నడుచుకుంటూ వెళుతుంటే.. అంత పెద్ద బిల్డింగ్ కుప్పకూలింది.. ఆమెకు ఏమీ కాలేదు

Update: 2020-10-15 04:45 GMT
సుడి అంటే ఎలా ఉంటుందో చూపించిందో సీసీ కెమేరా పుటేజ్. 2020లో కూడా లక్ అనేది ఉందా? మానవాళి మీద పగబట్టినట్లుగా సాగుతుున్న 2020ను ఎవరూ మర్చిపోలేరు. ఏడాది ఏదైనా.. అందరి జీవితాల్లో అంతో ఇంతో తీపిగురుతుల్ని ఇచ్చిపోతుంది. అందుకు భిన్నంగా ఈ ఏడాది మాత్రం ప్రపంచ ప్రజలందరికి కరోనా షాక్ తో పాటు.. పలు షాకుల్ని ఇస్తున్న ఈ ఏడాది ఎంత త్వరగా వెళ్లిపోతే అంత బాగుండన్న మాట ఇటీవల కాలంలో ఎక్కువైపోతుంది. ఇలాంటి కాలంలో లక్ ఉంటే ఎలా ఉంటుందో.. కళ్లకు కట్టినట్లుగా కనిపించే ఈ వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది.

హైదరాబాద్ పాతబస్తీ ప్రాంత పరిధిలోని శాలిబండలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. వర్షం కారణంగా ఒక్క బుధవారమే దగ్గర దగ్గర 30 మంది చనిపోతే.. పెద్ద ఎత్తున గల్లంతు అయినట్లుగా ప్రచారం సాగుతోంది. రోడ్డు మీదకు వచ్చిన వారు ఇంటికి క్షేమంగా వెళతారా? అన్న సందేహం కలిగే పరిస్థితి. తాజాగా ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో.. ఇళ్ల నుంచి అవసరమైతే తప్పించి బయటకు రావొద్దంటూ అధికారులు సైతం సూచిస్తున్నారు. ఇలాంటి వేళ ఒక ముస్లిం మహిళ ఏదో పని మీదకు బయటకు వచ్చారు.

తన దారిన తాను వెళుతున్నారు. రోడ్డు అంచున వడివడిగా వెళుతున్న ఆమెకు గుండె ఆగిపోయేలా.. పే..ద్ద బిల్డింగ్ ఒకటి పేకమేడలా కుప్పకూలింది. హఠాత్తుగా చోటు చేసుకున్న పరిణామంతో ఆమె ఒక్కసారి పరిగెత్తారు. అంత పెద్ద భవనం అంతలా కూలినా.. ఆమెకు మాత్రం ఇసుమంత గాయం కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఆమెకు మించి సుడి ఉన్నోళ్లు ఇంకెవరూ ఉండరంటూ సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ లలోనూ భారీగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కూలిన ఇంటి విషయానికి వస్తే.. బాగా పాతబడిపోవటంతో రెండేళ్ల క్రితం ఆ ఇంటిని ఖాళీ చేసేశారు. గడిచిన కొద్దిరోజులుగా భారీ వర్షాలు అదేపనిగా పడుతున్న వేళ.. బలహీనంగా గోడలు.. నీటి చెమ్మకు ఒక్కసారిగా కూలిపోయింది. ఎలాంటి సంకేతాలు లేకుండా.. హటాత్తుగా చోటు చేసుకున్న ఈ పరిణామం అక్కడి సీసీ కెమేరాలో నమోదైంది. ఈ దశాబ్దిలోనే గ్రేట్ ఎస్కేప్ గా కొందరు అభివర్ణిస్తున్నారు. ఈ వీడియోను చూస్తే మాత్రం.. నిజమే అనిపించకమానదు.
Tags:    

Similar News