కర్నాటకం...మలుపుల రాజకీయం..

Update: 2018-12-26 16:32 GMT
కర్నాటక. దేశ రాజకీయాల్లో అందరి నోటా నానుతున్న రాష్ట్రం. ఏడాదిన్నర క్రితం కర్నాటకలో శాసనసభకు ఎన్నికలు జరిగినప్పటి నుంచి నేటి వరకూ రోజరోజుకు రసవత్తరంగా ఉంది. అనేక మలుపులు... అనేక మార్పులు... అనేకానేక ప్రకటనలు... ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠల మధ్య కన్నడ సినిమాని తలపిస్తోంది. దీనికి కారణం అధికారంలో ఉన్న కాంగ్రెస్ - జేడీెఎస్ కూటమికి రోజుకో షాక్. అది కాంగ్రెస్ నుంచి వస్తుందా...భారతీయ జనతా పార్టీ నుంచి వస్తుందా... లేకపోతే తమ సొంత పార్టీ నుంచే వస్తోందో తెలియక కుమారస్వామి ప్రభుత్వం కుప్పిగంతులేస్తోంది. ఇప్పుడు మళ్లీ మరో కొత్త ట్విస్ట్.  ఈ సారి ఈ ట్విస్ట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు - మాజీ మంత్రి ఉమేష్ కట్టి. ఇంతకీ ఆయన ఇచ్చిన ట్విస్ట్ ఏమిటనుకుంటున్నారా... ఏం లేదు... మరో 24 గంటల్లో  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కుమారస్వామి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు.అది కూడా కర్నాటక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు - మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి వెళ్తున్న సందర్భంగా చెప్పడం మరింత సంచలనం అయ్యింది.

మరోవైపు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు యడ్యూరప్ప మాత్రం తమకు ప్రభుత్వాన్ని కూల్చడం ఇష్టం లేదని, తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని ప్రకటించడం విశేషం. మరోవైపు కర్నాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఈ విస్తరణలో భాగంగా మాజీ హోం మంత్రి రామలింగారెడ్డి పదవి ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన రాజ్ భవన్ ముందు నిరసనకు సైతం దిగారు. ఇన్ని మలుపులు - రాజకీయ కల్లోలాల మధ్య భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు ఉమేష్ కట్టి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. మరోవైపు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా స్పందించింది. దమ్ముంటే తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాలంటూ భారతీయ జనతా పార్టీకి సవాల్ విసిరింది. దీనిపై కర్నాటక పిసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు కర్నాటకలో తమ ప్రభుత్వాన్ని కూల్చాలని - లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు ఉమేష్ కట్టి తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. మొత్తానికి కర్నాటక రాజకీయం రోజుకో మలుపుతిరుగుతూ కొత్తగా కొత్తగా మారుతోంది.
   

Tags:    

Similar News