గ‌ర్భిణి దారుణ హ‌త్య చిక్కుముడి వీడింది

Update: 2018-02-12 08:16 GMT
విన్నంత‌నే వ‌ణుకు పుట్టించట‌మే కాదు.. నిత్యం ఎన్నో నేరాల్ని చూసే పోలీసుల‌కు షాకింగ్ గా మారిన హ‌త్యోదంతం ఈ మ‌ధ్య‌న వెలుగు చూడ‌టం తెలిసిందే. ఎనిమిది నెల‌ల గ‌ర్భిణిని ముక్క‌లుముక్క‌లుగా న‌రికి.. సంచుల్లో కూరి.. రోడ్డు మీద ప‌డేసిన వైనం సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. తెలంగాణ పోలీసుశాఖకు స‌వాలుగా మారిన సంగ‌తి తెలిసిందే.

జ‌న‌వ‌రి 29న తెల్ల‌వారుజామున వెలుగు చూసిన ఈ హ‌త్య రేపిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఈ హ‌త్య పాశ‌వికంగా జ‌ర‌గ‌ట‌మే. పోస్ట్ మార్ట‌మ్ వైద్యులు చెప్పిన దాని ప్ర‌కారం.. హ‌తురాలి శ‌రీరంలో ప్ర‌తి ఎముక విరిగిపోవ‌ట‌మే కాదు.. ఆమె గ‌ర్భంలోని గ‌ర్భ‌స్త శిశువు ఎముక‌ల‌న్నీ విరిగిపోయిన‌ట్లు గుర్తించారు. చంపటానికి ముందు దారుణంగా హింసించిన‌ట్లుగా గుర్తించారు.

ఇంత దారుణంగా హ‌త్య చేసిన వారు ఎవ‌రు? ఎందుకు చేశారు?  లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల కోసం పోలీసులు చేసిన ప్ర‌య‌త్నాలు అన్నిఇన్ని కావు. పెద్ద ఎత్తున విచార‌ణ బృందాల్ని దించినా.. చిన్న‌పాటి క్లూ కూడా దొరక్క‌పోవ‌టం పోలీసు శాఖ ఈ హ‌త్య‌ను స‌వాలుగా తీసుకుంది. దారుణ హ‌త్య‌కు సంబంధించి వివ‌రాలు చెప్పిన వారికి రూ.ల‌క్ష న‌జ‌రానా ఇస్తామంటూ పోలీస్ శాఖ ప్ర‌క‌టించింది. హ‌త్య‌కు గురైన మ‌హిళ ఊహాచిత్రాన్ని విడుద‌ల చేయ‌టం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ..  ఈ కేసుకు సంబంధించి చిన్న క్లూ కూడా దొర‌క‌లేదు. ఇలాంటి వేళ‌.. అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది.

వారాలు త‌ర‌బ‌డి ఈ హ‌త్య‌కు సంబంధించిన నిందితుల ఆచూకీ కోసం వివిధ కోణాల్లో ప‌రిశీలించిన పోలీసులు సీసీ కెమెరాల్లో న‌మోదైన దృశ్యాల్ని విశ్లేషించ‌టం మొద‌లెట్టారు. ఇందులో భాగంగా ఒక బైక్ మీద సంచి ప‌ట్టుకొని వెళుతున్న వైనాన్ని గుర్తించి..ఆ కోణంలో విచారించసాగారు. చివ‌ర‌కు హ‌తురాలు ఎవ‌ర‌న్న విష‌యంతో పాటు.. హ‌త్య‌కు కార‌ణ‌మైన వారిని పోలీసులు గుర్తించారు.

తాజాగా హ‌త్య‌కు సంబంధించి.. కీల‌క నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు అందుబాటులోకి వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం హ‌త్య‌కు గురైన మ‌హిళ అత్త‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక‌.. భ‌ర్త‌.. మ‌రిది కోసం గాలిస్తున్నారు. పోలీసు వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం బిహార్‌కు చెందిన అమ‌ర్ కాంత్ ఝూ కుటుంబం గ‌డిచిన కొంత‌కాలంగా మాదాపూర్ లోని సిద్దిఖిన‌గ‌ర్‌లో నివాసం ఉంటోంది. అమ‌ర్ కాంత్ స్థానికంగా ఒక బార్ లో ప‌ని చేస్తున్నాడు. కుటుంబంలోని విభేదాల కార‌ణంగా కొన్ని రోజులుగా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే పెద్ద కోడ‌ల్ని దారుణంగా హ‌త‌మార్చిన‌ట్లుగా గుర్తించారు. గుర్తు ప‌ట్ట‌టానికి వీల్లేకుండా ఉండేందుకు ముఖాన్ని ఛిద్రం చేయ‌టంతో పాటు.. శ‌రీర భాగాల్నిముక్క‌లు ముక్కలుగా న‌రికేశారు. అనంత‌రం ప్లాస్టిక్ సంచుల్లో కూరి తెల్ల‌వారుజామున మూడున్న‌ర గంట‌ల ప్రాంతంలో కొండాపూర్ బొటానిక‌ల్ గార్డెన్ వ‌ద్ద ప‌డేశారు.

సీసీ కెమేరా ఫుటేజ్ ఆధారంగా టూవీల‌ర్ మీద ఒక పెద్ద మూట‌ను వెంట పెట్టుకొని వ‌చ్చి.. రోడ్డు మీద ప‌డేసిన వైనాన్ని గుర్తించి.. ఆ దిశ‌గా విచార‌ణ జ‌ర‌ప‌గా.. కీల‌క ఆధారం దొరికిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం బాధితురాలి అత్త‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హ‌త్య‌కు కార‌ణ‌మైన వారి కోసం గుట్టుగా విచారిస్తున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ అమానుష హ‌త్య ఎందుకు జ‌రిగింది?  ఎలా చేశార‌న్న విష‌యంపై అన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు వచ్చేస్తాయ‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News