నా భార్యను నేనే చంపేశా .. డయల్ 100కు భర్త ఫోన్ .. దేనికైనా సిద్ధమే, అసలేమైందంటే ?

Update: 2021-02-16 10:37 GMT
అనుమానం అనేది పెనుభూతం లాంటిది. అదే అనుమానం తాజాగా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కడదాకా కలసి ఉంటానని బాస చేసి అర్ధంతరంగా భార్యను కడతేర్చాడు ఓ భర్త. తానే డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. నేను నా భార్యను చంపేశా.

ఆమె చనిపోయింది. నేను కూడా చావడానికి సిద్ధం. త్వరగా వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి. ఇక్కడే ఉంటా. ఎక్కడికీ వెళ్లను. అడ్రస్ చెబుతున్నా రాసుకోండి అంటూ అతడు బాంబుపేల్చాడు. తాను ఎక్కడ ఉన్నది ఆనవాళ్లతోసహా చెప్పాడు. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండకు చెందిన కొండబత్తుల నరేష్ కు మొదటి భార్యతో విడాకులు అయ్యాయి. దీంతో 12 ఏళ్ల క్రితం చిననగూడూరు మండలం జయ్యారానికి చెందిన సరితతో 12 ఏళ్ల క్రితమే పెళ్లయింది. ఈ దంపతులకు 10 ఏళ్ల సిరివెన్నెల, ఆరేళ్ల మేఘన అనే కూతుళ్లు ఉన్నారు. నరేష్ డీసీఎం వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు.

అయితే కొద్ది నెలలుగా భార్యపై నరేష్ అనుమానం పెంచుకున్నాడు. ఎవరితోనో వివాహేతర సంబంధం నడుపుతున్నావంటూ గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం సరితతో గొడవ పడ్డాడు. ఈ గొడవలో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో సరిత పిల్లలతో సహా తన పుట్టింటికి జయ్యారం  వెళ్లిపోయింది.

ఈ క్రమంలో సోమవారం జయ్యారం వెళ్లిన నరేశ్‌ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తానని నమ్మబలికి చిన్నకూతురు మేఘనను వెంట తీసుకుని మహబూబాబాద్‌ కు వచ్చాడు. అక్కడి నుండి మోటార్ ‌సైకిల్ ‌పై బయ్యారం మండలం నామాలపాడు అటవీప్రాంతానికి తీసుకొచ్చాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో సరితను పొడిచి, ఆ తర్వాత గొంతునుమిలి హత్యచేశాడు.

ఆమె మృతి చెందిందని ధ్రువీకరించుకున్నాక తన సెల్‌ ఫోన్‌ నుంచే డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. గార్ల–బయ్యారం సీఐ తిరుపతి, ఎస్‌ ఐ జగదీశ్‌ ఘటనాస్థలానికి చేరుకుని నరేశ్‌ ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News