4వేల కోట్ల స్కాం సూత్రధారి అరెస్ట్.. వీఐపీల్లో వణుకు

Update: 2019-07-19 11:02 GMT
కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఐఎంఏ స్కాం కేసు నిందితుడు దొరికాడు. రూ.4వేల కోట్ల స్కాం చేసి విదేశాలకు చెక్కేసిన ఐఎంఏ జ్యువెల్లర్స్ వ్యవస్థాపకుడు , ప్రముఖ వ్యాపారవేత్త మన్సూర్ ఆలీ ఖాన్ ఎట్టకేలకు చిక్కాడు. శుక్రవారం వేకువజామున ఢిల్లీలో అరెస్ట్ చేశారు. మన్సూర్ ను ఈడీ, ప్రత్యేకబృందం అధికారులు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

మన్సూర్ ఖాన్  బెంగళూరు నగరంతోపాటు అనేక రాష్ట్రాలు, దేశవిదేశాల్లో వేలాది మందిని మోసం చేశారన్న ఆరోపణలున్నాయి. గొలుసుకట్టు వ్యాపారాలతో ప్రజల దగ్గర నుంచి దాదాపు 4వేల కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఈయనపై దేశవ్యాప్తంగా 60వేల కేసులు నమోదయ్యాయి. వెంటనే మన్సూర్ ఖాన్ దుబాయ్ కి చాకచక్యంగా పారిపోయాడు. గుర్తించిన ఈడీ, ఎస్ఐటీ అధికారులు బ్లూకార్నర్ నోటీసులు జారీ చేశారు. అయితే తనతోపాటు తీసుకెళ్లిన డబ్బు అయిపోవడంతోపాటు జబ్బు పడడంతో మన్సూర్ ఖాన్ ఇండియాకు బయలు దేరారు.

మన్సూర్ ఇండియాకు వస్తున్నాడన్న సమాచారంతో ఈడీ, ప్రత్యేక అధికారుల బృందం వలపన్ని మన్సూర్ ను ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. గురువారం రావాల్సిన మన్సూర్ ఒకరోజు ఆలస్యంగా వచ్చాడు. మన్సూర్ ఖాన్ దుబాయ్ నుంచి విడుదల చేసిన వీడియోలో అనేక మంది ప్రముఖులకు అనేక కోట్ల లంచంగా ఇచ్చానని ఆరోపించాడు. మాజీ మంత్రి, బెంగళూరులోని శివాజీనగర్ ఎమ్మెల్యే రోషన్ బేగ్, బెంగళూరు జిల్లాధికారితో సహా అనేక మంది పేర్లు చెప్పాడు. ఇప్పటికే బెంగళూరు జిల్లాధికారిని అరెస్ట్ చేసి ఎమ్మెల్యే రోషన్ బేగ్ ను విచారిస్తున్నారు. ఈయన ఇచ్చిన లంచాలు తీసుకున్న వారిలో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులున్నారు. ఇప్పుడు విచారిస్తే అందరి జాతకాలు బయటకు వస్తాయి.  దీంతో దేశవ్యాప్తంగా ఎవరెవరు బయటపడుతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

    
    
    

Tags:    

Similar News