో భూటాన్ దేశ స‌రిహ‌ద్దును చైనా ఆక్ర‌మించుకునే య‌త్నాన్ని భార‌త్ అడ్డుకోవ‌టం డ్రాగ‌న్‌ కు ఒక ప‌ట్టాన మింగుడుప‌డ‌టం లేదు. భూటాన్ దేశ స‌రిహ‌ద్దుల్లోకి చొచ్చుకురావ‌టం.. భ‌విష్య‌త్తులో భార‌త్ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేదే. ఈ కార‌ణంతోనే భార‌త్ చొర‌వ తీసుకొని భూటాన్‌ కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా మారింది.

దీన్ని చైనా భ‌రించ‌లేక‌పోతోంది. త‌న ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేలా భార‌త్ నిర్ణ‌యం తీసుకోవ‌టంతో.. విష ప్ర‌చారాన్ని మొద‌లెట్టింది. మీరు మాకంటే చాలా వెనుక‌బ‌డి ఉన్నారు.. బ‌ల‌హీనుల‌న్న అర్థం వ‌చ్చేలా మాట్లాడుతూ రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. చైనా తొండి వైఖ‌రికి భార‌త్ మాట‌ల‌తోనే గ‌ట్టి స‌మాధానం ఇవ్వ‌టం కొత్త ప‌రిణామంగా చెప్పాలి. దీన్ని చైనా అంచ‌నా క‌ట్ట‌లేదా? అన్న సందేహం క‌లుగుతోంది. ఎందుకంటే.. భార‌త్ ధీటుగా స‌మాధానం ఇవ్వ‌టంపై చైనా ఉక్కిరిబిక్కిరి అవుతోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. భార‌త్ - చైనాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల ద‌శ నుంచి మాట‌ల యుద్ధం వ‌ర‌కూ ప‌రిస్థితి వ‌చ్చిన నేప‌థ్యంలో.. ఈ రెండు దేశాల మ‌ధ్య యుద్ధ‌మే త‌లెత్తితే ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఒక పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఇలాంటి ప‌రిస్థితిని ప్ర‌స్తావిస్తున్న చైనా.. 1962 నాటి ప‌రిస్థితే వ‌స్తే భార‌త్ తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌ని హెచ్చరిస్తోంది. చైనా మాట‌లు విన్న‌ప్పుడు అస‌లు 1962లో ఏం జ‌రిగింది? భార‌త్‌ కు ఎంత న‌ష్టం వాటిల్లింద‌న్న  విష‌యంలోకి వెళితే.. ముందు రెండు దేశాల మ‌ధ్య ఉన్న స‌రిహ‌ద్దుల లెక్క చూడాల్సి ఉంటుంది.

జ‌మ్మూకాశ్మీర్ తో ప్రారంభ‌మ‌య్యే భార‌త్ - చైనా స‌రిహ‌ద్దులు మ‌ధ్య‌లో నేపాల్‌.. భూటాన్ దేశాల్ని వ‌దిలేస్తే.. సిక్కిం.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ తో ముగుస్తుంది. ఈ రెండు దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దు పొడ‌వు దాదాపుగా 3488 కిలోమీట‌ర్లు. సిక్కిం సెక్టార్ లో ఈ స‌రిహ‌ద్దు 220 కిలోమీట‌ర్లు. 1962లో భార‌త్‌.. చైనాల మ‌ధ్య వివాదాస్ప‌ద ప్రాంతాలు అక్సాయ్ చిన్ (కాశ్మీర్‌).. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ (మెక్ మోహ‌న్ రేఖ) రెండు చోట్లా యుద్ధం జ‌రిగింది. 1962 అక్టోబరు 20న ఈ రెండు ప్రాంతాల్లో మొద‌లైన యుద్ధం న‌వంబ‌రు 21 వ‌ర‌కూ సాగింది. భార‌త్ ఓట‌మితో అక్సాయ్ చిన్ చైనా వ‌శ‌మైంది.  తాజా వివాదం చూస్తే.. నిజానికి భూటాన్ - చైనా మ‌ధ్య‌న అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎందుకంటే.. భూటాన్ ను అనుకొని ఉన్న డోకా లా పీఠ‌భూమిలో చైనా రోడ్డు నిర్మాణం పూర్తి అయితే భార‌త్‌ కు స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. భార‌త ప్ర‌ధాన భూభాగాన్ని క‌లిపే 8 ఈశాన్య రాష్ట్రాల‌తో క‌లిపే సిలిగురి కారిడార్‌.. మ‌రో మాట‌గా చెప్పాలంటే చికెన్ నెక్ ప్యూచ‌ర్ లో చైనా దాడుల‌కు ల‌క్ష్యంగా మారే ప్ర‌మాదం ఉంది.  భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ట్యా భారత్‌కు ఇప్పుడు సంబంధం లేకున్నా భూటాన్ మ‌ద్దుతుగా రంగంలోకి దిగింది.

డోకా లా వివాదంపై భూటాన్ - చైనాల మ‌ధ్య 16 సార్లు చ‌ర్చ‌లు జ‌రిగినా ఫ‌లితం లేక‌పోయింది. భార‌త సాయాన్ని చిన్న రాజ్య‌మైన భూటాన్ తీసుకోవ‌టాన్ని చైనా భ‌రించ‌లేక‌పోతోంది. ఎందుకంటే.. గ‌తంలోనే భార‌త్‌ కు అనుకొని ఉండే నేపాల్‌ ను ఇదే రీతిలో బెదిరించి.. ఒత్తిడి తీసుకొచ్చి త‌న‌వైపున‌కు తిప్పుకున్న చైనా.. అదే వ్యూహాన్ని భూటాన్ విష‌యంలోనూ అమ‌లు చేస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో చైనా.. భార‌త్ మ‌ధ్య యుద్ధ‌మే త‌లెత్తితే సిక్కిం వ‌ర‌కే ప‌రిమితం అవుతుందా? లేక‌.. మిగిలిన స‌రిహ‌ద్దు ప్రాంతాలకు విస్త‌రిస్తుందా? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News