తిరుగులేని రారాజు చికెన్ బిర్యానీ.. స్విగ్గీ నివేదిక లో ఇలాంటివి బోలెడన్ని

Update: 2021-12-22 03:28 GMT
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. తన వార్షిక నివేదిక విడుదల చేసింది. అయితే.. ఇందులో వినియోగదారుల అభిరుచులు.. ఎలాంటి ఫుడ్ కు ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దేన్ని అమితంగా ఇష్టపడుతున్నారన్న అంశంతో పాటు.. దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న రుచుల తేడాలతో పాటు.. ఏ రోజున ఏ ఫుడ్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు? ఎన్ని రోజుల వ్యవధిలో ఎక్కువ మంది ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు? లాంటి ఎన్నో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. స్విగ్గీ స్టాటిస్టిక్ 2021 పేరుతో విడుదలైన ఈ నివేదికలో.. ఈ ఏడాది తమకు వచ్చిన ఆర్డర్ల ఆధారంగా ఈ రిపోర్టును సిద్ధం చేశారు.

ఇటీవల కాలంలో ఆహారాన్ని తీసుకునే విషయంలో వచ్చిన మార్పుల గురించి ప్రస్తావిస్తూ.. పిండి పదార్థాల్ని తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే కీటో డైట్ ఆర్డర్లు 23 శాతం పెరిగినట్లుగా గుర్తించారు. మొక్కల నుంచి వచ్చే ఆహారం.. వేగాన్ రుచులు 83 శాతం పెరిగాయి.

దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడుతున్న పుడ్.. హైదరాబాదీ బిర్యానీగా తేలింది. వరుసగా ఆరో ఏడాది చికెన్ బిర్యానీనే అగ్రసనం దక్కింది. బిర్యానీ ఆర్డర్లు గత ఏడాది నిమిషానికి 80 ఉంటే.. ఈ ఏడాది అవికాస్తా 115కు పెరిగినట్లుగా చెప్పారు. అంతేకాదు.. వెజ్ బిర్యానీతో పోలిస్తే చికెన్ బిర్యానీకే 4.3 రెట్ల ఎక్కువ ఆర్డర్లు ఉంటాయని తేల్చారు.

హైదరాబాదీయుల విషయానికి వస్తే.. చికెన్ బిర్యానీ మొదటి స్థానంలో నిలిస్తే.. రెండో స్థానంలో చికెన్ 65.. మూడో స్థానంలో పనీర్ బటర్ మసాలా.. నాలుగో స్థానంలో మసాలా దోశలు నిలిచాయి. ఇడ్లీలు కూడా ఎక్కువగానే ఆర్డర్ చేశారు. చిరుతిండ్ల విషయానికి వస్తే.. ఎక్కువమంది ఓటు సమోసాగా తేల్చారు.

దీని తర్వాత ఓటు పావ్ బాజీగా నిలిచింది. స్వీట్ల విషయానికి వస్తే.. ఎక్కువ మంది గులాబ్ జామ్.. రెండో స్థానంలో రస్ మలైయ్ లు నిలిచాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే వారంలో సోమ.. గురువారాల్లో మాత్రం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటానికి ఇష్టపడుతున్న విషయాన్ని గుర్తించారు.


Tags:    

Similar News