మెర్సర్ రిపోర్ట్; దేశంలో హైదరాబాద్ దిబెస్ట్

Update: 2016-02-24 04:45 GMT
హైదరాబాద్ మహానగర ఖ్యాతీ మరోసారి వెల్లడైంది. దేశంలో పలు మెట్రో నగరాలు ఉన్నప్పటికీ.. నివాసయోగ్యమైన నగరంతో పాటు.. మరిన్ని సుగుణాలున్న సిటీగా హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అత్యత్తుమ నివాసయోగ్యమైన నగరాలు.. ఆయా దేశాల్లో ది బెస్ట్ సిటీలకు సంబంధించి మెర్సర్ సంస్థ ఒక నివేదిక రూపొందించింది. మెర్సర్ నివేదికకు అంత ప్రాధాన్యత ఏమిటంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు బహుళ జాతి సంస్థలు.. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తమ ఆఫీసుల్ని ఏర్పాటు చేసుకోవటం.. తమ సిబ్బందికి జీతాలు నిర్ణయించటం లాంటి కీలకాంశాలకు ప్రాతిపదికగా తీసుకుంటాయి.

అలాంటి సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో దేశంలో ఉన్న మెట్రో నగరాల కంటే కూడా హైదరాబాద్ ది బెస్ట్ అని తేలిపోయింది. ఇంతకీ మెర్సర్ సంస్థ తన నివేదికను ఎలా రూపొందిస్తుందన్న విషయాన్ని చూస్తే.. దాని వెనుక భారీ కసరత్తే ఉంటుంది. ఆర్థిక.. సామాజిక.. రాజకీయ.. వైద్యం.. ఆరోగ్యం.. జీవన ప్రమాణాలు.. ఆహార లభ్యత.. అద్దెలు.. పర్యావరణం ఇలా పది అంశాలపైనా అధ్యయనం జరిపిన తర్వాతే ర్యాంకులు డిసైడ్ చేస్తారు. అందుకే.. ఈ సంస్థ నివేదికను మొనగాడు లాంటి కంపెనీలు సైతం తమ నిర్ణయాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి.

భారతదేశంలో అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరమని మెర్సర్ నివేదిక తేల్చింది. ఢిల్లీ.. ముంబయి.. చెన్నై.. కోల్ కతా.. బెంగళూరు లాంటి నగరాలన్నీ కూడా హైదరాబాద్ తర్వాతేనని తేల్చింది. ఇక.. అంతర్జాతీయంగా అత్యుత్తమ నగరాల జాబితాలో తొలిస్థానం ఆస్ట్రియా రాజధాని వియెన్నాకు లభించింది. ఆ తర్వాత స్థానాల్లో జ్యూరిచ్‌ (స్విట్జర్లాండ్‌).. ఆక్లాండ్‌ (న్యూజిలాండ్‌).. మ్యూనిచ్‌ (జర్మనీ).. వాంకోవర్‌ (కెనడా) నిలవగా.. 230 నగరాలకు సంబంధించిన జాబితాలో చివరి స్థానం మాత్రం ఇరాక్ రాజధాని బాగ్దాద్ నిలిచింది.
Tags:    

Similar News