జయరాం హత్య కేసు.. శిఖా కేంద్రంగా ఎంక్వైరీ

Update: 2019-02-12 12:49 GMT
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జయరాం హత్య కేసును రెండు రాష్ట్రాల పోలీసులు ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. పారిశ్రామిక వేత్త జయరాంను రాకేష్‌ రెడ్డి హత్య చేశాడని ఏపీ పోలీసులు ఇప్పటికే ఒక నిర్థారణకు వచ్చారు. నందిగామ పోలీసుల ఆధీనంలో ఉన్న రాకేష్‌ రెడ్డిని తెలంగాణ పోలీసులు విచారణ నిమిత్తం హైదరాబాద్‌ కు అక్కడి కోర్టు అనుమతితో తీసుకు వచ్చారు. తెలంగాణ పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక నజర్‌ పెట్టినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌ నుండి నందిగామ వరకు జయరాం ఎలా ప్రయాణించారు, ఈ కేసులో శిఖా పాత్ర ఏంటీ అనే విషయమై ఎంక్వైరీ  చేస్తున్నారు.

జూబ్లీహిల్స్‌ లోని జయరాం ఇంటి నుండి బయటకు వెళ్లిన తర్వాత ఏం జరిగింది అనే విషయమై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంటి నుండి బయటకు వెళ్లినప్పటి నుండి నందిగామలో మృతదేహం లభ్యం అయినప్పటి వరకు 31 గంటల సమయంలో ఏం జరిగింది అనేది పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో రాకేష్‌ రెడ్డి ఎక్కడ ఉన్నాడు, శిఖ ఎవరితో మాట్లాడింది, ఎవరిని కలిసింది అసలు ఈ కేసులో శిఖాకు ఉన్న సంబంధం ఏంటీ అనే విషయాల గురించి పోలీసులు తెలుసుకునేందుకు రాకేష్‌ మరియు శిఖాను ఒక్క చోటుకు తీసుకు రాబోతున్నారు.

రాకేష్‌ రెడ్డిని కోర్టు ముందు ప్రవేశ పెట్టడంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. వారం రోజుల పాటు పోలీసుల కస్టడీకి ఇచ్చేందుకు సైతం కోర్టు ఒప్పుకుంది. దాంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే విచారణకు అందుబాటులో ఉండాలంటూ శిఖాను పోలీసులు ఆదేశించారు. రాకేశ్ మరియు శిఖా ను ఒక్క చోటుకు తీసుకు వచ్చి ప్రశ్నించనున్నారు. శిఖా కేంద్రంగా విచారణ జరుగబోతుంది. జయరాం భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు ఈ కేసును సీరియస్‌ గా తీసుకున్నారు. ఉన్నత స్థాయి అధికారులు సైతం ఈ కేసు విషయంలో ఇన్వాల్వ్‌ అయ్యి మరీ విచారణ చేపడుతున్నారు. త్వరలోనే ఈ కేసులోని పూర్తి వివరాలను తెలంగాణ పోలీసులు ఛేదిస్తారనిపిస్తుంది.
Tags:    

Similar News